Saturday, April 9, 2011

జీబ్రాన్..ఓ మహర్ణవం

ఏ కాలంలోనైనా కొత్త సత్యాలను అర్థం చేసుకోవడంలో లోకం ఎక్కువ సమయమే తీసుకుంటుంది. అందుకే కొత్త సత్యాలు చెప్పేవారికి లోకంలో అంత తొందరగా గుర్తింపు రాదు. చాలా సార్లు కొందరికి బతికినంత కాలమూ ఏ గుర్తింపూ రాకపోవచ్చు. అలా బతికి ఉన్నంత కాలమూ పెద్ద గుర్తింపే రాని వారిలో ఖలీల్ జిబ్రాన్ ఒకరు. నిజంగా జిబ్రాన్ చెప్పిన తాత్విక సత్యాలన్నీ పూర్తిగా వినూత్నమైనవి. వచనాన్ని కూడా కవితాత్మకంగా చెప్పే ఆయన శైలి మనసును కొత్త లోకాలకు తీసుకు వెళుతుంది. కవిగా, రచయితగా, చిత్రకారుడుగా, తత్వవేత్తగా అపారంగా కృషిచేసిన ఖలీల్ జిబ్రాన్ వర్థంతి ఏప్రెల్ 10న. ఆ సందర్భంగా ఈ వ్యాసం...
ఒక సామాన్య రైతు కుటుంబంలో, లెబనాన్‌లోని బషీరే గ్రామంలో 1888 జనవరి 6న జన్మించాడు ఖలీల్ జిబ్రాన్. 19వ శతాబ్దం చివరి వరకు లెబనాన్ ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా చాలా అధోగతిలోనే ఉంది. జీవనం దుర్భరమైపోయిన ఈ స్థితిలో ఎంతో మంది ప్రజలు విదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వలస వె ళ్లారు. అలా వెళ్లిన వారిలో జిబ్రాన్ కుటుంబం ఒకటి.

జిబ్రాన్‌కు చిన్నప్పటి నుంచీ చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. ఆ సంగతి తల్లి గమనించి అతన్ని ప్రోత్సహిస్తూ ఉండేది. అమెరికాలో జిబ్రాన్ ఎంతో శ్రద్దగా చదువుకునే వాడు. కానీ, స్వదేశాభిమానం వల్ల, జిబ్రాన్ తిరిగి లెబనాన్ వె ళ్లిపోయాడు. పట్టభద్రుడయ్యాక ఒక సాహిత్య, ఆధ్యాత్మిక పక్షపత్రికకు కొంత కాలం ఎడిటర్‌గా పనిచేశాడు. 1901లో చిత్రలేఖనం నేర్చుకునేందుకు పారిస్ వెళ్లి అక్కడ రెండేళ్లు ఉన్నాడు.

దేశ ప్రజల జీవన విధానాలు, ఆచార వ్యవహరాలు, సంప్రదాయాలు, నియమాలు, ప్రభుత్వ శాసనాలు, చ ట్టాలన్నీ ఎంతో నిశితంగా పరిశీలించాడు. ప్రజల దైనందిన జీవితం ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలుసుకున్నాడు. లోక వ్యవహారాలు, భౌతిక విషయాలు పైకి సుఖంగా, ప్రోత్సాహకరంగా కనిపించినా అవి చాలా మందిని క్రూరంగా అణచివేస్తున్న విషయాన్ని గమనించాడు. మొత్తం మీద ప్రజలు ప్రకృతి సౌందర్యాన్నీ అనుభవించకుండా, అర్థరహితమైన సత్యదూరమైన యాంత్రిక జీవితం గడుపుతున్నార న్న సంగతి తెలుసుకుని అతని హృదయం ద్రవించింది.

గరళం తాగుతున్న ప్రజ

"అంధులైన ఆ ప్రజల్ని చూసి జాలిపడ్డాను. భయంకరమైన క్రూరమృగాల పెదాలను వారు ఇష్టంతో ముద్దుపెట్టుకుంటున్నారు. విషనాగుల గరళం పీలుస్తున్నారు. తమ సమాధి గోతుల్ని తామే తవ్వుకుంటున్నారు'' అంటూ జిబ్రాన్ వాపోయాడు.

మూఢాచారాల్ని, మూఢనమ్మకాల్ని నిరాకరించాడు. మానవజాతి పురోభివృద్ధికి మూల పురుషుల మనుకున్న వారు నిజంగా అనర్హులని భావించాడు. అక్రమం, దుర్మార్గం అనేవి లేకుండా ప్రజలు, భారరహితంగా, పరిపూర్ణ జీవితం గడపాలని ఆకాంక్షించాడు. ఎంతో ఆవేశంతో ఉద్రేకంతో మతపరమైన, సంఘపరమైన, ప్రభుత్వపరమైన పెద్దల్ని ఉద్దేశించి ఇంగ్లీషు, అరబిక్ భాషల్లో రచనలు చేయడం మొదలెట్టాడు. తన విశిష్టమైన మేధాసంపత్తితో మానవజాతిని జాగృతపరిచిన దార్శనికుడు జిబ్రాన్.

లెబనాన్ ప్రభుత్వ ప్రజా విద్రోహక చర్యలను ఖండిస్తూ 1903లో జిబ్రాన్ "స్పిరిట్స్ రెబెలియస్'' అనే ఒక పుస్తకం రాశాడు. ఆ గ్రం«థం లెబనాన్ దేశంలో ప్రజావిప్లవానికీ, తిరుగుబాటుకూ దారి తీస్తుందనే భయం పట్టుకుంది. శాంతి భద్రతలకు ఆ గ్రం«థం ప్రమాదకరమైనదని భావించి ఆ గ్రం«థ ప్రతులను బీరట్ అంగ డి వీధుల్లో తగుల బెట్టి జిబ్రాన్‌ను దేశం నుంచి బహిష్కరించింది ప్రభుత్వం. తిరుగుబాటులేని జీవితం వసంతం లేని రుతువుల్లా ఉంటుంది. "జీవితం, తిరుగుబాటు, ధర్మం'' ఈ మూడూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి'' అంటూ ప్రజల్లో విప్లవ భావాన్ని రేకెత్తించాడు. వాళ్లను అనేక విధాలా ఉత్సాహ పరుస్తూ, ఉత్తేజ పరుస్తూ అనేక రచనలు చేశాడు.

పరిపూర్ణ మార్గం... ప్రేమ

బీదవాడైన జిబ్రాన్ "మిస్ హేలా డాషర్ అనే ఒక ధనవంతుల అమ్మాయిని ప్రేమించాడు. లెబనాన్‌లో ధనవంతుల అమ్మాయిని పేదవాడు ప్రేమించడం నేరం. అమ్మాయి తల్లిదండ్రులు మరొక సంబంధం చూసి వివాహం చేశారు. అలా జిబ్రాన్ తొలి ప్రేమ భగ్నమైపోయింది. "ద బ్రోకెన్ వింగ్స్'' అనే తన గ్రం«థంలో తన ప్రియురాల్ని సెల్మా అనే పేరుతో చిరస్మరణీయం చేశాడు. అయితే ఆ గ్రం«థం యువతలో విషం నింపుతుందని, అది వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేసేలా ఉందని, ఆ పుస్తకం విషం కలిపిన తేనెలాంటిదని విమర్శిస్తూ ఆ పుస్తకాన్ని తగల బెట్టమని కొందరు బహిరంగ ప్రకటనలు చేశారు. జిబ్రాన్ దీనికి జిబ్రాన్ "నా రచనల్లో తేనె కలుపుతున్నానని వారు అంటున్నారు నిజానికి నేను ఎక్కువ గా కలిపింది విషమే. అయితే వాళ్ల పొట్టలు దాన్ని జీర్ణించుకోలేవు'' అంటూ ఘాటుగా బదులిచ్చాడు.

జిబ్రాన్ వద్ద బొత్తిగా డబ్బులేని సమయంలో ఒక ధనవంతురాలు అతన్ని ఆదరించింది. అతని పెయింటింగ్స్‌కి మోడల్‌గా తోడ్పడింది. ఆ కాలంలోనే జిబ్రాన్ ఎన్నో పెయింటింగ్స్ వేశాడు. ఆ తరువాత అతడు ఏర్పాటు చేసిన ఒక ఎగ్జిబిషన్‌ను దర్శించిన మిస్ మేరీ హోస్కెల్ అనే ఆమె తన స్కూలు తరపున ఆ పెయింటింగ్స్ అన్నిటినీ కొనేసింది. అయితే మిస్ మేరీ హేస్కెల్ స్కూల్లో పనిచేసే ఒక టీచర్‌ను జిబ్రాన్ ప్రేమించాడు. కానీ, ఆమెను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించకపోవడంతో ఆమె అతనితో తన అనుబంధాన్ని తెంచేసుకుంది. అయతే హేస్కెల్‌చేసే అపారమైన ధనసహాయానికి కృతజ్ఞతగా ఏం చేయాలో తోచక జిబ్రాన్ ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. నిజానికి పెళ్లి చేసుకోవాలన్న బలమైన భావన అతనిలో లేదు.

అది గమనించిన హేస్కెల్ జిబ్రాన్‌తో వివాహ బంధానికీ అంగీకరించలేదు. ఆ సంఘటనతో జిబ్రాన్ జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. ఆ తరువాత చేసిన అతని రచనలన్నిటినీ హేస్కెల్ కే అంకితం ఇచ్చాడు. హేస్కెల్ వ్యవహారంతో జిబ్రాన్ మనసులోంచి వివాహ విషయం శాశ్వతంగా తొలగిపోయింది. ఆ తరువాత కూడా అతని జీవితంలోకి స్త్రీల ప్రవే శం ఆగలేదు. కానీ ఏ ఒక్కరినీ వివాహం చేసుకోలేదు. అప్పటికే "తనను తాను పరిపూర్ణం చేసుకోవడం తప్ప ప్రేమకు మరో ఉద్దేశం ఉండకూడదు'' అనేది నిశ్చితాభిప్రాయానికి జిబ్రాన్ వచ్చేశాడు.

అమెరికా వాసం

1908లో లెబనాన్ దేశానికి కొత్త ప్రభుత్వం వ చ్చింది. జిబ్రాన్ పై టర్కీ ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. అయితే 1912లో జిబ్రాన్ అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడిపోయాడు. ఆయన రచనలలో తల మానికమైనది 'ది ప్రాఫెట్ '(ప్రవక్త)గ్రం«థం 1923లో అచ్చయింది. ఈ కావ్యాన్ని ముందు అరబిక్ భాషలో రాసి ఆ తరువాత తానే ఇంగ్లీషులోకి అనువదించాడు.

ఆ తరువాత వచ్చిన 'వాయిస్ ఆఫ్ ది మాస్టర్ (మహార్ణవం)' అనే గ్రంథం కూడా ఒక గొప్ప కావ్యంగానే నిలబడింది. వాస్తవానికి ఆయన ప్రతి రచనల్లోనూ కొంగొత్త తాత్విక సత్యాలు కనిపిస్తాయి. ఒక ప్రాఫెట్ (ప్రవక్త) లోనే మనకు అమూల్యమైన ఎన్నో సత్యాలు కనిపిస్తాయి. వివిధ అంశాల మీద శిష్యుడు వేసే ప్రశ్నకు గురువు ఇచ్చే తాత్విక, కవితాత్మక సమాధానాలతో ఈ గ్రంథమంతా సాగుతుంది. వాటిలో కొన్ని...

ప్రేమ:
ప్రేమ మిమ్మల్ని పట్టాభిషిక్తుల్ని చేసినట్లే, అది మిమ్మల్ని శిలువ కూడా వేయిస్తుంది. అది మీ పురోభివృద్ధికి తోడ్పడుతున్నట్లే మిమ్మల్ని తెగటార్చడానికి అది సిద్ధమవుతుంది. పండిన ధాన్యం కంకుల్ని కోసి, కుప్పేసినట్లు, ప్రేమ మిమ్మల్ని తన దగ్గరకు తీసుకుంటుంది. ధాన్యాన్ని రాలగొట్టినట్లు, ప్రేమ మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తుంది. మీ హృదయ ర హస్యాలు మీరు తెలుసుకునేందుకు ప్రేమ ఇవన్నీ చేస్తుంది.

సంతానం:
మీ పిల్లలు మీ పిల్లలు కారు. తన పరిపూర్ణత కోసం జీవితం పడే తపన ఫలితంగా ఆవిర్భవించిన వారే. పిల్లలు మీ ద్వారా ఆవిర్భవిస్తారే కానీ, మీ నుంచి కాదు. వారు మీతో ఉన్నా మీకు సంబంధించిన వారేమీ కాదు. మీ ప్రేమను వారికి ఇవ్వగలరేమో కానీ, మీ ఆలోచనలను వారికి ఇవ్వలేరు. జీవితం వెనక్కిపోదు. గతంవలో కలసి వెనుక దిగబడీపోదు. వారిని మీ వలె తయారు చేయాలని చూడకండి.
శ్రమ తత్వం:
సోమరిగా ఉండడం అంటే రుతువులకు అపరిచితులుగా ఉండడం. అనంతత్వం వైపు గంభీరంగా, గర్వంగా సాగిపోయే జీవిత ప్రస్తానం నుంచి వైదొలగడం. భూమితోనూ, దాని ఆత్మతోనూ మీరు సమంగా స్పందించడమే శ్రమించడం. శ్రమ ద్వారా జీవితాన్ని ప్రేమించడం, నిగూఢమైన జీవిత రహస్యాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం.
ఆనందం:
దుఃఖం కన్నా ఆనందం గొప్పదని మీలో కొందరు అంటారు. కాదు, దుఃఖమే గొప్పదని మరికొందరు అంటారు. కానీ, ఆ రెండూ అభేద్యమైనవని నేనంటాను. ఆ రెండూ ఎప్పుడూ కలిసే వస్తాయి. ఒకటి మీ సహపంక్తి భోజనానికి కూర్చుంటే రెండవది మీ శయ్యపై నిద్రిస్తూ ఉంటుంది.
మృత్యువు :
చనిపోవడం అంటే గాలిలో నగ్నంగా నిలబడటం, సూర్యకాంతికి కరగడం. శ్వాస ఆగిపోవడం అంటే, విరామం లేని ఉచ్ఛ్వాస-నిశ్వాసలనుంచి శ్వాసను స్వేచ్ఛగా పరచడం, స్వేచ్ఛ పొందిన ఆ శ్వాస పైకెగసి విశ్వమంతా వ్యాపించడం.ప్రాఫెట్ గ్రంథంలోని ప్రతి అధ్యాయమూ ఇలాగే సాగుతుంది.
చివరిగా....

జిబ్రాన్ ఏకాంత వాసంలోనే సంపూర్ణ జీవితం ఉందని భావించాడు. ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడానికి ఏకాంతమే సరియైన స్థితి అనుకున్నాడు. అందుకే తన చివరి సంవత్సరాలన్నీ ఎవరితోనూ , దేనితోనూ సంబంధం లేకుండా న్యూయార్క్ నగరంలో ఏకాంతంగా గడిపాడు.

ఆ స్థితిలో అతన్ని చూడ్డానికి ఎందరో మేధావులు-పండితులు, తత్త్వవేత్తలు వచ్చే వారు. అలాంటి వారిలో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. ఖలీల్ జిబ్రాన్ తన 48వ ఏట అంటే ఏప్రిల్ 10, 1931న తుది శ్వాస విడిచాదు. జిబ్రాన్ అంతిమ కోరిక మేరకు అభిమానులు అతని మృతదేహాన్ని లెబనాన్ తీసుకు వెళ్లి అతని స్వగ్రామంలో సమాధి చేశారు. ఆ గ్రామం క్రమంగా ఒక యాత్రా స్థలంగా మారింది. ఆయన ఉపయోగించిన వస్తువుల్ని రాసిన గ్రంథాల్ని, గీసిన చిత్రాల్ని ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ఆయన్ని ఒక ప్రవక్తగా ఇప్పటికీ ఆరాధిస్తున్నారు
- బమ్మెర

No comments:

Post a Comment