
122 వజ్రాలు పొదిగిన ఈ వాచీ మీ చేతికి కట్టుకుంటే తళతళా మెరిసిపోతుంది. ఎక్కడలేని హుందాతనాన్ని ఇస్తుంది. గడియారం చుట్టూ రెండు వరుసల్లో చక్కగా పొదిగిన తెల్లటి వజ్రాలు, సిల్వర్ లిజార్డ్ స్ట్రాప్, స్టెయిన్‌లెస్ స్టీల్ కలగలిపి ఫెర్గామ్స్ బ్రాండ్ తయారు చేసిన 'గాన్సినో' చూడగానే మగువలను కట్టిపడేస్తుంది. నాజూకైన వారి అందాన్ని రెట్టింపుచేసే ఈ వాచీ ధర సుమారు లక్ష రూపాయలు.

56 వజ్రాలతో తయారైన ఈ స్విస్ వాచీ స్టైలే వేరు. నిత్యం కొత్తగా కనిపించాలని ఉవ్విళ్లూరే వారికి 'గాన్సినో స్పార్క్‌లింగ్' అనే ఈ మోడల్ అతికినట్లు సరిపోతుంది. వాచీ అంచులో చతురస్త్రాకారంలో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేసిన అరలో మరో వజ్రం మెరుస్తుండటం దీని ప్రత్యేకత.
లేత నలుపు పట్టీతో అద్భుతమైన షేపింగ్ ఈ వాచీ సొంతం. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సమ్మోహన గడియారం ఫెర్గామ్స్ కంపెనీ వెలువరించింది.

ఒమెగా తయారు చేసిన ఈ గడియారం మగధీరుల హుందాతనాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. ఒరిజినల్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైంది. గంటలు, నిమిషాలు, సెకండ్లతోపాటు క్రోనోగ్రాఫ్ చూపిస్తుంది.
ఒమెగా స్పీడ్ మాస్టర్ మెన్స్ మూన్‌వాచ్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మార్కెట్‌లో లభిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే ఇలాంటి వాచీల కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీని ధర సుమారు 3.50 లక్షల రూపాయలు.
బంగారంతో తయారై, ఫస్ట్‌లుక్‌లోనే మనసు దోచుకునే ఈ గడియారం ఖరీదు కూడా చాలా ఎక్కువ. ప్రపంచ ప్రఖ్యాత లాంగిన్స్ కంపెనీ దీన్ని రూపొందించింది. నల్లటి పట్టీతో లైట్‌గా కనిపిస్తుంది కానీ ఎదుటివాళ్లకు మన వ్యక్తిత్వాన్ని పట్టి చూపిస్తుంది. ఈ
గడియారం ఖరీదు : సుమారు 5 లక్షలు

లాంగిన్స్ కంపెనీ తయారు చేసిన మరో స్టెయిన్‌లెస్ స్టీల్ వాచీ ఇది. అన్ని కొలతలు బ్యాలెన్స్ అయ్యేలా అమరిన ఈ గడియారం ధవళకాంతులతో ఎదుటివాళ్లను ఒక్క నిమిషం మనవైపు చూపు తిప్పుకొనేలా చేస్తుంది. ఈ వాచీ ధర : రూ.2.30 లక్షలు. ఇదే ధరల శ్రేణిలో ఈ సంస్థ బోలెడు మోడల్స్‌ను తయారు చేసింది
. ఇన్నోవేటివ్ లుక్‌తో అదరగొట్టే గడియారాలు ఈ కంపెనీ సొంతం.

ఒమెగా ఖాతాలో మరో కలికితురాయిలాంటి గడియారం 'మదర్ ఆఫ్ పెర్ల్ డయల్ అండ్ గ్రే బ్రాండ్. 18 క్యారెట్ల ఎల్లో గోల్డ్‌ను కరిగించి ప్రత్యేక డిజైన్‌తో దీన్ని తయారుచేశారు.
చతురస్త్రాకారంలోని ఈ గడియారం చుట్టూ స్టయిలిష్ డిజైన్‌తో వజ్రాలను అమర్చారు. కొడుకులు, కూతుళ్లు తల్లులకు ప్రజెంట్ చేసేందుకు ఈ గడియారం సరిపోతుంది. వెలకట్టలేని అమ్మ ప్రేమకు గౌరవంతో అందించే ఈ వాచీ ధర : 1.60 లక్షలకు పైగానే ఉంది.

స్టెయిన్‌లెస్ స్టీల్‌తో అచ్చుపోసిన ఈ గడియాన్ని ప్రత్యేకంగా మగవారి కోసం తయారు చేసింది టిస్సాట్ కంపెనీ. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఈ వాచీ నప్పుతుంది. వాచీలోపల తెలుపు మీద నల్లటి అంకెలు కళ్లకు చాలా ఇంపుగా అనిపిస్తాయి. చాలా అరుదుగా దొరికే డిజైన్‌లలో ఇదొకటి. స్మార్ట్ మెన్‌కు స్మార్ట్ వాచ్ అయిన దీని ధర : సుమారు 55 వేల రూపాయలు.

ప్రముఖ వాచ్‌మేకర్ గుస్సీ చాలా భిన్నమైన ఆకారాల్లో వాచీలను తయారు చేస్తుంటుంది. క్వార్ట్జ్ మూవ్‌మెంట్‌లో తయారైన ఈ వాచీ మహిళలకు కొత్త సొగసును ఇస్తుంది. వాచీ లోపల ఎలాంటి అంకెలు అచ్చువేయకుండా చాలా ప్లెయిన్‌గా డిజైన్ చేశారు. విలువైన 54 వజ్రాలను పొదిగిన ఈ వాచీ ధర : లక్షకు పైగానే ఉంది.

గడియారాల కంపెనీల్లో కార్‌టైర్‌కు ఉన్న ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. ఆ కంపెనీ బ్రాండ్ వాచీ చేతిలో ఉంటే చాలు, ఆ స్టయిలే వేరు. 18 క్యారెట్ల గోల్డ్‌తో మహిళల కోసం ముస్తాబైన ఈ వాచీని చూడగానే ఉద్వేగభరితమైన అనుభూతి కలుగుతుంది. వాచీ లోపల రోమన్ అంకెలు, ముద్దుగా కనిపించే ముల్లులతో కట్టిపడేస్తుంది.
గంటలు, నిమిషాలు, సెకండ్లు, తేదీలను మాత్రమే ఇది చూపిస్తుంది. చుట్టూ బంగారం, అంచులకు వజ్రాలతో మెరిసిపోతున్న ఈ వాచీ ధర : సుమారు ఆరు లక్షల రూపాయలు. 18 క్యారెట్ల పింక్ గోల్డ్‌తో చాలా అగ్రెసివ్ లుక్‌తో కనిపించే ఈ మగమహారాజుల వాచీని బ్రెయిట్‌లింగ్ తయారు చేసింది.
డార్క్ బ్రౌన్ స్ట్రాప్ రంగుకు సరిపోయే కలర్‌తోనే బాడీని తయారు చేశారు. రోమన్ అంకెలు వాడటంతో చాలా హుందాగా కనిపిస్తుంది. దీని ధర : నాలుగు లక్షల రూపాయలు.
- ఆది మల్లెంపూటి
No comments:
Post a Comment