మనం టీవీల్లోనో, న్యూస్‌పేపర్లలోనో చూస్తే... ఆఫ్రికా దేశాల్లో నిత్యం ఏదో ఒక అలజడి జరుగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈ దేశాల గురించి చాలామందిలో ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ, అది కరెక్ట్ కాదు. నేను నాలుగేళ్ల నుంచి ఘనా రాజధాని అక్రాలో ఐనెక్సో కంపెనీలో ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నాను.
మన దేశం కంటే ఈ దేశం ఎన్నో రెట్లు మేలు. ఎన్నికలప్పుడు తప్పిస్తే- అల్లర్లు, బందులు, ధర్నాలు అస్సలు కనిపించవు. మన దగ్గరున్నట్లు ఒకడిమీద ఒకడు దుమ్మెత్తిపోసుకునే రాజకీయాలైతే అసలు లేవు. సహజ వనరులు పుష్కలం. వ్యవసాయంతోపాటు ఆయిల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకే, ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఘనావైపు చూస్తున్నారిప్పుడు.
ఇక్కడ 'టొట్రో' అని పిలిచే పెద్ద ఆటోలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఒక్కో ఆటోలో 20 మంది వెళ్లవచ్చు. అయిదు కిలోమీటర్లకు 50 పేస్వాస్ (మన పైసలులాగ) తీసుకుంటారు. రోడ్లు మనకంటే మెరుగు. తిండి విషయానికొస్తే ఘనాలో చాలా వెరైటీ ఉంటుంది. మనం అన్నం, పప్పు తిన్నట్లే వాళ్లు 'ఫుఫు', 'యామ్' అనే పదార్థాల్ని రోజూ తింటారు. మైదా, పచ్చి అరటికాయలు, మరికొన్ని దినుసులు వేసి బాగా ఉడకబెట్టి, దంచి ఒక వంటకం చేస్తారు. దాన్ని వేరుసెనగ సూప్‌తో కానీ, చికెన్ సూప్‌తో కానీ కలిపి లాగిస్తారు. 'కెన్కా' అనే మరో రకం తిండి ఉంది.
దాన్ని పల్లెల్లో పండే జొన్నలతో చేస్తారు. 'వాచె' అనే ఆహారాన్ని బియ్యం, అలసందలు, కారంపొడితో వండుతారు. చికెన్, ఎద్దుమాంసం దుమ్ములేపుతారు. ఆఫ్రికన్లు శారీరక శ్రమ ఎక్కువ చేస్తుంటారు కాబట్టే ఇలాంటి బలవర్ధకమైన తిండి తింటారు. మేము కూడా ఈ తిండికి అలవాటు పడ్డాం. అక్కడ మన సరుకులు కావాలంటే 'సాగర్ ఘనా లిమిటెడ్', 'శివసాయి', 'షాప్‌రైట్' అనే మూడు భారతీయ దుకాణాలున్నాయి. వీటిలో బియ్యం, పప్పులు, మసాలా దినుసులన్నీ దొరుకుతాయి. ఏం ఇబ్బంది లేదు.
సహజవనరులే ఘనాకు సిరిసంపదలు. బంగారం, వజ్రాల ఉత్పత్తిలోనూ ఈ దేశం ముందుంది. ఇక, హస్తకళలైతే చెప్పనవసరం లేదు. చాలా వెరైటీల్లో కళాఖండాలు దొరుకుతాయి. పంటల సంగతికొస్తే- ఘనాలో ప్రకృతి వైపరీత్యాలు లేకపోవడం వ్యవసాయానికి బాగా సానుకూలం. భూకంపాలు, వరదలు కూడా ఉండవు. సహజ వాతావరణ ఉంటుంది. సారవంతమైన భూములున్నాయి. వర్షాధారం మీదనే సేద్యం చేస్తుంటారు.
వ్యవసాయం ఘనాలో ఇప్పుడు లాభదాయకమైన వ్యాపారం. అందుకే, మన తెలుగువాళ్లు కూడా ఇక్కడికొచ్చి సేద్యం చేస్తున్నారు. చాక్లెట్‌లలో వాడే కోకోను బాగా పండిస్తున్నారు. ఘనాలో ఓల్టాలేక్ అతిపెద్ద మ్యాన్‌మేడ్ (మానవ నిర్మిత) లేక్. ఏడాది పొడవునా నీరు పుష్కలం. ఈ సరస్సు కింద వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలు, పళ్లు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.
ఇంగ్లీషు అంతగా రాదు
ఈ మధ్య కాలంలో చాలామంది ఘనా విద్యార్థులు ఇండియాకు వచ్చి చదువుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి బలమైన సంస్కృతి నడుమ పెరిగిన ఘనావాసులు ఇంగ్లీషు అంత బాగా మాట్లాడలేరు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కనీసం 16 ప్రాంతీయ భాషలు మాట్లాడతారు. మారుమూల గ్రామాల్లో అయితే మనుషులంతా మొరటుగా కనిపిస్తారు. శరీరం మీద ధరించే పూసలు, దుస్తులు.. అన్నీ భక్తితో చేస్తారు. కొత్త జనరేషన్ మాత్రం ఈ జీవనశైలికి దూరం అవుతోంది. పాశ్చాత్య ప్రభావం ఈ దేశంలో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఘనా అభ్యర్థులకు ఇంగ్లీషు సమస్య మూలంగానే ఉద్యోగాలు రావడం కష్టంగా ఉంది. మన హైదరాబాద్, బెంగుళూరులో ఉన్నట్లు సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేవు. ఇటీవలే విప్రో, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ తమ బ్రాంచ్‌లను ఓపెన్ చేశాయి. వీసాల విషయానికొస్తే- మన దేశం నుంచి వచ్చే వాళ్లకు సులువుగానే దొరుకుతున్నాయి. పొరుగునున్న నైజీరియా అవినీతిలో ఫస్ట్. అందుకే వాళ్లను ఘనాలోకి అడుగుపెట్టనివ్వాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
వినాయక చవితి బాగా చేస్తారు
ఎందుకో మరి ఇండియా, పాకిస్తాన్ విడిపోయినప్పుడు ముస్లింలు ఈ దేశానికి పెద్దఎత్తున వలసొచ్చారు. వచ్చీరాగానే వ్యాపారంలో స్థిరపడిపోయారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ముస్లింలవే. ఇండియా నుంచి వలసొచ్చిన వారిలో సిం«ధీలు, గుజరాతీలు, తమిళులు, ఆం«ద్రులు ఎక్కువగా కనిపిస్తారు. ఘనా ఒక్కటే కాదు. ఈ దేశం చుట్టుపక్కల దేశాల్లో కూడా మన తెలుగువాళ్లు ఉన్నారు.
వినాయక చవితిని ఘనంగా చేస్తారిక్కడ. ఘనా దేశస్తులకైతే ఈస్టర్, క్రిస్‌మస్, రంజాన్ పెద్ద పండుగలు. కాలక్షేపానికి కొదవలేదిక్కడ. ఆఫ్రికావాళ్లంటే నల్లోళ్లు మొరటోళ్లు అనుకుంటాం మనం. వాళ్లు చేసేంతగా ఎంజాయ్ మనం చేయలేం. ఆఫీసుల్లో ఎంతపనైనా ఉండనీ వారానికి అయిదు రోజులే ఉద్యోగం. శని, ఆదివారాలు ఇళ్లలో ఉండరు. బీచ్‌లకు పరిగెత్తుతారు. అట్లాంటిక్ సముద్రం ఒడ్డున 'లబాడీ బీచ్' చాలా ప్రసిద్ధి. యూరోపియన్ శైలిలోనే ఉంటుంది వీరి కాలక్షేపం. యూత్ నైట్‌క్లబ్స్‌కు వెళుతుంటారు.
ఇక్కడ మందు కొట్టని వాడు పాపాత్ముడు. 365 రోజులు తాగుతూనే ఉంటారు. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి కూర్చొని మందు కొడతారు. ఎవరి బ్యాగుల్లో అయినా డబ్బులు కనిపించవేమో కానీ 'గినిస్' అనే బీరు మాత్రం కనిపిస్తుంది. నీళ్లు తాగినట్లు బీర్లు తాగడం ఘనా ప్రజలకే చెల్లు. వారాంతంలో అయితే ఇళ్లన్నీ మందువాసనతో గుబాళిస్తుంటాయి. ఆదివారం మాత్రం చర్చి, మసీదులకు వెళ్లి ప్రశాంతంగా ప్రార్థనల్లో మునిగిపోతారు. ఇండియన్స్ అయితే ఇక్కడే ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కు వెళతారు.
ఈ దేశంలో చిత్రమైన విషయం ఏమిటంటే- చాలామంది పెళ్లిళ్లు చేసుకోకుండానే కలిసుంటారు. మన దేశంలో ఈ మధ్యనే విస్తరిస్తున్న 'లివింగ్ టు గెదర్' ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే పాతబడిపోయింది. వివాహం లేకుండానే పిల్లల్ని కంటారు. కుటుంబాల్లో సంక్షోభం వస్తే, పిల్లల భారం మోసేది మాత్రం మహిళలే. పొలాలు, గనులు, కర్మాగారాల్లో కష్టమైన పనులను కూడా మహిళలు ఎంతో అంకితభావంతో చేస్తారు. రెండువందల కిలోల బరువున్న సామాగ్రిని సైతం నెత్తిమీద పెట్టుకొని, మైళ్లకు మైళ్లు నడుస్తుంటారు. పేద దేశం అంటాం కానీ, ఘనా కరెన్సీ మనకంటే ఎక్కువ. వాళ్ల రూపాయికి మన దేశంలో ముప్పై రూపాయలు వస్తాయి.
- మల్లెంపూటి ఆదినారాయణ
No comments:
Post a Comment