Sunday, December 5, 2010

యూట్యూబ్ సూపర్‌స్టార్

ఇరవై రెండేళ్ల కుర్రాడు ఏం సాధించగలడు? గొప్ప చదువు చదవగలడు. మంచి ఉద్యోగం సంపాదించగలడు. కాని అవి రెండూ పక్కన పెట్టి షేన్ డాసన్ యూట్యూబ్ స్టార్ అయ్యాడు. లక్షలమంది అభిమానులతో పాటు కోట్ల రూపాయలు సంపాదించాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన షేన్ డాసన్ వీడియోల్ని యూట్యూబ్‌లో తిలకిస్తున్నవారి సంఖ్య ఏడాదికి దాదాపు నలభై లక్షలు.

ఇక ఆదాయం అంటే గత ఏడాది వీడియో క్లిప్పింగ్స్ మధ్యలో వేసిన ప్రకటనలకే మూడు లక్షల డాలర్లు వచ్చాయి. ఈ పాపులారిటే చూస్తుంటే అతను ఏ హాలీవుడ్ నటుడో లేదా పాప్‌గాయకుడో అన్న అనుమానం వస్తుంది. కాని డాసన్ సామాన్యుడు. పదేళ్ల వయసు నుంచే ఇంటర్నెట్ ప్రియుడు. సరదాగా యూట్యూబ్ వీడియోల్ని తయారుచేసేవాడు. ఆ విద్యే డాసన్‌ని ఇంటర్నెట్ సెలబ్రిటీని చేసింది. ఇంతకీ డాసన్ యూట్యూబ్ వీడియోల ప్రత్యేకత ఏంటి అంటారా? హాలీవుడ్‌లోని సెలబ్రిటీ పాత్రలకు, పాప్ సింగర్ల పాప్‌గీతాలకు పేరడీలు చేస్తాడు.

పేరున్న నటుల డూపులతో కామెడీ ఇంటర్వ్యూలు చేస్తాడు. ఇవి కాకుండా తన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులతో రకరకాల సర్కస్ ఫీట్లు వేయించి వాటిని కూడా వీడియోలుగా మలుస్తాడు. ఇలా రొటీన్‌కి భిన్నంగా ఆలోచించి తీసిన వీడియోలు డాసిన్‌కు కోట్లు సంపాదించి పెట్టాయి. 'ఏదో నలుగురిని నవ్వించడానికి చేసిన నా ప్రయోగాలు సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన వీడియోల్ని ఆదరించి, నన్నింత వాడిని చేసినవారికి నా కృతజ్ఞతలు' అంటాడు డాసన్.

No comments:

Post a Comment