నలుగురిలోకి కనక దుర్గేశ్వరరావు సీనియర్. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. వృత్తిరీత్యా కార్పెంటర్. ఇంట్లో అమ్మానాన్న, తోబుట్టువులు అందరూ అదే పనిచేస్తారు. ఆరో తరగతి చదువుతున్నప్పుడు విజయనగరం వలస వచ్చేశారు. అక్కడ మహారాజా విద్యాలయాల్లో చదవడం వల్ల ఆ వాతావరణం, ప్రాచీన కట్టడాలు, సంగీత కళాశాల నుంచి స్ఫూర్తి పొందాడు. కళలో రాణించాలంటే..ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పొందాలని తెలుసుకున్నాడు. పట్టుదలతో సీటు సాధించాడు. పెయింటింగ్ స్పెషలైజేషన్‌గా తీసుకున్నాడు. అక్కడ చేరాకే రంగులకు ప్రత్యేకతలు ఉంటాయని, వాటిని భావాలకనుగుణంగా వాడాలని తెలుసుకున్నాడు. వస్తువుని ఎలా చూడాలి? సృజనాత్మకత అంటే ఏమిటి? భావవ్యక్తీకరణ ఎలా చేయాలి? అనే దానిపై అవగాహన ఏర్పరుచుకున్నాడు.
బొగ్గుతో 'చిత్రాలు' గీసే శివకృష్ణది విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం దగ్గరి రాట్నాలపాలెం. తండ్రి రిక్షాపుల్లర్. పొద్దంతా రిక్షా తొక్కుతాడు. ఇంటికొచ్చాక బొగ్గుముక్కలతో గోడలపై బొమ్మలు గీసేవాడు. వాటిని చూసి శివకృష్ణకు అలా బొమ్మలు గీయాలనిపించేది. తండ్రితో చెబితే...ఎలా గీయాలో నేర్పించాడు. అలా తండ్రే తొలి గురువుగా చిత్రాభ్యాసం చేసిన శివకృష్ణ గొలుగొండ గురుకులం ఆరవ తరగతిలో చేరాడు. అక్కడ ప్రతి ఏటా చిత్రకళలో మొదటి బహుమతి పొందేవాడు. డ్రాయింగ్ టీచర్ మోహన్‌రావు ఇచ్చిన సలహాతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎఫ్ఎ చేరాడు.
ఆర్థిక స్థితి సహకరించకపోయినా అన్నయ్య సాయంతో కోర్సు పూర్తిచేశాడు. ఆ తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్ఎఫ్ఏ చేశాడు. అప్పటివరకు ఆసరాగా నిలిచిన అన్న టీచర్ ్రటైనింగ్ కోర్స్‌లో చేరతాననడంతో... బరోడా వెళ్లి ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌గా స్థిరపడాలనే తన కోరికకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆ సమయంలోనే సీనియర్ దుర్గేశ్ ద్వారా సింబియోసిస్‌లో ఉద్యోగానికి పిలుపు రావడంతో పదిహేను వేల రూపాయల జీతానికి యానిమేషన్ వింగ్‌లో కేరక్టర్ డిజైనర్‌గా చేరాడు.
స్వీయ ప్రేమ అనుభవాన్ని ప్రతిఫలించేలా 'బ్రోకెన్ హార్ట్' పేరుతో తన చిత్రాన్ని తానే బొగ్గుతో గీసి దాన్నే ప్రదర్శనకు పెట్టాడు. అది కళాభిమానుల ప్రశంసలు అందుకుంది. "సచిన్ టెండూల్కర్ చిత్రానికి లభించిన ప్రశంసలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. స్వేచ్ఛగా నచ్చిన చిత్రాలు గీయాలని మనసు ఎంతగానో ఉవ్విళ్లూరుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలనేది నా ఆకాంక్ష'' అన్నాడు శివకృష్ణ.
కత్తుల శ్రీనుది ఇంకో కథ. అంబాజీపేట దగ్గరి పుల్లేటికూరు స్వస్థలం. నాన్న టైలరు. పేద కుటుంబం. బాల్యంలో ఒక వికలాంగుడైన కళాకారుడు ఆర్థిక సాయం కోసం బొమ్మలు గీస్తుంటే ఆయనకు సాయం చేసేవాడు శ్రీను. అలా కళతో పరిచయం ఏర్పడింది. పాఠశాలలో సామాజిక సమస్యలపై బొమ్మలు గీస్తే, కోనసీమ చిత్ర కళాపరిషత్ బహుమతులతో సత్కరించింది. పెయింటింగ్‌లో అనుభవం ఉండడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎఫ్ఎ శిల్పకళలో చేశాడు. చెక్కతో, రాళ్లతో బొమ్మలు తయారుచేయడం నేర్చుకున్నాడక్కడ.
కోర్స్ పూర్తికాగానే సొంతూరుకు వెళ్లాడు. అక్కడ సొంతంగా బొమ్మలు చేసేవాడు. అయితే చేతినిండా పనులు ఎప్పుడూ ఉండేవి కావు. అందుకని ఏడాదిన్నర క్రితం సింబియోసిస్‌లో ఉద్యోగానికి చేరాడు. "నేను తయారుచేసిన తెల్లటి రెక్కల గుర్రం సింబియోసిస్ భవనం ముందు నిలబడగానే కుడివైపున పచ్చటి గార్డెన్‌లో గాలిలో ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. దాని పక్కనే హయగ్రీవుడు పద్మాసనం వేసుకుని కూర్చున్న బొమ్మ ఉంటుంది.
ఈ బృందంలో చివరివాడు గోపి. "బికామ్ కంప్యూటర్స్ పాసయిన తరువాత హైదరాబాద్‌లో '3డి మాయ' కోర్సు చేశాను. ఆరునెలలు అక్కడే పనిచేశాను. ఆ తరువాత సింబియోసిస్‌లో చేరాను. అక్కడ సహోద్యోగుడయిన శ్రీను పరిచయం శిల్పాలు తయారీవైపు నడిపించింది. మదర్ థెరిస్సా, గొరిల్లా బొమ్మల తయారీలో కూడా సాయం చేస్తున్నాను. బయట రూపొందించే బొమ్మ ఎలా ఉంటుందో ముందుగా కంప్యూటర్‌లో '3డి' టెక్నాలజీతో చూపిస్తాను. కొల్లాజ్ చిత్రాల తయారీలోను నాకంటూ ఒక శైలిని రూపొందించుకున్నా'' అన్నాడు.
- యర్రా శ్రీనివాసరావు,విశాఖపట్నం
ఫొటోలుః ఎం. విజయ రఘునాథ్


