Sunday, December 19, 2010

'కళింగాంధ్ర జీవనశిల్పమే నా ప్రత్యేకత' సి.ఎస్.ఎన్. పట్నాయక్

శిల్ప, చిత్రలేఖనాల్లో సి.ఎస్.ఎన్. పట్నాయక్‌గారిది ప్రత్యేకమైన శైలి. కళాకారుడిగా ఆయన స్థానం అద్వితీయం. కళింగాంధ్ర జానపద సంస్కృతిని కంచు ప్రతిమల్లో ఆవిష్కరించి దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు నిర్వహించారు. పురస్కారాలు పొందారు. ప్యాలెట్ నైఫ్‌తో రంగులద్ది త్రీడీ ఎఫెక్టు తీసుకొచ్చే చిత్రలేఖన సంప్రదాయాన్ని శిల్పరచనలోనూ చొప్పించి ఫలితాన్ని సాధించారాయన. కంచు శిల్పకారుడుగా విశిష్టత చాటుకున్న ఈ అచ్చమైన గాంధేయవాది ఆసక్తికరమైన అనుభవాలే ఈ  జ్ఞాపకాలు...

ప్రవృత్తికి భిన్నమైన వృత్తిలో ఏడేళ్లు నలిగిపోయాను. అదీ బాగా నేర్చుకోవలసిన వయసులో. కానీ కళాభిరుచిని గమనించే సహృదయులు ఎక్కడో ఉండకపోరు. కాకపోతే వాళ్లు మనకు తారసపడడమే మన జీవితంలో ముఖ్యమైన మలుపుకి కారణమవుతుంది. నా జీవితంలోనూ అంతే. గానుగెద్దులా మారిపోనున్న నా జీవితాన్ని అయ్యదేవర కామేశ్వరరావు పంతులు గారనే మహానుభావుడు కాపాడి నాలో ఉన్న కళాకారుడికి ప్రాణం పోశారు.
మా ఊరు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం దగ్గర ఉన్న బాడాం. హైస్కూలు చదువంతా నరసన్న పేటలో సాగింది. సాగిందంటే సాగింది. ఎందుకంటే జాతీయ ఉద్యమం చాలా తీవ్రంగా సాగుతున్న దశ అది. ఆ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప ఆనందంమే కాని చదువు అయితే సరిగ్గా సాగలేదు.

నరసన్న పేటలో మా డ్రాయింగ్ టీచర్ సాంబశివరావు నాకు ఆదిగురువు. ఆయన పౌరాణిక నాటకాలకు నేపథ్య తెరలు కూడా చిత్రించేవారు. ఆయన ఆ తెరల మీద చిత్రించిన రాజుల ఆస్థానాలు, అడవులు, అంతఃపురాలు అద్భుతంగా ఉండేవి. ఆయనతోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. చదువుకి పనికిరానని మా నాన్న తొందరగానే గ్రహించి అంతే తొందరగా నన్ను కరణాన్ని చేశారు. చిక్కాలవలస గ్రామ కరణం బాధ్యతలు అప్పగించారు. అయిష్టంగానే ఏడు సంవత్సరాలు చేశాను. కాని చిత్రకళ పట్ల నా మక్కువ క్రమంగా పెరిగిందే తప్ప తగ్గలేదు. అప్పట్లో నార్త్ వైజాగ్ డిస్ట్రిక్‌లో శ్రీకాకుళం ఒక తాలూకా. జమాబందీ శ్రీకాకుళంలో జరిగేది - సుమారు పదిహేను రోజులు ఉండేది అది.

నేను రోజూ నాగావళి నది ఒడ్డున నాగేశ్వర ఫోటో స్టూడియో పక్కనుంచి ఆఫీసుకి వెళుతుండేవాడ్ని. అక్కడ కూర్మపు నరసింహంగారనే గొప్ప చిత్రకారుడుండేవారు. నేను రోజూ వస్తూ పోతూ చాలాసేపు అక్కడే గడిపేవాడిని. నా ఆసక్తి గమనించి ఆయన నేర్చుకుంటావా అని అడిగారు. నేర్చుకుంటానన్నాను. నాలోని కళాకారుడ్ని ఆయన గమనించారేమో! ఇక్కడుంటే ఇంతే, మద్రాసు పోయి ఫైన్ఆర్ట్స్‌లో చేరమన్నారు. కాని ఎలా సాధ్యం? మా నాన్న సాహసించలేకపోయారు. తాలూకా ఆఫీసులో నేను వేసిన గాంధీ చిత్రపటం పటం కట్టి ఉండేది. తహసీల్దార్ కామేశ్వర పంతులుగారు అది చూసి జమాబందీ కెళ్లినప్పుడు నన్నడిగారు. నాకు మద్రాసు వెళ్లాలనుందన్నాను. వారం తరువాత మా ఇంటికి కలెక్టర్ ఆఫీసునుండి సమన్లు వచ్చాయి. ఇంట్లో కంగారు. ఆందోళనతోనే బయలుదేరాం. ఆ సమన్లు చింపేసి 'అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. మద్రాసు పంపించండని మా నాన్నని ఒప్పించారు తహసీల్దారుగారు.

మా నాన్న ధాన్యం అమ్మి నాకు రెండు వందల రూపాయలిచ్చారు. వైజాగ్‌నుంచి మద్రాసు పన్నెండు రూపాయల చార్జి. 1950 మార్చిలో మద్రాసులో దిగాను. మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మహామహులతో కళకళలాడుతుండేది. ప్రిన్సిపాల్ దేవీప్రసాద్‌రాయ్ చౌధురి. ఉపాధ్యాయులు రాంగోపాల్, ధన్‌పాల్ , ఫణిక్కర్ ... ఒకరిని మించిన వారొకరు. ఫ్రీ హ్యాండ్ ఔట్‌లైన్, మోడల్ డ్రాయింగ్ పరీక్ష పాసైనందువల్ల, ప్రవేశ పరీక్షలో సెకండ్ ర్యాంక్ రావడం వల్ల నేరుగా రెండో సంవత్సరంలోనే చేర్చుకున్నారు. అప్పటికే పెళ్లయ్యింది. భార్యని తీసుకుపోయాను కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నన్ను బాగా ఆదుకున్నవారు నార్ల వెంకటేశ్వరరావు, ఖాసా సుబ్బారావు, శివలెంక శంభుప్రసాద్, పి.వి. రాజమన్నార్ గార్లు. నా పెయింటింగ్స్‌ని కొని ఆ రకంగా నన్ను గట్టెక్కించారు. దేవీప్రసాద్‌గారు చేసిన గొప్పగొప్ప శిల్పాలు చూసే భాగ్యం కూడా కలిగింది. అవి చూసి ఎంతో నేర్చుకున్నాను.

చదువు పూర్తయ్యాక 1955లో తాడేపల్లిగూడెం దగ్గరి పెంటపాడులో పి.జి. ప్రాథమిక శిక్షణా కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. జీతం నెలకు 155 రూపాయలు. హైస్కూలు టీచర్లు, హెడ్మాస్టర్లు, డి.ఇ.ఒలు మూడు నెలల పాటు శిక్షణ కొచ్చేవారు. అక్కడంతా గాంధేయ విధానం. ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. రూరల్‌లైఫ్, డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే అంశం మీద తరగతులు జరిగేవి. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇక్కడి విద్యార్థే. రాట్నం తిప్పడం నూలు వడకడం చేసేవాడ్ని కొన్నాళ్లు. నా చెప్పులు నేనే కుట్టుకునే వాడ్ని. గాంధీ శతజయంతి సంవత్సరంలో చాలా చిత్రాలు వేశాను. నా జీవితంలో స్వర్ణయుగమంటే అక్కడ పని చేసిన ఏడు సంవత్సరాలే. పాఠ్య బోధనలో భాగంగా విద్యార్థులతో కలిసి గ్రామాలు సందర్శించడం, ప్రజల జీవన విధానం పరిశీలించడం, గ్రామాలు శుభ్రపరచడం... అక్కడి మనుషుల్ని, పరిసరాల్ని బొమ్మలుగా చిత్రించడం ... నిత్యనూతనంగా ఉండేది జీవితం. నా జీవిత విధానమే కాదు, నా వస్త్రధారణ కూడా అక్కడే మారింది. మా ప్రిన్సిపాల్‌గారు 'గాంధీయిజం గురించి మనం బోధిస్తున్నప్పుడు మన వస్త్రధారణగూడా అలాగే ఉండాలి' అని అన్నారు. ఇక అప్పటి నుండి ఖద్దరు పంచె, లాల్చీయే ధరిస్తూ వచ్చాను.

1962 నుండి 1983 వరకు అంటే పదవీ విరమణ చేసేవరకు గుంటూరు విమెన్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఇన్ స్కల్ప్‌చర్ చేశాను. మొదట్లో నేను వేసినవన్నీ పెయింటింగ్సే. తరువాత కంచు శిల్పాలపై దృష్టి పెట్టాను. అప్పట్లో మన దేశంలో మూడు నాలుగు ప్రధాన నగరాల్లో తప్ప కంచు శిల్పాలు లేవు. 'ప్యాలెట్ నైఫ్‌తో పోర్ట్రెయిట్స్' నా స్పెషలైజేషన్. ఇందులో త్రీడైమెన్షన్స్ ఉంటాయి. ఇదే పద్ధతిలో ఫోర్ డైమెన్షన్స్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే ప్రయత్నమే కళాకారుడిగా నా ప్రత్యేకతని నిలబెట్టింది. అందుకు జానపద శైలి ఎంచుకున్నాను. కళింగాంధ్ర జీవనశైలిని ప్రపంచ వ్యాప్తం చేశాను.
ఈ కళ ఖరీదయినదైనా సొంత ఫౌండ్రీ ఉండేది నాకు. ఆర్డర్లు కూడా అదే స్థాయిలో వచ్చేవి కాబట్టి కొనసాగించగలిగాను. మా గురువులంతా చాలా గొప్పవారు. రాంగోపాల్, ధన్‌పాల్, ఫణిక్కర్... వాళ్లు చాలా నిజాయితీగా నేర్పబట్టే మేము చాలా నేర్చుకోగలిగాము. సొంత బిడ్డల్లా సాకే నిస్వార్థమైన గురువులు లభించడం కూడా నా అదృష్టమే.

ఒకసారి పర్యవేక్షణాధికారి మా కాలేజీకి వచ్చి 'మీ క్వాలిఫికేషన్ ఏమిటి?' అనడిగారు ప్రిన్సిపాల్‌ని. నాపేరే నా క్వాలిఫికేషన్ అన్నారు మా ప్రిన్సిపాల్. అదీ దేవీప్రసాద్ రాయ్ చౌధురి గొప్పతనం. ఆయన శిల్పాలు తయారు చేసేటప్పుడు చూపే ఏకాగ్రత, పనిముట్లు పట్టుకునే విధానం, మెరుగులు దిద్దే పద్ధతి నిద్రాహారాలు మాని గంటల తరబడి చూసేవాళ్లం. మొదట్లో సిగాయ్, వ్యానే, రూబెక్స్ రెమ్, బ్రాంట్‌లను అనుకరించాను. పెయింటింగ్‌లో మా గురువు కే.సి.యస్. ఫణిక్కర్ శైలికి ఆకర్షితుడినయ్యాను. కాని కళాకారుడుగా రాణించడానికి అవసరమైన విషయాలు నా జీవిత మూలాల్లోనే ఉన్నాయని గ్రహించాను. అందుకే కళింగాంధ్ర జానపదశైలిని ఎన్నుకున్నాను. నా చిత్రాలకు, శిల్పాలకు నమూనాలన్నీ నేను పుట్టి పెరిగిన ప్రాంతాల్లోని జానపదులే. శిక్షణలో భాగంగా క్రాఫ్ట్, వుడ్‌వర్క్, వీవింగ్ లెదర్ వర్క్ అన్నీ నేర్పించేవాళ్లం గాని, నేను మాత్రం కంచుతో పాటు టెర్రకోట వుడ్ మాధ్యమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడిని.

దేశ విదేశాల్లో ఇప్పుడు నా శిల్పాలున్నాయి. అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. లలితకళా అకాడమీ అధ్యక్షునిగా, స్కల్ప్‌చర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను. చాలా పురస్కారాలు పొందాను. మా ఆఖరి అబ్బాయి రవిశంకర్ ఒక్కడే ఈ రంగంలోకి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీ ఫైనార్ట్స్ విభాగానికి అధిపతిగా ఉన్నాడు. అతని భార్యా మంచి చిత్రకారిణే. మిగిలిన ముగ్గురబ్బాయిలూ మంచి స్థానాల్లో ఉన్నారు. నేను విద్యార్థిగా ఉన్నప్పటినుండీ నాకు చేదోడు వాదోడుగా ఉన్న నా భార్య శ్యామల సహకారం మరువలేనిది. ఇప్పుడు 86 సంవత్సరాలు నాకు. 1925 డిశంబర్ 6న పుట్టాను. ఈ యేడాదే గుంటూరు నుండి విశాఖపట్నానికి మకాం మార్చాను. ఎం.వి.పి. కాలనీలో పట్నాయక్ ఆర్ట్‌గ్యాలరీ ప్రారంభించాను. తమిళనాడులో దేశవాళీ కళా దేవాలయం ఒకటి ఉంది. అలాంటిది మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుందని నా ఆశ. విశాఖలోని కాపులుప్పాడ దగ్గర ఆర్ట్స్ విలేజ్ పూర్తి కావాలని నా కోరిక. ఈ ఆశలు, కోరికలు ఎప్పటికైనా తీరుతాయో లేదో...!

.............................................................
* పట్నాయక్ ఫోన్ నెం: 94907 88915
- జి.ఎస్. చలం

Wednesday, December 15, 2010

యూట్యూబ్‌లో కేక పుట్టిస్తున్న జతిన్

ఈ చిత్రంలో కనిపిస్తున్న కుర్రాడి కళ్లలోకి ఒక్కసారి చూడండి. ఎంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నట్లు ఉన్నాడో కదూ! అవును మరి. పట్టుమని పదహారేళ్లు కూడా నిండని ఈ కెనడియన్ కుర్రాడు జతిన్ బైబర్ యూట్యూబ్‌లో కేక పుట్టిస్తున్నాడు. ఇతని మ్యూజిక్ వీడియో 'బేబీ' ఈ ఏడాది ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది. యూట్యాబ్‌లో ఈ వీడియోను 40 కోట్ల మంది వీక్షించారు ఇప్పటికే. ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించిన యూట్యూబ్ వీడియోల జాబితాలో జతిన్ 'బేబీ' తొలిస్థానం దక్కించుకుంది.

కెనడా కుర్రాడు..
జతిన్ కెనడాకు చెందిన ఒంటారియో సమీపంలోని స్ట్రాట్‌ఫోర్డ్‌లో అందరు పిల్లల్లాగే బుద్ధిగా బడికి వెళ్లేవాడు. స్థానికంగా పేరున్న కొన్ని సంగీత సంస్థలు పోటీలు పెడుతుంటే వెళ్లి పాల్గొన్నాడు. తనకు ముందు నుంచి పాప్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఆ పోటీల్లో జతిన్‌కు ద్వితీయ బహుమతి వచ్చింది. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూడలేదు.

రాకెట్‌లా రివ్వున దూసుకెళ్లాడు. గిటార్, పియానో, ట్రమ్‌పెట్‌లలో తర్ఫీదు పొందాడు. తను పాటల పోటీల్లో పాడిన గీతాలన్నిట్నీ యూట్యూబ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఇంటర్‌నెట్‌లో మ్యూజిక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకొనే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. 13 ఏళ్ల వయసులోనే కోటిమంది అభిమానులయ్యారు. 'ఇదేదో బాగుందే' అనుకుంటూ తనకంటూ ఓ బ్రాండ్‌ను సృష్టించుకోవాలని మార్కెటింగ్ మేనేజర్‌ను కూడా పెట్టుకున్నాడు జతిన్. ఇద్దరూ ఓ రోజు అట్లాంటా వెళ్లి ప్రసిద్ధ సంగీతకారులు ఉషర్, టింబర్‌లేక్‌లను కలిశారు.

అప్పటికే వాళ్లకు జతిన్ పేరు బాగా తెలుసు. అందుకే, అందరూ కలిసి ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ చేద్దామనుకున్నారు. అంత పెద్ద సింగర్లతో పోటీపడి జతిన్ పాడిన పాటలు ఉర్రూతలూగించాయి. ఆ తర్వాత తనే సొంతంగా 'వన్ టైమ్' మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. ఇది అమెరికా, కెనడాలలో టీనేజర్లను కట్టిపడేసింది. ఈ సంచలనాన్ని చూసి ఎంటీవీ వాళ్లు జతిన్‌ను పిలిచారు. ఏటా జరిగే ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డులకు వ్యాఖ్యాతగా చేయమన్నారు. ఎగిరిగంతేశాడు జతిన్.

ఈ కార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులందరికీ పరిచయమయ్యాడు. తనకు తెలియకుండానే బిజీ బిజీ అయిపోయిన జతిన్.. ఇప్పటి వరకు పదులసంఖ్యలో ఆల్బమ్స్ విడుదల చేసి కోటీశ్వరుడు కూడా అయ్యాడు. ఆ పిల్లాడి ప్రతిభను చూసి.. 'బెట్', 'జూనో', 'ఎంవైఎక్స్'... అవార్డులు వరించాయి. తాజాగా యూట్యూబ్‌లో జతిన్ వీడియో 'బేబీ' తొలిస్థానంలో నిలవడంతో మళ్లీ ఒక్కసారిగా అందరినీ తనవైపు తిప్పుకున్నాడు ఈ పదహారేళ్ల పాప్ సింగర్.

Tuesday, December 14, 2010

ఏమిటి సంబంధం?

తెలివి గురించి ఎవరికెంత తెలుసో ఒకసారి మళ్లీ పరీక్షించుకుందాం. ఒక్కొక్క ప్రశ్నకు మూడు లేదా నాలుగు సమాధానాల చొప్పున చెప్పొచ్చు.

1. మీ దృష్టిలో మీకు తెలివి ఎక్కువా తక్కువా?
అది మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
నా పక్కనుండే మనుషులను బట్టి.
నేను మాట్లాడాల్సిన విషయాలను బట్టి.
నేను మౌనంగా ఉండగలిగిన అవకాశాలను బట్టి.

2. ఎక్కువనుకునే సందర్భాలు మీ జీవితంలో ఎప్పుడెప్పుడొచ్చాయి?
నా చుట్టూ ఉన్నవాళ్లు పొగిడినప్పుడు.
నా చుట్టూ ఉన్నవాళ్లు నా కంటే తెలివితక్కువవాళ్లని
నేను గ్రహించినప్పుడు.
నేను ఇతరులను మోసగించగలిగినప్పుడు.
ఆ ఇతరులు నా మోసాన్ని గ్రహించలేనప్పుడు.

3. తక్కువ అని జీవితంలో ఎప్పుడు అనుకున్నారు?
కోపంలో పరువు మర్యాదల విషయం మరిచిపోయినప్పుడు.
దాన్ని ఇతరులు అణకువకు చిహ్నంగా భావిస్తారనుకున్నప్పుడు.
ఒప్పుకోవడం వల్ల కొన్ని పనులు తప్పుతాయనుకున్నప్పుడు.
మరీ ముఖ్యంగా ప్రాణం దక్కుతుందనుకున్నప్పుడు.

4. తెలివికి ఖచ్చితమైన నిర్వచనం ఏదైనా ఉందా?
లేదు. ఉండడానికి అవకాశం లేదు.
అది ప్రాంతానికీ ప్రాంతానికి, సమాజానికీ సమాజానికి-
కాలానికీ కాలానికి, వృత్తికీ వృత్తికి-
వయస్సుకూ వయస్సుకు, మనిషికీ మనిషికి కూడా మారుతూ ఉంటే ఎవరైనా ఎలా నిర్వచిస్తారు?

5. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల మీద మీ అభిప్రాయమేమిటి?
వాటికీ తెలివికీ సంబంధమేమిటి?

Thursday, December 9, 2010

సువర్ణ చిత్రాలు * తైలవర్ణ చిత్రలేఖనం

తైలవర్ణ చిత్రలేఖనం అనేది ఆరిపోయే తైల మాధ్యమానికి నిబద్ధమై ఉండే వర్ణద్రవ్యాలను ఉపయోగించే ఒక చిత్రలేఖన ప్రక్రియ - ప్రారంభ ఆధునిక ఐరోపాలో ఈ చిత్రలేఖన పద్ధతిలో సీమ అవిసె నూనె (లిన్సీడ్గ ఆయిల్‌)ను ఎక్కువగా ఉపయోగించేవారు. తరచుగా సీమ అవిసె నూనె వంటి చమురును దేవదారు సర్జరసం (రెసిన్‌) లేదా ఫ్రాంకిన్‌సెన్స్‌ (వివిధ అరేబియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంత చెట్ల నుంచి తయారు చేసే ఒక సుగంధ భరితమైన జిగురు రెసిన్‌తో వేడిచేస్తారు. వీటిని ’వార్నిషూలు’ అని పిలుస్తారు.

artsతైల వర్ణచిత్రానికి ఈ తైలాలు తక్కువగా పసుపు రంగులోకి మారడం లేదా వివిధ ఆరిపోయే సమయాలు వంటి వివిధ గుణాలను అందిస్తాయి. తైలం ఆధారంగా వర్ణచిత్రాల జిలుగులో కొన్ని వ్యత్యాసాలు కూడా కనిపిస్తాయి. చిత్రకారులు తరచుగా ఒకే వర్ణచిత్రంలో ప్రత్యేక వర్ణద్రవ్యాలు మరియు వాంఛిత ప్రభావాల ఆధారంగా వివిధ తైలాలను ఉపయోగిస్తారు. మాధ్యమం ఆధారంగా వర్ణచిత్రాలు వాటంతటవే ఒక నిర్దిష్ట అనుగుణతను అభివృద్ధి చేస్తాయి. ఐదు, తొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లో మొదటిసారి తైల వర్ణద్రవ్యాన్ని ఉపయోగించినప్పటికీ, 15వ శతాబ్దం వరకు దీనికి ప్రాచుర్యం లభించలేదు. మధ్యయుగంలో దీని వినియోగం పశ్చిమ దేశాలకు విస్తరించినట్లు భావనలు ఉన్నాయి. తైల వర్ణద్రవ్యం యొక్క ప్రయోజనాలకు విస్తృత గుర్తింపు లభించడంతో, చివరకు ఇది కళాఖండాలు సృష్టించేందుకు ఉపయోగించే ప్రధాన మాధ్యమంగా మారింది. ఈ సంప్రదాయం ఉత్తర ఐరోపాలో ప్రారంభ నెదర్లాండ్‌ చిత్రలేఖనంతో మొదలైంది, పునరుజ్జీవనోద్యమ ఉన్నతి సమయానికి తైలవర్ణ చిత్రలేఖన పద్ధతులు ఐరోపాలోని అనేక దేశాల్లో టెంపెరా వర్ణద్రవ్యాల స్థానాన్ని పూర్తిగా ఆక్రమించాయి.

arts1ఆండెర్స్‌ జోర్న్‌, స్వీయ చిత్రణ 1897: సాంప్రదాయిక తైలవర్ణ చిత్రలేఖన పద్ధతులు తరచుగా కళాకారుడు కాన్వాస్‌పై బొగ్గు లేదా పలచని వర్ణద్రవ్యంతో వస్తువు యొక్క స్థూల రూపం గీయడంతోపాటు ప్రారంభమవుతాయి. పలచని, వేగంగా లేదా నెమ్మదిగా ఆరిపోయే వర్ణాన్ని సృష్టించేందుకు కర్పూర తైలం (టర్పెంటైన్‌), సీమ అవిసె నూనె, కళా తరగతికి చెందిన ఖనిజ ద్రావకాలను లేదా ఇతర ద్రావకాలను తైల వర్ణద్రవ్యానికి కలుపుతారు. ‘ఫ్యాట్‌ ఓవర్‌ లీన్‌’ అంటే తైల వర్ణద్రవ్యం యొక్క ఒక ప్రాథమిక సూత్రం, (అంటే తైలవర్ణ చిత్రలేఖనంలో స్థిరమైన వర్ణ పొరను సృష్టించేందుకు తక్కువ తైల-వర్ణ నిష్పత్తి (లీన్‌-పలచని) గల వర్ణంపై అధిక తైలం-వర్ణ నిష్పత్తి (ఫ్యాట్‌-మందమైన) గల వర్ణాన్ని అద్దే పద్ధతి). సరిగా ఆరిపోయేందుకు వర్ణద్రవ్యం యొక్క ప్రతి అదనపు వర్ణ పొర దాని కింది పొర కంటే ఎక్కువ తైల పరిమాణం కలిగివుంటుంది. ప్రతి అదనపు పొర తక్కువ తైల పరిమాణాన్ని కలిగివున్నట్లయితే, తుది వర్ణచిత్రంలో పగులు ఏర్పడటం మరియు పొర ఊడిపోవడం జరుగుతుంది. తైలవర్ణ చిత్రలేఖనంలో ఉపయోగిం చేందుకు చల్లని మైనం, రెసిన్‌లు మరియు వార్నిష్‌ల వంటి అనేక ఇతర మాధ్యమాలు కూడా ఉన్నాయి.

కాంతి సారకత, వర్ణం యొక్క మెరుపు, వర్ణం యొక్క సాంద్రత లేదా నిలిపివుంచే గుణాన్ని మరియు కుంచె గీతలను నిలిపివుంచే లేదా దాచే సామర్థ్యాన్ని సర్దుబాటు చేయడంలో ఈ అదనపు మాధ్యమాలు చిత్రకారుడికి సాయపడతాయి. ఈ చరరాశులు తైల వర్ణద్రవ్యం యొక్క వ్యక్తీకరణ సామర్థ్యంతో దగ్గరి సంబంధం కలిగివుంటాయి.

arts3సాంప్రదాయికంగా, వర్ణద్రవ్యాన్ని వర్ణాన్ని అద్దే ఉపరితలానికి పేయింట్‌ బ్రష్‌లతో పూస్తారు, అయితే పాలెట్‌ నైవ్స్‌ (చిత్రకారులు ఉపయోగించే కత్తులు) మరియు వస్త్రాల పేలికలు ఉపయోగించే ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. కళాకారులు ఉపయోగించే అనేక ఇతర పదార్థాల కంటే తైలవర్ణ చిత్రాలు ఎక్కువకాలం తడిగా ఉంటాయి, తద్వారా కళాకారుడికి వర్ణం, ఆకృతి లేదా బొమ్మ ఆకారాన్ని మార్చేందుకు వీలు ఉంటుంది. కొన్నిసార్లు, కళాకారుడు మొత్తం వర్ణపు పొరను తొలగించి, కొత్తదానిని ప్రారంభించవచ్చు. వర్ణద్రవ్యం తడిగా ఉన్నప్పుడు కొంత సమయంపాటు వస్తప్రేలిక మరియు కర్పూర తైలంతో పొరను తొలగించే వీలుంటుంది, అయితే గట్టిపడిన పొరను చెక్కి తొలగించాల్సి ఉంటుంది. తైల వర్ణద్రవ్యం ఆవిరికావడం వలన కాకుండా, ఆక్సీకరణ ద్వారా ఆరిపోతుంది, ఇది సాధారణంగా ఒక రోజు నుంచి రెండు వారాల్లో గట్టిపడుతుంది. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో వార్నిష్‌ పూసేందుకు వీలైన పొడిబారిన స్థితికి చేరుకుంటుంది. కళా పరిరక్షకులు 60 నుంచి 80 ఏళ్ల తరువాత తైల వర్ణచిత్రం పూర్తిగా ఆరిపోయినట్లు పరిగణిస్తారు.

తైలవర్ణచిత్రం పుట్టుక: తైలవర్ణ చిత్రలేఖనం ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి పశ్చిమ దేశాలకు విస్తరించాయనే వాదనకు ఇటీవలి పరిశోధనలు మద్దతు ఇస్తున్నాయి.1234 బామ్యాన్‌ బౌద్ధ విగ్రహాలు బయటపడిన తైల వర్ణచిత్రాల ఉపరితలాలు కవచాలు మాదిరిగా ఉన్నాయి. పోటీలు, అలంకరణలు రెండింటికీ వీటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. సాంప్రదాయిక టెంపెరా వర్ణాల కంటే తైల-ఆధారిత మాధ్యమంలో చిత్రాలు గీసినప్పుడు అవి మరింత మన్నిక పొందుతాయి.

arts2అనేక పునరుజ్జీవనోద్యమ మూలాలు, ముఖ్యంగా వాసారీ గ్రంథాలు, 15వ శతాబ్దపు ఉత్తర ఐరోపా చిత్రకారులు ప్రధానంగా జాన్‌ వాన్‌ ఐక్‌ చెక్క పలకపై తైల మాధ్యమాలతో చిత్రలేఖన ప్రక్రియను కనిపెట్టినట్లు సూచిస్తున్నాయి, అయితే థియోఫిలస్‌ వివిధ కళలపై 1125లో రాసిన తన గ్రంథంలో తైలవర్ణ ఆధారిత చిత్రలేఖనానికి స్పష్టమైన నిర్దేశాలను ఇచ్చారు. ఈ కాలంలో దీనిని బహుశా బాహ్య వినియోగం కోసం వివిధ రకాల శిల్పాలు, చెక్క అమర్పులకు రంగులు వేసేందుకు ఉపయోగించివుండవచ్చు.

అయితే 15వ శతాబ్దంలో ప్రారంభ నెదర్లాండ్స్‌ చిత్రలేఖనం తైలాన్ని సాధారణ చిత్రలేఖన మాధ్యమంగా మొదటిసారి ఉపయోగించింది, పొరలు మరియు తళుకుల వినియోగాన్ని అన్వేషించడం జరిగింది, దీని తరువాత మిగిలిన ఉత్తర ఐరోపా, ఆపై ఇటలీ ఈ చిత్రలేఖన పద్ధతిని స్వీకరించాయి. ప్రారంభ చిత్రాలు చెక్కపై పలక వర్ణచిత్రాలుగా ఉన్నాయి, అయితే 15వ శతాబ్దం ముగిసే సమయానికి కాన్వాస్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఇది తక్కువ ఖర్చుతో కూడుకొని ఉండటంతోపాటు, సులభంగా రవాణా చేసే వెసులుబాటు, పెద్ద కళాఖండాల సౄఎష్టికి అవకాశం కల్పించింది. తెరచాప-కాన్వాస్‌ సులభంగా దొరికే వెనిస్‌ నగరం దీనిని నేతౄఎత్వం వహించింది. ఉత్తర ప్రాంతం నుంచి ఇటలీకి వ్యాప్తి చెందిన తైలవర్ణాలు 15వ శతాబ్దంలో వెనిస్‌లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1540నాటికి పలకపై చిత్రాలు గీసే పూర్వ పద్ధతి టెంపెరా దాదాపుగా కనుమరుగయింది, అయితే ఉత్తర వాతావరణాల్లో ఇది బాగా కష్టమైన పనిగా ఉన్న కుడ్య చిత్రాలకు మాత్రం ఇటాలియన్‌లు ఫ్రెస్కోను ఉపయోగించడం కొనసాగించారు.

తైలవర్ణ చిత్రలేఖనానికి ఆధారాలు: పాల్మాయిల్‌ గియోవన్‌ గీసిన ఫ్రాన్సెస్కో సెయింట్‌ జోరెమ్‌, సుమారుగా 1590.ఇది రాగిపై తైలవర్ణ చిత్రలేఖనానికి ఒక అరుదైన ఉదాహరణ. సాంప్రదాయిక కళాకారుల యొక్క కాన్వాస్‌ను పీచు (లినెన్‌) నుంచి తయారు చేస్తారు, అయితే తక్కువ ఖర్చుతో కూడిన పత్తి వస్త్ర వినియోగానికి ప్రాచుర్యం ఏర్పడింది. స్ట్రెచర్‌ లేదా స్ట్రైనెర్‌గాపిలిచే ఒక చెక్క పలకను మొదట కళాకారుడు సిద్ధం చేసుకుంటాడు. మొదటి మరియు రెండోదాని మధ్య వ్యత్యాసం ఏమిటంటే స్ట్రెచర్‌లను కొద్దిగా సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది, ఇదిలా ఉంటే స్ట్రైనర్‌లు దృఢంగా , సర్దుబాటు చేయగలిన మూలలు కలిగివుంటాయి. కాన్వాస్‌ను తరువాత చెక్క చట్రంపై పరుస్తారు, వెనుకవైపు దీనిని బలంగా కట్టివేస్తారు. తరువాత, కళాకారుడు వర్ణద్రవ్యం యొక్క ఆమ్ల లక్షణాల నుంచి కాన్వాస్‌ను వేరుచేసేందుకు ఒక జిగురు పదార్థాన్ని పూస్తారు. సాంప్రదాయికంగా, కాన్వాస్‌పై జంతువుల జిగురు (సైజ్‌) పొరతో, (ఆధునిక కళాకారులు కుందేలు చర్మ జిగురును ఉపయోగిస్తారు) మరియు ప్రధానంగా సీసపు తెలుపు వర్ణంతో, కొన్నిసార్లు అదనపు సున్నంతో పూత పూస్తారు. పలకలను జిగురు మరియు సున్నం మిశ్రమమైన గెస్సోతో తయారు చేస్తారు.

ఆధునిక అక్రిలిక్‌ గెస్సోను ఒక అక్రిలిక్‌ బైండర్‌తో టైటానియం డైయాక్సైడ్‌ నుంచి తయారు చేస్తారు. దీనిని తరచుగా కాన్వాస్‌పై ఉపయోగిస్తారు, ఇక్కడ నిజమైన గెస్సో వినియోగానికి అనుకూలంగా ఉండదు. కళాకారుడు వివిధ గెస్సో పొరలను పూయవచ్చు, ఒక పొర ఆరిపోయిన తరువాత మరోదానిని పూయడం జరుగుతుంది. అక్రిలిక్‌ గెస్సోను గరుకు కాగితంతో గీకడం కష్టంతో కూడుకొని ఉంటుంది. ఒక తయారీదారు దీనికి అనుగుణమైన అక్రిలిక్‌ గెస్సోను తయారు చేశారు, అయితే పలకలకు మాత్రమే ఉద్దేశించబడింది, కాన్వాస్‌లకు పనికిరాదు.గత కొన్ని దశాబ్దాల్లో, అనేక కృత్రిమ కుంచెలు అందుబాటులోకి వచ్చాయి.

Sunday, December 5, 2010

యూట్యూబ్ సూపర్‌స్టార్

ఇరవై రెండేళ్ల కుర్రాడు ఏం సాధించగలడు? గొప్ప చదువు చదవగలడు. మంచి ఉద్యోగం సంపాదించగలడు. కాని అవి రెండూ పక్కన పెట్టి షేన్ డాసన్ యూట్యూబ్ స్టార్ అయ్యాడు. లక్షలమంది అభిమానులతో పాటు కోట్ల రూపాయలు సంపాదించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన షేన్ డాసన్ వీడియోల్ని యూట్యూబ్‌లో తిలకిస్తున్నవారి సంఖ్య ఏడాదికి దాదాపు నలభై లక్షలు.

ఇక ఆదాయం అంటే గత ఏడాది వీడియో క్లిప్పింగ్స్ మధ్యలో వేసిన ప్రకటనలకే మూడు లక్షల డాలర్లు వచ్చాయి. ఈ పాపులారిటే చూస్తుంటే అతను ఏ హాలీవుడ్ నటుడో లేదా పాప్‌గాయకుడో అన్న అనుమానం వస్తుంది. కాని డాసన్ సామాన్యుడు. పదేళ్ల వయసు నుంచే ఇంటర్నెట్ ప్రియుడు. సరదాగా యూట్యూబ్ వీడియోల్ని తయారుచేసేవాడు. ఆ విద్యే డాసన్‌ని ఇంటర్నెట్ సెలబ్రిటీని చేసింది. ఇంతకీ డాసన్ యూట్యూబ్ వీడియోల ప్రత్యేకత ఏంటి అంటారా? హాలీవుడ్‌లోని సెలబ్రిటీ పాత్రలకు, పాప్ సింగర్ల పాప్‌గీతాలకు పేరడీలు చేస్తాడు.

పేరున్న నటుల డూపులతో కామెడీ ఇంటర్వ్యూలు చేస్తాడు. ఇవి కాకుండా తన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులతో రకరకాల సర్కస్ ఫీట్లు వేయించి వాటిని కూడా వీడియోలుగా మలుస్తాడు. ఇలా రొటీన్‌కి భిన్నంగా ఆలోచించి తీసిన వీడియోలు డాసిన్‌కు కోట్లు సంపాదించి పెట్టాయి. 'ఏదో నలుగురిని నవ్వించడానికి చేసిన నా ప్రయోగాలు సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన వీడియోల్ని ఆదరించి, నన్నింత వాడిని చేసినవారికి నా కృతజ్ఞతలు' అంటాడు డాసన్.

బ్రిటన్ 'బీరు' బలుడు

ఇతను నిలబడింది సూపర్ మార్కెట్‌లో కాదు. అది అతని ఇల్లు. మీరు చూస్తున్నవన్నీ ఖాళీ బీరు క్యాన్లు. ఇంటి నిండా ఖాళీ సీసాలు ఎందుకు నింపుకున్నాడంటారా? పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు.. ఇది ఇతనికో హాబీ. 51 ఏళ్ల వయసున్న ఇతని పేరు నైక్ వెస్ట్. బ్రిటన్‌లో ఒక బ్యాంకు ఉద్యోగి. ఉత్తర సోమర్సెట్‌లోని క్లెవెండన్‌లో నివసిస్తున్నాడు.

నైక్‌కు ఈ హాబీ 1975 క్రిస్‌మస్ నుంచి మొదలైంది. అప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు. ఇతనికి కాబోయే భార్య డెబోర్ బీరు క్యాన్ల సేకరణకు సంబంధించిన ఒక పుస్తకాన్ని కానుకగా ఇచ్చింది. అంతేకాదు అతన్ని కూడా అలాగే క్యాన్లు సేకరించమని ప్రోత్సహించింది. అలా మొదలైన అలవాటుతో ఇప్పటి వరకు 6,788 బీరు సీసాలు సేకరించాడు. వీటన్నింటినీ అమర్చేందుకు అందమైన అరలను కూడా తయారు చేయించాడు. ఈ మధ్యే ఇల్లు సరిపోకపోవడంతో మరో కొత్త ఇంట్లోకి మారాడు ఈ బీర్ బలుడు.

గూగుల్ కారు

డ్రైవర్ లేకుండా రోడ్డు మీద సాఫీగా సాగిపోయే కారును ఊహించుకోండి. జేమ్స్‌బాండ్ సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుందనుకుంటున్నారా? గూగుల్ చేస్తున్న పరీక్షలు విజయవంతమయితే- అలాంటి కారు మరో ఐదేళ్లలో మన ముందుకు వచ్చేస్తుంది. ఈ ఏడాది ఈ ఇంటర్నెట్ కంపెనీ- పైరస్ అనే కారును ప్రయోగాత్మకంగా పరీక్షించింది.

రాడార్ సెన్సర్లు, వీడియో కెమెరాలు, లేజర్ రేంజ్ ఫైండర్లు, గూగుల్ మ్యాప్‌ల సాఫ్ట్‌వేర్‌ను అమర్చిన ఈ కారు ఇప్పటికే దాదాపు 2.3 లక్షల కిలోమీటర్లు తిరిగింది. అది కూడా ఒక్కసారి కూడా యాక్సిడెంట్ కాకుండా. ఇప్పటి దాకా డ్రైవర్ లేని కార్లను అమెరికా రక్షణ శాఖ మాత్రమే పరీక్షిస్తోంది. గూగుల్ ప్రయత్నాలు ఫలిస్తే- ఈ కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే అవకాశముంది.

Sunday, November 7, 2010

వహ్...వాచ్!!

122 వజ్రాలు పొదిగిన ఈ వాచీ మీ చేతికి కట్టుకుంటే తళతళా మెరిసిపోతుంది. ఎక్కడలేని హుందాతనాన్ని ఇస్తుంది. గడియారం చుట్టూ రెండు వరుసల్లో చక్కగా పొదిగిన తెల్లటి వజ్రాలు, సిల్వర్ లిజార్డ్ స్ట్రాప్, స్టెయిన్‌లెస్ స్టీల్ కలగలిపి ఫెర్గామ్స్ బ్రాండ్ తయారు చేసిన 'గాన్సినో' చూడగానే మగువలను కట్టిపడేస్తుంది. నాజూకైన వారి అందాన్ని రెట్టింపుచేసే ఈ వాచీ ధర సుమారు లక్ష రూపాయలు.

56 వజ్రాలతో తయారైన ఈ స్విస్ వాచీ స్టైలే వేరు. నిత్యం కొత్తగా కనిపించాలని ఉవ్విళ్లూరే వారికి 'గాన్సినో స్పార్క్‌లింగ్' అనే ఈ మోడల్ అతికినట్లు సరిపోతుంది. వాచీ అంచులో చతురస్త్రాకారంలో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేసిన అరలో మరో వజ్రం మెరుస్తుండటం దీని ప్రత్యేకత.

లేత నలుపు పట్టీతో అద్భుతమైన షేపింగ్ ఈ వాచీ సొంతం. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సమ్మోహన గడియారం ఫెర్గామ్స్ కంపెనీ వెలువరించింది.

ఒమెగా తయారు చేసిన ఈ గడియారం మగధీరుల హుందాతనాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. ఒరిజినల్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైంది. గంటలు, నిమిషాలు, సెకండ్లతోపాటు క్రోనోగ్రాఫ్ చూపిస్తుంది.

ఒమెగా స్పీడ్ మాస్టర్ మెన్స్ మూన్‌వాచ్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మార్కెట్‌లో లభిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే ఇలాంటి వాచీల కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీని ధర సుమారు 3.50 లక్షల రూపాయలు.

బంగారంతో తయారై, ఫస్ట్‌లుక్‌లోనే మనసు దోచుకునే ఈ గడియారం ఖరీదు కూడా చాలా ఎక్కువ. ప్రపంచ ప్రఖ్యాత లాంగిన్స్ కంపెనీ దీన్ని రూపొందించింది. నల్లటి పట్టీతో లైట్‌గా కనిపిస్తుంది కానీ ఎదుటివాళ్లకు మన వ్యక్తిత్వాన్ని పట్టి చూపిస్తుంది. ఈ గడియారం ఖరీదు : సుమారు 5 లక్షలు
లాంగిన్స్ కంపెనీ తయారు చేసిన మరో స్టెయిన్‌లెస్ స్టీల్ వాచీ ఇది. అన్ని కొలతలు బ్యాలెన్స్ అయ్యేలా అమరిన ఈ గడియారం ధవళకాంతులతో ఎదుటివాళ్లను ఒక్క నిమిషం మనవైపు చూపు తిప్పుకొనేలా చేస్తుంది. ఈ వాచీ ధర : రూ.2.30 లక్షలు. ఇదే ధరల శ్రేణిలో ఈ సంస్థ బోలెడు మోడల్స్‌ను తయారు చేసింది

. ఇన్నోవేటివ్ లుక్‌తో అదరగొట్టే గడియారాలు ఈ కంపెనీ సొంతం. ఒమెగా ఖాతాలో మరో కలికితురాయిలాంటి గడియారం 'మదర్ ఆఫ్ పెర్ల్ డయల్ అండ్ గ్రే బ్రాండ్. 18 క్యారెట్ల ఎల్లో గోల్డ్‌ను కరిగించి ప్రత్యేక డిజైన్‌తో దీన్ని తయారుచేశారు.

చతురస్త్రాకారంలోని ఈ గడియారం చుట్టూ స్టయిలిష్ డిజైన్‌తో వజ్రాలను అమర్చారు. కొడుకులు, కూతుళ్లు తల్లులకు ప్రజెంట్ చేసేందుకు ఈ గడియారం సరిపోతుంది. వెలకట్టలేని అమ్మ ప్రేమకు గౌరవంతో అందించే ఈ వాచీ ధర : 1.60 లక్షలకు పైగానే ఉంది.

స్టెయిన్‌లెస్ స్టీల్‌తో అచ్చుపోసిన ఈ గడియాన్ని ప్రత్యేకంగా మగవారి కోసం తయారు చేసింది టిస్సాట్ కంపెనీ. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఈ వాచీ నప్పుతుంది. వాచీలోపల తెలుపు మీద నల్లటి అంకెలు కళ్లకు చాలా ఇంపుగా అనిపిస్తాయి. చాలా అరుదుగా దొరికే డిజైన్‌లలో ఇదొకటి. స్మార్ట్ మెన్‌కు స్మార్ట్ వాచ్ అయిన దీని ధర : సుమారు 55 వేల రూపాయలు.

ప్రముఖ వాచ్‌మేకర్ గుస్సీ చాలా భిన్నమైన ఆకారాల్లో వాచీలను తయారు చేస్తుంటుంది. క్వార్ట్జ్ మూవ్‌మెంట్‌లో తయారైన ఈ వాచీ మహిళలకు కొత్త సొగసును ఇస్తుంది. వాచీ లోపల ఎలాంటి అంకెలు అచ్చువేయకుండా చాలా ప్లెయిన్‌గా డిజైన్ చేశారు. విలువైన 54 వజ్రాలను పొదిగిన ఈ వాచీ ధర : లక్షకు పైగానే ఉంది.

గడియారాల కంపెనీల్లో కార్‌టైర్‌కు ఉన్న ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. ఆ కంపెనీ బ్రాండ్ వాచీ చేతిలో ఉంటే చాలు, ఆ స్టయిలే వేరు. 18 క్యారెట్ల గోల్డ్‌తో మహిళల కోసం ముస్తాబైన ఈ వాచీని చూడగానే ఉద్వేగభరితమైన అనుభూతి కలుగుతుంది. వాచీ లోపల రోమన్ అంకెలు, ముద్దుగా కనిపించే ముల్లులతో కట్టిపడేస్తుంది.

గంటలు, నిమిషాలు, సెకండ్లు, తేదీలను మాత్రమే ఇది చూపిస్తుంది. చుట్టూ బంగారం, అంచులకు వజ్రాలతో మెరిసిపోతున్న ఈ వాచీ ధర : సుమారు ఆరు లక్షల రూపాయలు. 18 క్యారెట్ల పింక్ గోల్డ్‌తో చాలా అగ్రెసివ్ లుక్‌తో కనిపించే ఈ మగమహారాజుల వాచీని బ్రెయిట్‌లింగ్ తయారు చేసింది.

డార్క్ బ్రౌన్ స్ట్రాప్ రంగుకు సరిపోయే కలర్‌తోనే బాడీని తయారు చేశారు. రోమన్ అంకెలు వాడటంతో చాలా హుందాగా కనిపిస్తుంది. దీని ధర : నాలుగు లక్షల రూపాయలు. - ఆది మల్లెంపూటి

Monday, November 1, 2010

మాయదారి మనసు


ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారని అంటారు. కానీ ఏ ఇద్దరి వ్యక్తిత్వమూ ఒకే విధంగా వుండదని సైకాలజిస్టులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆలోచనలూ, గుణగణాలూ, ఇతర పద్ధతులూ కొన్ని కలిస్తే కలవ వచ్చేమో కాని, వ్యక్తిత్వంలో మాత్రం ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత వుండి తీరుతుంది.

ఈ మధ్య మా క్లినిక్‌కు ఓ వ్యక్తి వచ్చాడు. ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఏవీ లేవు. అన్నీ బాగానే వున్నాయి కాని, ఈ మధ్య తననొక చిత్రమైన సమస్య వేధిస్తూందని చెప్పాడు. గడ్డంతో వున్న యువకులను చూస్తే తనకు ఒక ఎలర్జీ లాంటి ఫీలింగ్ వస్తుందట. "అలా వచ్చినప్పుడు తన్నాలనిపిస్తుంది. వారెంత మంచివారైనా, అది నాకనవసరం. ఓ తెలుగు సినిమా హీరోకు చాలా ఫాలోయింగు ఉంది. అలాగే దక్షిణ భారతదేశంలో ఓ గాయకుడున్నాడు. అతనికున్న గడ్డం వల్ల, అతని పాట నాకు నచ్చదు."

"దానివల్ల వచ్చిన నష్టం ఏమిటి?"

"అదే చెప్తున్నాను. ఈ గడ్డం వాళ్లను చూస్తే బద్ధకస్థులనీ, గడ్డం గీసుకోడానికి బధ్ధకించేవారేమోననీ, అందుకే నాకిష్టం లేదనీ మొదట్లో నాకే అనిపిస్తుండేది. అంతెందుకు? గడ్డంగాళ్లను చూశాక ఇక సినిమాలే చూడకూడదనిపించింది. ఈ జబ్బేమిటో అర్థం కావటం లేదు."

"ఈ విధంగా గడ్డం వున్నవారు మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా, కొట్టారా?
అటువంటివారిని చూస్తే మీకెందుకు కోపమో మీరెప్పుడైనా బాగా ఆలోచించారా?"

"చాలాసార్లు ఆలోచించినా నాకేమీ అంతు చిక్కలేదు. ఇంతకూ నేనొచ్చిన సమస్య ఏమిటంటే, ఇప్పుడు నాకు కొత్త బాసు వచ్చాడు. అతనికి గడ్డం వుంది. నేను ప్రతిరోజూ అతనితో కనీసం నాలుగైదు గంటలైనా కలిసి వుండాలి. నేను ఎలా ప్రవర్తిస్తానో తలుచుకుంటే నాకే భయంగా వుంది. దీనికి మీరేమైనా చేయగలరా?"

"తప్పకుండా చేయగలను" అని చెప్పి, అతనికి హిప్నాటిజం, దానివల్ల కలిగే లాభాల గురించి చెప్పి, అతనికి హిప్నాటిజం పట్ల వున్న అపోహలను తొలగించి, నెమ్మదిగా ట్రాన్స్‌లోకి పంపాను. ఆ మత్తు స్థితిలో అతనికి బాల్యంలో రోజులు గుర్తు చేశాను. ఇంటి పరిస్థితులు, ఫ్రెండ్స్, స్కూలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. అతని స్కూలు ఆలోచనలు, ఫ్రెండ్స్‌తో తిరగటం, టీచర్లు, చుట్టాలు, హాజరైన సమావేశాలు, ఎక్కడైనా గడ్డం వున్న మనుషులతో ఘర్షణలు - ఇలా నెమ్మదిగా అడగడం ప్రారంభించాను. ఓ అరగంట తరువాత గడ్డం బూచాడు దొరికాడు. తరువాత ట్రాన్స్‌లోంచి బయటికి తీసుకొచ్చాను.

ఇంతకూ జరిగిందేమిటంటే, ఇతను స్కూల్లో చదివే రోజుల్లో ఒకనాడు ఫ్రెండ్‌తో కలిసి సైకిల్ మీద డబుల్స్ వస్తూంటే, ఒక కాన్స్‌టబుల్ చూశాడు. అతన్ని చూసి ఈ అబ్బాయి సైకిల్ స్పీడు పెంచాడు. దాంతో కాన్స్‌టబుల్ మండిపడి, మరో సైకిల్ మీద వెంబడించి పట్టుకుని, స్టేషన్‌కు తీసుకుపోయాడు. అక్కడున్న సబ్ఇన్స్‌పెక్టరు వీళ్లిద్దరినీ చెరో దెబ్బా వేసి తప్పించుకు పారిపోయినందుకు పిచ్చి తిట్లు తిట్టి, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ సబ్ఇన్స్‌పెక్టరుకు గడ్డం ఉంది. తరువాత ఇంటికి వచ్చేశారు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. వారం, పది రోజులు అది తలుచుకుని బాధపడ్డారు. ఆ తరువాత నెమ్మదిగా మరిచిపోయారు. కానీ ఆ గడ్డం మనిషి మనసులో ఎక్కడో ఓ మూల దాక్కుని వుండిపోయాడు. ఉద్యోగంలో చేరిన తరువాత గడ్డం వున్నవారిని చూసినపుడు చికాకు పడుతుండేవాడు.

సైకాలజీలో నిష్ణాతులైన జోసెఫ్‌లుఫ్త్, హారీఇంగం అనే వ్యక్తులు, తమ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని 'జోహారీ విండో' అనే ఒక పట్టిక తయారుచేశారు. ఇది కౌన్సిలింగ్ రంగంలో సంచలనం సృష్టించింది. ఇందులో నాలుగు విండోలు (కిటికీలు) వుంటాయి. ఒక్కొక్కటీ ఒక్కో లక్షణాన్ని తెలుపుతుంది.

మొదటి భాగంలోని అవగతం విషయాలు, మీకూ తెలుసు, ఇతరులకూ తెలుసు. అంటే మీ పేరు, ఊరు, మీ వృత్తి, మీరు చేసే పని వగైరాలు. రెండో భాగంలో విషయాలు మీకు తెలియదు. కానీ ఇతరులు గుర్తించారు. అవి మీ అహంకారం, కులాభిమానం, అసూయ, మీ మేనరిజంలు వంటివి. అంటే అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇతరులకు మీ పట్ల అభిప్రాయం వుంది. అది మీకు తెలియదు. మూడో భాగంలో విషయాలు ఇతరులకు తెలియవు. కానీ మీకు మాత్రమే తెలుసు. అంటే మీ వ్యక్తిగత రహస్యాలు, మీరు పొందిన అవమానాలు లేదా చేసిన తప్పుడు పనులు తదితరాలు. ఇక చివరగా అయోమయం అంటే ఆ ప్రవర్తనకు కారణం మీకు తెలియదు, ఇతరులకూ తెలియదు. అటువంటి చిత్రమైన పరిస్థితిలో సైకాలజిస్టులు మీతో మాట్లాడి, ప్రశ్నలు వేసి, మీ నుంచే సమాధానం రాబడతారు.

మన మనసులో ఒక అద్భుతమైన వీడియో లైబ్రరీ వుంది. అందులో మన బాల్యం నుంచి ఉన్న ఎన్నో వీడియో కేసెట్లుంటాయి. అప్పుడప్పుడు అవి చూస్తూ వుండటం మంచిది. వాటిలో సంతోషం కలిగించిన సన్నివేశాలెన్నో వుంటాయి. వాటిని పదేపదే మననం చేసుకుంటే మనకన్నా అదృష్టవంతులెవరూ వుండరు!
Dr. బి.వి. పట్టాభిరాం

ఒక్కసారి బ్రతికించు

                                                                               
    
పాపాలు పాపాలు
ఘోరమైన నేరాలు
అందుకు నరకంలో శిక్షలు
శూలాల్తో పొడుస్తారు
సలసలకాగే నూనెలో వేస్తారు
ఱంపాలతో కోస్తారు
చిత్రహింసలు పెడ్తారు
ఏం వింటేనే భయంగా ఉందా
అందుకే దేవుడి హుండీలో
లక్షలూ కోట్లూ పోస్తున్నావా
స్వాములు బాబాల చుట్టూ తిరుగుతున్నావా?
నీకీ సత్యం తెలియలేదేమో?
నరకంలో పెట్టే శిక్షలు
కాలి బూడిదైన నీ దేహానికేమో
నీ ఆత్మకు కాదేమో
నీ ఆత్మ నాశనరహితమైనది
గీతలో రెండవ అధ్యాయం చదవలేదా??

నైనం చిందన్తి శస్త్రాణి

నైనం దహతి పావకః
నచైనం క్లేదయన్త్యాపో
నశోషయతి మారుతః

పుణ్యాలు చేస్తే హాయిగా

పొందవచ్చు స్వర్గ సౌఖ్యాలు
మగచచ్చినాళ్ళయితే
రంభాది అప్సరసంయోగాలు

ఏమి పిచ్చి ఆలోచలు

ఏమి మూడ విశ్వాసాలు
నువ్వు చేసే పాపపుణ్యాల ఫలితం
నువు బ్రతికివుండగానే అనుభవిస్తావేమో
కొంచెం నిదానంగా ఆలోచించు
భవితలో కలిగే పరిణామాలను ఊహించు

ఊహూ! నీకు నమ్మకం లేదు

నమ్మకం రాదు
భయాందోళనా సమ్మిళితమైన భక్తితో
నీపాపాలను ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నావా?

ఓ అనంత సృష్టికర్తా

మానవాతీత అఖండ శక్తిదాయకా
నేను చచ్చిపోయాక
నా కట్టె కాల్చేలోపుగా
ఒక్కసారి బ్రతికుంచు
చచ్చాక అంతా శూన్యమేనని
ఇది నా స్వానుభవమని
ఈ నరకం స్వర్గం లేవని
అభూతకల్పనలేనని
పాపపుణ్యాల ఫలితాలు
ఇక్కడే అనుభవిస్తామని
ఈ సత్యాన్ని ఉద్ఘాటించి
మళ్ళీ చచ్చిపోతా!
- కాలనాథభట్ట వీరభద్ర శాస్త్రి

Monday, October 25, 2010

‘సహ్యాద్రి’

మన దేశానికి పశ్చిమ తీరాన్ని అనుకుని పర్వత శ్రేణులు ఉన్నాయి. వాటిని పశ్చిమకనుమలు అంటారు. ఈ పర్వతశ్రేణి గుజరాత్ నుండి గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను తాకుతూ కన్యాకుమారి వరకు వ్యాపించి ఉంది. 1, 59, 000 చదరపు కిలోమీటర్లున్న ఈ అందమైన పర్వతశ్రేణిని ‘సహ్యాద్రి’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 5000 రకాల పూల మొక్కలు, 139 రకాల జంతువులు, 508 రకాల పక్షులు నివాసముంటాయి.

అయితే కొన్ని దశాబ్దాలుగా మహారాష్టల్రో పెరుగుతున్న నగరీకరణ, గనులు, స్టీలు, విద్యుత్ కర్మాగారాలు, కర్ణాటకలోని ఆనకట్టలు, కేరళ, తమిళనాడులలో వ్యవసాయ భూముల కోసం అడవులను ఆక్రమించడంతోపాటు కాలు ష్యం కారణంగా సహ్యాద్రి అడవులు కుంచించుకుపోతున్నాయి.

1980లో పాండురంగ్ హెగ్డే ’Save western ghats'అనే ఉద్యమం మొదలు పెట్టారు. 20 చిన్న స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ఈ ఉద్యమం వల్ల 1984లో కర్ణాటకలోని ‘సెలైంట్ వ్యాలీ’లో ఆనకట్ట నిర్మా ణాన్ని ఆపి వేసి, ఆ ప్రదేశాన్ని ‘నేషనల్ పార్కు’ గా ప్రకటించారు.

2006లో ‘ప్రకృతి’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పరిచిన పాండురంగ్ హెగ్డే ఇప్పటికీ ఈ పర్వతశ్రేణిలోని అడవులను, పర్యావరణాన్ని సంరక్షించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు.

Sunday, October 3, 2010

ప్రాచీన చిత్రాలకు పునర్జన్మ!

పదిహేనవ శతాబ్ద్దపు ఇటలీ చిత్రకారుడు శాండ్రో బాటఛలీ గీసిన ‘ది బర్త్ ఆఫ్ వీనస్’ పెయింటింగ్‌కి నకలు చిత్రమిది. మామూలు డిజిటిల్ కెమెరాలోని రిజల్యూషన్ కన్నా మూడు వేల రెట్లు ఎక్కువ శక్తిమంతమైన టెక్నాలజీతో బొమ్మలోని ప్రతి అణువు స్పష్టంగా కనిపించేలా దీనిని ఎన్‌లార్జ్ చేశారు. రెండువేల ఎనిమిది వందల కోట్ల పిక్సెల్స్ సామర్థ్యంతో ఉండే ఈ చిత్రంలో ఏ భాగాన్నైనా మౌస్‌లోని రైట్ క్లిక్‌తో జూమ్ చేసుకుని చూడవచ్చు. దీంతో పాటు మరో ఐదు ప్రఖ్యాత చిత్రాలను త్వరలో డిజిటలైజ్ చేయబోతున్నామని ఇటలీలోని హెల్టా కంపెనీ వెల్లడించింది.


Wednesday, September 22, 2010

1+1+1 = 4 ?


సీనియర్ కేజీ క్లాస్‌రూమ్.
టీచరు లెక్కలు నేర్పిస్తోంది చిన్నారి పొన్నారి బాల బాలికలకు.
ఒక ముద్దొచ్చే కుర్రాడి వద్దకి వెళ్లి 'నేను నీకు ముందో యాపిల్ ఇస్తాను. తర్వాత ఇంకోటి, ఆ తర్వాత మరొకటి. నీ దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉంటాయి?' అని అడిగింది టీచరు. ఆ కుర్రాడు ఐదారు సెకండ్లు ఆలోచించి 'నాలుగు' అన్నాడు.

టీచరు ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్ల బట్టి మనసు లగ్నం చేసి పిల్లలకు ఎంతో ప్రేమగా, వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు నేర్పుతుంటే, ఇదేంటి ఈ బాలుడు ఇంత సులభమైన ప్రశ్నకి 'మూడు' బదులు 'నాలుగు' అని చెప్పాడు అనుకుని ఒకింత నిరుత్సాహపడింది.

కుర్రాడు సరిగ్గా విన్నట్లు లేదు, మళ్లీ అడుగుదామనుకుని బాబు జాగ్రత్తగా విను. నీకు ముందుగా ఒక యాపిల్ ఇచ్చాను. ఆ తర్వాత మరొకటి, మళ్లీ ఇంకొకటి. నీ దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉంటాయో సరిగ్గా ఆలోచించి ఈ సారి కరెక్టుగా చెప్పాలి అంది టీచరు ఎంతో లాలనగా..

కుర్రాడు టీచరు ముఖంలో ప్రస్ఫుటంగా కనబడుతున్న నిరుత్సాహాన్ని చూచాడు. వేళ్లమీద లెక్కపెట్టాడు, నెమ్మదిగా, ఎంతో జాగ్రత్తగా.. ఈ సారి టీచరుకు కరెక్టుగా సమాధానమివ్వాలనే పట్టుదలతో, మళ్లీ మరోసారి లెక్కపెట్టాడు 'నాలుగు' అని మెల్లగా సంకోచిస్తూ చెప్పాడు. మరింత నిరాశ ప్రస్ఫుటంగా కనబడుతోంది టీచరు వదనంలో.

ఏం చేయాలో పాలుపోలేదు టీచరుకి. కుర్రాడు తెలివి కలవాడు, క్లాసులో ఫస్టు వస్తాడు, మరేమిటీ విచిత్రం ఈ రోజున ఇంత చిన్న ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడు. బహుశా ఈ కుర్రాడికి యాపిల్స్ అంటే అయిష్టమేమో అందుకని మనస్సు లగ్నం చేయలేకపోతూ, సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాడేమో అనుకుని ఈ సారి మరో విధంగా అదే ప్రశ్న వేసింది.

బాబూ ఈసారి నిజంగా నీవు జాగ్రత్తగా విని సమాధానం చెప్పాలి సుమా. నీకు మొదటగా నేనే ఒక స్ట్రాబెరీ ఇచ్చాను. మళ్లీ మరో స్ట్రాబెరీ, ఆ తర్వాత ఇంకొకటి, నీ దగ్గర ఎన్ని స్ట్రాబెరీలు ఉన్నాయి.?

టీచరు ప్రశ్న మార్చి వేసినందుకు ఉత్సాహంగా ఉంది. కుర్రాడు కొంచెం భయంభయంగా ఉన్నాడు. చేతి వేళ్లతో ఒకటికి రెండు సార్లు లెక్కపెట్టి సందేహాత్మకంగా "మూడా'' అని ప్రశ్నిస్తున్నట్లుగా చెప్పాడు.

టీచరు ముఖంలో సంతోషం. ఆఫ్ట్రాల్ తాను చెబుతున్న చదువు వృధా కావటం లేదు అనుకుని మళ్లీ అంది కుర్రాడితో. శభాష్ కరెక్ట్ ఆన్సర్.
ఈ ప్రశ్నకు కూడా సరైన సమాధానమివ్వాలి. యస్ టీచర్, నీకు ముందుగా ఒక యాపిల్ ఇచ్చాను, తర్వాత ఇంకొకటి, మళ్లీ ఇంకొకటి. మొత్తం ఎన్ని యాపిల్స్ ఉంటాయి నీ దగ్గర.. ఠక్కున చెప్పాడు కుర్రాడు 'నాలుగు' అని. 'ఎలాగో చెప్పు' అంది టీచరు, కొంచెం కఠినంగా, గద్దిస్తున్నట్లుగా. నెమ్మదిగా భయంభయంగా వినీ వినపడ నట్లుగా అన్నాడు టీచరుతో " నా దగ్గర ఒక యాపిల్ ఉంది మేడమ్.''

కథలోని సారాంశమేమిటో ఊహించారా ? మనం ఊహించని సమాధానం ఎదుటి వారి నుంచి వస్తే అది తప్పు కానవసరం లేదు. వాళ్ల కోణం నుంచి మనం చూడలేకపోతూ ఉండవచ్చు. వాళ్లు చెప్పేది విని, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పడికట్టు విధానాన్ని ముందుగా నిర్ణయిం చుకొన్న నమ్మకాన్ని దూరంగా ఉంచితేనే అది సాధ్యపడేది.

'ప్రి-డిటర్మినెడ్ నోషన్' అంటూ ఉంటాం. అంటే చాలా విషయాల్లో ముందుగానే కొన్ని అభిప్రాయాలతో, నమ్మకాలతో ఉంటాం మనం. ఇది చెయ్యచ్చు, అది చేయకూడదు. తండ్రి ఇలా ఉండాలి. కొడుకు అలా నడుచుకోవాలి. ఆఫీసు ఇలా ఉండాలి. వ్యాపారం అలా నడవాలి. వగైరా వగైరాలు. చాలా విషయాల్లో ఒక నిశ్చయమైన అభిప్రాయానికి ముందుగానే వచ్చేస్తాం.

వాటిల్లో ఏదైనా మార్పు జరిగినా మనం ఏమైనా కొత్త కొత్త ప్రయోగాలు చేసినా వింతగా చూస్తుంది లోకం. వీడికి బుర్రుందా అసలు అనే విధంగా ప్రవర్తిస్తుంది మనతో. నాకదే జరిగింది. 1980లో హెడ్ క్వార్టర్స్ బాంబే, నేటి ముంబై. చిన్నా పెద్దా అన్ని అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు బాంబేలోనే ఏర్పడ్డాయి. అక్కణ్ణుంచే విస్తరించాయి. పేరు ప్రఖ్యాతులున్న అడ్వర్‌టైజింగ్ మేధావులందరూ బాంబేలోనే నివాసమేర్పరచుకున్నారు.

వీరిలో ఎక్కువ శాతం మంది కాన్వెంట్స్‌లో చదువుకున్నవాళ్లు, శ్రీమంతుల కుటుంబాలకు చెందిన వాళ్లు, ఇంగ్లీషు నాటకాల్లో పాత్రధారులు, డైరెక్టర్లు. పాశ్చాత్య పోకడలను పూర్తిగా జీర్ణించుకొని ఆ జీవన విధానాన్ని అనుసరిస్తున్నవారు. అంతేకాకుండా వారి మాతృభాష ఇంగ్లీషులోనే. ఆలోచనా రీతి, రాసే భాష ఇంగ్లీషే. స్థూలంగా 1980 దశకం నాటి అడ్వర్‌టైజింగ్ రంగం రూపురేఖలివి.

నేటి పరిస్థితులలో కూడా గొప్ప మార్పేమి కనబడదు. ఒకరో, ఇద్దరో మినహా ఆ రంగానికి చెందిన దిగ్గజాలం దరూ పాశ్చాత్య జీవన విధానానికి అలవాటైన వారే అంతెందుకు 2003లో నేను ముద్రా నుంచి నిష్క్రమిం చాక, అందాకా 23 ఏళ్లపాటు అహ్మదాబాదులో ఉన్న ముద్రా హెడ్‌క్వార్టర్స్ ముంబైకి మారి పోయింది. వీటినే పడికట్టు విధానాలు, నమ్మకాలు అనేవి.

అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీ అంటే ముంబైలోనే ఉండాలి. అడ్వర్‌టైజింగ్ రంగంలో నిలదొక్కుకోవాలంటే పాశ్చాత్య జీవనశైలిలో ప్రావీణ్యముండాలి. 'కాక్‌టైల్స్' ఎలా కలపాలో నేర్చుకోవాలి. అంతేకాదు, వాటి గురించి అనర్గళంగా గంటల తరబడి చర్చించగలగాలి. ఐదు నక్షత్రాల హోటళ్ల జీవిత శైలికి పూర్తిగా అంకితమవ్వాలి. ఆడామగా తేడా లేకుండా స్మోకింగ్, డ్రింకింగ్ చేయాలి. ఆడవారు క్రాఫులు చేయించుకోవాలి. మగవారు జడవేసుకోవాలి. పైగా చెవులకు పోగులు, రింగులు ఉండాలి. ఇలా ఎన్నో నమ్మకాలు, విధానాలు. ఇది మంచా చెడా అని నేను నిర్ణయించటం లేదు. అది నా బాధ్యత కాదు. చెప్పొచ్చేదేమిటంటే మనలో కొన్ని అభిప్రాయాలు. నమ్మకాలు జీర్ణించుకుపోయాయి. పనులు జరగాలనే నిర్ణయానికి ముందే వస్తాం.

1980లో ముద్రాను నేను అహ్మదాబాద్‌లో స్థాపిస్తే నవ్వని వారు లేరు. ఇదో ప్రపంచపు సరికొత్త వింతలా గోచరించింది. ఇది నడిచే సంస్థ కాదని, అందరూ ఒక నమ్మకానికొచ్చేసారు. పడికట్టు ఆలోచనలు, విధానాలే దానికి మూలకారణం. పైగా ఆనాటి అహ్మదాబాద్‌లో అడ్వర్‌టైజింగ్ రంగానికి సంబంధించిన ఎలాంటి వనరులు, వసతులు లేవు. రచయితలు కాని, మోడల్స్ కాని, ఫిల్మ్ నిర్మాతలు, డైరెక్టర్లు గాని, ఆ రంగానికి కావాల్సిన ఇతర నిపుణులు కాని ఎవ్వరు లేరు. ఆ రంగానికి పూర్తిగా ఎడారి ప్రాంతం. అలా మొదలైన ప్రస్థానం తొమ్మిదేళ్లలో ఒక ప్రభంజనంగా మారిపోయింది.

దేశంలోనే అతి పెద్ద అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీగా రూపుదిద్దుకొంది. బహుళ జాతి ఏజెన్సీలను కూడా కలుపుకుంటే, దేశంలోని మూడో ర్యాంకు ఏజెన్సీగా ఎదిగింది. వందల్లో పురస్కారాలు. ఆ రంగానికి చెందిన అన్ని పురస్కారాలు నాకు దక్కినాయి.

అంతేకాదు విమల్, రస్నా, సింఫనీ ఎయిర్‌కూలర్, ధారా రిఫైన్డ్ ఆయిల్, గోద్రెజ్, శాంసంగ్.. ఇలా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసింది ముద్రా.

1991లో దేశంలో కమ్యూనికేషన్ రంగంలో మొట్టమొదటి ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పింది. దాని పేరు ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్- క్లుప్తంగా మైకా అంటారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన విద్యాసంస్థ అది నేడు.

1980 దశకంలో గుజరాత్‌లోని ప్రతి చిన్నా పెద్ద వ్యాపార సంస్థలకు తమతమ అడ్వర్‌టైజింగ్ అవసరాల కోసం ముంబైలోని ఏజెన్సీలను వినియోగించుకునేవారు. ముద్రా స్థాపన జరిగాక వారి ముంబై ప్రయాణాలు ఆగిపోయాయి. దాదాపు అన్ని పెద్ద వ్యాపార సంస్థలతో ముద్రా పనిచేసే అవకాశాలను చేజిక్కించుకుంది.

అంతేకాదు 1993 నుంచి అడ్వర్‌టైజింగ్ రంగంలోని ఉద్దండులు మైకా రావటం మొదలుపెట్టారు అక్కడి విద్యార్ఢులకు విజిటింగ్/గెస్ట్ ఫ్యాకల్టీగా. ఇక విద్యార్ధులయితే దేశంలోని నలుచెర గుల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా రావటం మొదలు పెట్టారు. ఇదో పెనుమార్పే కదా. ఏమిటీ రహస్యం. పడికట్టు ఆలోచనలకు, విధానాలకు స్వస్థి చెప్పటంతోనే అన్ని విజయగాథలు మొదలయ్యేది.

కృషి, విక్రమార్కుని పట్టుదల.. అపజయాల్ని ఎదుర్కొని పోరాడటం.. ఇలాంటి సూత్రాలు, పద్ధతులే మనకు ఆయుధాలుగా మారేది. ఈ సూత్రాలు పద్ధతుల్లోకి మరింత వివరంగా వెళ్దాం వచ్చేవారం నుంచి గమనిస్తే జీర్ణించుకుపోయిన నమ్మకాన్ని, పద్ధతుల్ని పక్కకు నెట్టి అబ్బురపరిచే విజయాలతో పిన్న వయసులోనే మనకి మార్గదర్శకులైన వారు ఎందరో.

మీకు గూగుల్ సెర్చ్‌తో పరిచయముంటే ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'ఇండియన్ యంగ్ ఎచీవర్స్' అని టైపు చేయండి. వేలల్లో కాంతిపుంజాలు మీకు దర్శనమిస్తాయి. సంభ్రమాశ్యర్యాలతో మీలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని కలిగించి ఓ కొత్త జీవితపంథాకు నాంది పలుకుతాయి. అసాధ్యాలంటూ ఏముండవు గురువు గారు, అన్నీ సాధ్యాలే. మన ఆలోచనా రీతిని మార్చుకోవాలి అంతే ! నేనేమంత చదువుకున్న వాణ్ణి చెప్పండి ! అతి సామాన్యమైన గ్రాడ్యుయేట్‌ని. ఎటువంటి ఆర్థిక శక్తి, పరపతి లేని కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి.

కులం బలం లేని వాణ్ణి. గుజరాతీని కాదు..నేను స్థాపించిన ముద్రాకు ఎలాంటి వసతులు, వనరులు ఇవ్వలేని నగరం అహ్మదాబాద్. అయినా ముద్రా ఒక నిజం. మైకా ఒక నిజం.

పడికట్టు నమ్మకాలకు స్వస్థి చెప్పి, పట్టుదలతో, కృషితో నాస్తి దుర్భిక్షం అనే సంతృప్తితో ముందుకెళ్తే, ఏవీ అడ్డంకులు కావు. ఎవ్వరూ అడ్డురారు. ఆలోచించి చూడండి.


-ఎజి కృష్ణమూర్తి