Friday, December 2, 2011

మనసే మన గురువు

మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ- పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ'లోచనం' చేసేదే మనసు. మనలో ఉండి మనలను నడిపించే మనసే మన 'తొలిగురువు' అంటోంది వేదసారం. 'నీవెవరో తెలుసుకో' అని బోధించిన రమణ మహర్షుల వారైనా 'నీవే ప్రపంచం' అన్న జిడ్డు కృష్ణమూర్తి తత్వమైనా నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్నే చూడమంటోంది.

ఆలోచన అనగానే మన మనసు అనే జల్లెడ మంచిని, చెడును వేరు చేసే పరికరంలాగా పనిచేస్తుంది. ఆచరణలో మాత్రం మంచిని తీసుకుని చెడును వదిలివేస్తాం. ఒక్కోసారి చెడును కూడా మంచిగా భావించి మనసు మొండికేస్తూ మంచిని విస్మరిస్తుంది. ఎవరి సలహాను కూడా ఈ మనసు పరిగణనకు తీసుకోదు. కాని, ఈ ఆలోచన సాధారణంగా ఒక సమస్యపై ఉంటుంది. ఆ సమస్య మనం తలపెట్టిన ఒక నూతన కార్యం కావచ్చు. లేక గత కాలంలో మనం చేసిన కర్మ వలన ఏర్పడిన దుష్ఫలితాలపై ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో శరీర ఆరోగ్యాన్ని గురించి కూడా ఉండవచ్చు.

ఈ ఆలోచన అనే ప్రక్రియ సాధారణంగా బాహ్య వాతావరణానికి సంబంధించి ఉంటుంది. ఏ పరిస్థితులలోను ఈ మనసు తన గురించి తాను ఆలోచించదు. ఈ ఆలోచన జీవితంలో జరిగే ఒడిదుడుకుల గురించి కాని, కొన్ని కోరికల గురించి కాని జరుగుతుంది. బాహ్యాన్ని గురించి జరిగే ఈ చింతన ప్రక్రియనే ఆలోచన అంటాం. కాని ఈ ఆలోచన ప్రక్రియ మనలోపల ఉన్న మనసులోనే జరుగుతుంది. మనకు కొన్ని సందర్భాలలో ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకనపుడు బాగా అనుభవం ఉన్న, మనకు సన్నిహితుడైన వ్యక్తిని ఆ సలహా మనకు నచ్చితే దానిని పాటిస్తాం. ఈ ప్రక్రియ సహజంగా లోకంలో జరిగేదే.

మనసే ఒక లోచనం
ఆలోచన అనే పదంలోనే 'ఆ' అంటే ఎక్కడో దూరంగా మనకన్నా భిన్నంగా గాని మనకన్నా వేరుగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఆలోచనంలో ఉన్న 'లోచనం' అంటే కన్ను అని అర్థం. అంటే దీన్ని బట్టి చూస్తే మన మనసే ఒక కన్ను అనవచ్చు. ఈ మనసు అనే కన్ను ఎంత సేపటికి బయటకే పరుగెడుతుంది కాబట్టి దీన్ని ఆలోచనం అంటున్నాం. అంటే బాహ్యంగా ఉన్న విషయాన్ని మనలోనే ఉన్న మనసుతోనే చూస్తున్నాం.

ఇక మనకు తెలియని విషయాన్ని తెలియబరిచే వ్యక్తిని 'గురువు' అంటారు. కేవలం మనుషులే కాదే ఒక్కోసారి ఒక సంఘటన, పశువులు, పక్షులు, కొండలు, గుట్టలు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగా పరిశీలించి చూస్తే అందరి అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా గురువే అవుతుంది. దత్తచరిత్ర కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. ఏదేమైనా మనలోనే ఉండి మనను నడిపించే మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటున్నాం. అందువల్ల మన మనసును కూడా 'గురువు'గానే పరిగణించాలి.

అంతర్గత ప్రయాణం
సాధారణంగా వేదాంతం అనగానే మన పెద్దలందరూ నీలో నీవు చూడమని, నీ లోనికి నీవు ప్రయాణం చేయాలని చెబుతారు. శ్రీరమణ మహర్షుల వారు కూడా 'నీవు ఎవరో తెలుసుకో' అని పదే పదే చెప్పేవారు. మనకు సుపరిచితాలైన పదాలు రెండు ఉన్నాయి. 'అక్కడ', 'ఇక్కడ' అనేవి ఆ రెండు పదాలు. అక్కడ అనగానే మనకు దూరంగా ఉన్నదని తెలుసు. ఇక్కడ అంటే మనకు దగ్గర్లో ఉన్నదని కూడా మనకు తెలుసు.

ఈ దగ్గర అనే దాన్లో మన ఇంట్లో కావచ్చు, మనం కూర్చునే చోట పక్కన కావచ్చు, మన జేబులో కావచ్చు. అలాంటప్పుడు మనలో అని ఎందుకు అనకూడదు? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ విషయాన్ని ఉపనిషత్తు దర్శనం తెలియచేస్తుంది. పైగా మన మనసు అనేది మనలో ఉన్నదే కాబట్టి వారు చెప్పే సలహా లేక సూచన కూడా మనలో ఉన్నదేనని విదితమవుతుంది. అదే వేదాంతం కూడా బయట(నీకంటే వేరైన) ప్రపంచాన్ని చూడవద్దంటుంది. అంటే నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్ను నీవే చూడమంటుంది. ఇదే సంగతిని జిడ్డు కృష్ణమూర్తి కూడా 'నీవే ప్రపంచం' అంటారు.

కాబట్టి నీలోనే ఉండి నీకు మార్గదర్శనం చేసే నీ మనసునే బాగా విచారించమనేదే మన పెద్దల ఉపదేశాలసారం. మనలో ఉండి మనలను నడిపించే మనసే తొలిగురువు. అయితే ఈ మనసు ఎల్లప్పుడు బయటి విషయాలకు పోయి పరుగులు పోతూ పిచ్చిపట్టిన కోతిలా పరుగెడుతుందే తప్ప ఒక్క క్షణం నిలకడగా ఉండదు. నిలకడగా ఉండే అలవాటు దీనికి లేదు. ఒకవేళ ఎవరైనా, ఎప్పుడైనా నిలువరించాలని ప్రయత్నం చేస్తే అప్పుడు మరీ వేగంగా గతాన్ని అనాగతాన్ని తలచుకుని వేగాన్ని మరింత పెంచుతుంది. కాబట్టి ఈ వేగాన్ని అభ్యాసవశాన వశపరుచుకోవలసిందే.

మనసు వేగాన్ని నియంత్రించడానికి మనసును దాని చేతనే ఆలోచింపచేయాలి. తదుపరి అభ్యాసవశాన క్రమంగా నిలకడకు తీసుకురావాలి. అంతేగాని మనము దానిపై నియంత్రించడానికి పట్టు బిగుస్తున్న కొద్ది అది మరింత వేగాన్ని పెంచి మొండికేస్తుంది. కాబట్టి దీనిని అభ్యాసం మాత్రమే చక్కదిద్దగలదు. దీనినే తటస్థీకరణ లేక సాక్షిణ్యం అంటారు. ఈ ప్రక్రియనే పెద్దలు 'లోచూపు' అంటారు. మరలా 'లోప్రయాణం', 'నీలోనికి నీవే ప్రయాణం' అనవచ్చు.

అంతేగాని లోచూపు అనగానే మన కనుగ్రుడ్లు లోపలివైపునకు తిప్పి చూడమని కానే కాదు. ఇది అసాధ్యం. సహజత్వానికి విరుద్ధం. మొత్తానికి తేలిందేమంటే మన మన మనసుతోనే మన మనసు చేసే చర్యలను, ఆ మనసు పుట్టుకను, దాని తారతమ్యాలను, దానికి ఉన్న అనేక స్థితులను బాగా పరిశీలించి పరిశోధించాలన్నదే ఈ లోని ప్రయాణం.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgxHHFrnna4MGTNLsWBv4T-LmeXQued76yAHm6xCgtcfNG2d2zw2XYk0TYRtdygpxdi0FIrBPv3ISd-nuNewMNdjrPd_p5lGFCThpaesWlhzbCDW1Luaze-0mIUxO-mFJizdY4zrE-HYLA/s1600/Pair5.JPG
మన మనసునేగాక మనసుకు మందిరంగా ఉన్న శరీరాన్ని గురించి, దాని అన్ని ప్రక్రియలను గురించి అనేక విధాలుగా పరిశీలించాలన్నదే దీని సారం. ముందుగా శరీరాన్ని, అందులో దాగి ఉన్న మనసు అనే ఆంతరిక ఉపకరణాన్ని నిశితంగా, తులనాత్మకంగా పరిశీలించి పరిశోధించాలి. చివరిగా ఒక సంతులన స్థితికి రావాలి. రమణులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి మహానుభావులే కాదు ఈ పుడమిపై మానవుడు పుట్టిన నాటి నుంచి మహామహులంతా ఉపదేశించిన వేద సారం ఇదే.

వేదంలో నుంచే వేదన
ఈలోచనం అంటే తనను, తన మనసును తన మనసు చేతనే పరిశీలించాలి. 'వేద' అనే పదంలోనుంచే వేదన అనే పదం పుట్టుకొచ్చింది. కాబట్టి వేదన నుంచి బయటపడాలంటుంది వేదం(వేదన=దుఃఖం). తనను తాను తెలుసుకున్నపుడు ఆ మనసు శాంతిస్తుంది. ఇది వేదనను అంతం చేసేది కాబట్టి దీనిని వేదాంతం అన్నారు. అంతేకాని వేదాంతం అనగానే మనకు అర్థమయ్యేది కాదని, అది ఒంటబట్టేది కాదని, దాని ఇది వయసు కాదని భూతద్దంలో చూసి భయపడవలసిన అవసరం లేదు.

స్త్రీల విషయంలో మరో ముఖ్యాంశం ఏమిటంటే వారు వేదాంత అర్హులు కారని ఒక వాదన ప్రజలలో బలంగా ఉంది. ఇది వాస్తవం కాదు. విద్యకు ఆది మాత, విద్యాప్రదాయిని సరస్వతి స్త్రీమూర్తి. ఈ సరస్వతీ మాతకు మరో పేరే గాయత్రి. వీరందరూ స్త్రీమూర్తులే కదా! ఈ విషయం మరువరాదు. అలాంటప్పుడు స్త్రీలకు విద్యాధికారం, వేదాధికారం ఎందుకు లేదు? మన మనసును గురించి, దానికి భవనమైన మన దేహాన్ని గురించి అంతఃశోధన జరిగినపుడు మన మనసు గురించి మరింత లోతైన అవగాహన ఏర్పడగలదు.

శరీరాన్ని, అందులో దాగి ఉన్న మనసు అనే ఆంతరిక ఉపకరణాన్ని నిశితంగా, తులనాత్మకంగా పరిశీలించి పరిశోధించాలి. చివరిగా ఒక సంతులన స్థితికి రావాలి. రమణులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి మహానుభావులే కాదు ఈ పుడమిపై మానవుడు పుట్టిన నాటి నుంచి మహామహులంతా ఉపదేశించిన వేద సారం ఇదే.
- కర్ల సుబ్బారావు

No comments:

Post a Comment