Friday, May 25, 2012

కుర్రాళ్ల కళ

ప్రయాణం ఎక్కడైనా మొదలవ్వొచ్చు. మొదలయ్యాక మాత్రం ఆగదు. ఈ కుర్రాళ్ల కళాత్మక ప్రయాణమూ అలాగే మొదలైంది. కుంచె నుంచి కంప్యూటర్‌కు చేరింది. వ్యక్తిగత ప్రతిభ వృత్తిగా మారింది. వాళ్ల పేరును విదేశాలకు పరిచయం చేసింది. విశాఖలో ఉంటున్న ఆ నలుగురు యువకుల కళాత్మక ప్రయాణమే ఇది...

నలుగురిలోకి కనక దుర్గేశ్వరరావు సీనియర్. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. వృత్తిరీత్యా కార్పెంటర్. ఇంట్లో అమ్మానాన్న, తోబుట్టువులు అందరూ అదే పనిచేస్తారు. ఆరో తరగతి చదువుతున్నప్పుడు విజయనగరం వలస వచ్చేశారు. అక్కడ మహారాజా విద్యాలయాల్లో చదవడం వల్ల ఆ వాతావరణం, ప్రాచీన కట్టడాలు, సంగీత కళాశాల నుంచి స్ఫూర్తి పొందాడు. కళలో రాణించాలంటే..ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పొందాలని తెలుసుకున్నాడు. పట్టుదలతో సీటు సాధించాడు. పెయింటింగ్ స్పెషలైజేషన్‌గా తీసుకున్నాడు. అక్కడ చేరాకే రంగులకు ప్రత్యేకతలు ఉంటాయని, వాటిని భావాలకనుగుణంగా వాడాలని తెలుసుకున్నాడు. వస్తువుని ఎలా చూడాలి? సృజనాత్మకత అంటే ఏమిటి? భావవ్యక్తీకరణ ఎలా చేయాలి? అనే దానిపై అవగాహన ఏర్పరుచుకున్నాడు.

ఇప్పుడు సింబియోసిస్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్నాడు. అందులోకి అడుగుపెట్టగానే రిసెప్షన్‌లో గోడకు ఎదురుగా బుద్ధుడి చిత్రపటం ఆకట్టుకుంటుంది. పరిశీలనగా చూస్తే బురదలో నుంచి పూసిన కలువ పువ్వు, దానిపై పచ్చటి ప్రకృతిలో ప్రతిబింబించే బుద్ధుడు, నుదుటిపై ప్రతిభావంతుడైన సూర్యుడు కనిపిస్తారు. ఆ చిత్రం రూపశిల్పి కనకదుర్గేశ్వరరావును ఆ బొమ్మలోని భావం గురించి అడిగితే "క్రూరంగా మారిన ఈ ప్రపంచానికి మరో బుద్ధుడు అవసరమనే ఉద్దేశంతో నా భావాల్ని అందులో పొందుపరిచాను. చిత్రంలో కనిపించే బురద సమాజంలో క్రూరత్వానికి ప్రతిబింబం. దాన్ని చీల్చుకుని పైకివచ్చిన కలువ బుద్ధుడు. అది ప్రపంచమంతా విస్తరించాలని ప్రకృతిలో మిళితం చేశాను. బుద్ధుడి నుదుటిపై సూరీడంత ప్రకాశంతో బుద్ధిజం వర్ధిల్లాల''ని విశ్లేషించాడు.

శివది 'బ్రోకెన్ హార్ట్'
బొగ్గుతో 'చిత్రాలు' గీసే శివకృష్ణది విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం దగ్గరి రాట్నాలపాలెం. తండ్రి రిక్షాపుల్లర్. పొద్దంతా రిక్షా తొక్కుతాడు. ఇంటికొచ్చాక బొగ్గుముక్కలతో గోడలపై బొమ్మలు గీసేవాడు. వాటిని చూసి శివకృష్ణకు అలా బొమ్మలు గీయాలనిపించేది. తండ్రితో చెబితే...ఎలా గీయాలో నేర్పించాడు. అలా తండ్రే తొలి గురువుగా చిత్రాభ్యాసం చేసిన శివకృష్ణ గొలుగొండ గురుకులం ఆరవ తరగతిలో చేరాడు. అక్కడ ప్రతి ఏటా చిత్రకళలో మొదటి బహుమతి పొందేవాడు. డ్రాయింగ్ టీచర్ మోహన్‌రావు ఇచ్చిన సలహాతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎఫ్ఎ చేరాడు.

ఆర్థిక స్థితి సహకరించకపోయినా అన్నయ్య సాయంతో కోర్సు పూర్తిచేశాడు. ఆ తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్ఎఫ్ఏ చేశాడు. అప్పటివరకు ఆసరాగా నిలిచిన అన్న టీచర్ ్రటైనింగ్ కోర్స్‌లో చేరతాననడంతో... బరోడా వెళ్లి ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌గా స్థిరపడాలనే తన కోరికకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆ సమయంలోనే సీనియర్ దుర్గేశ్ ద్వారా సింబియోసిస్‌లో ఉద్యోగానికి పిలుపు రావడంతో పదిహేను వేల రూపాయల జీతానికి యానిమేషన్ వింగ్‌లో కేరక్టర్ డిజైనర్‌గా చేరాడు.

స్వీయ ప్రేమ అనుభవాన్ని ప్రతిఫలించేలా 'బ్రోకెన్ హార్ట్' పేరుతో తన చిత్రాన్ని తానే బొగ్గుతో గీసి దాన్నే ప్రదర్శనకు పెట్టాడు. అది కళాభిమానుల ప్రశంసలు అందుకుంది. "సచిన్ టెండూల్కర్ చిత్రానికి లభించిన ప్రశంసలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. స్వేచ్ఛగా నచ్చిన చిత్రాలు గీయాలని మనసు ఎంతగానో ఉవ్విళ్లూరుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలనేది నా ఆకాంక్ష'' అన్నాడు శివకృష్ణ.

రెక్కల గుర్రం
కత్తుల శ్రీనుది ఇంకో కథ. అంబాజీపేట దగ్గరి పుల్లేటికూరు స్వస్థలం. నాన్న టైలరు. పేద కుటుంబం. బాల్యంలో ఒక వికలాంగుడైన కళాకారుడు ఆర్థిక సాయం కోసం బొమ్మలు గీస్తుంటే ఆయనకు సాయం చేసేవాడు శ్రీను. అలా కళతో పరిచయం ఏర్పడింది. పాఠశాలలో సామాజిక సమస్యలపై బొమ్మలు గీస్తే, కోనసీమ చిత్ర కళాపరిషత్ బహుమతులతో సత్కరించింది. పెయింటింగ్‌లో అనుభవం ఉండడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎఫ్ఎ శిల్పకళలో చేశాడు. చెక్కతో, రాళ్లతో బొమ్మలు తయారుచేయడం నేర్చుకున్నాడక్కడ.

కోర్స్ పూర్తికాగానే సొంతూరుకు వెళ్లాడు. అక్కడ సొంతంగా బొమ్మలు చేసేవాడు. అయితే చేతినిండా పనులు ఎప్పుడూ ఉండేవి కావు. అందుకని ఏడాదిన్నర క్రితం సింబియోసిస్‌లో ఉద్యోగానికి చేరాడు. "నేను తయారుచేసిన తెల్లటి రెక్కల గుర్రం సింబియోసిస్ భవనం ముందు నిలబడగానే కుడివైపున పచ్చటి గార్డెన్‌లో గాలిలో ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. దాని పక్కనే హయగ్రీవుడు పద్మాసనం వేసుకుని కూర్చున్న బొమ్మ ఉంటుంది.

ఈ రెండింటిని మా బాస్ కోరిక మేరకు రూపొందించాను. ప్రస్తుతం మదర్ థెరిసా, గొరిల్లా ప్రతిమలు తయారుచేస్తున్నాను. మైనంతో కేంద్ర మంత్రి పురందేశ్వరి బొమ్మ చేయడం మొదలుపెట్టాను. ఇవేకాకుండా కొల్లాజ్ చిత్రకళ కూడా బాగా చేయగలను. ప్రధాని మన్మోహన్‌సింగ్, ముంబైకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పాండా, జ్యోతిరావ్ సింధియా తదితరుల ప్రోటయిట్‌లను రూపొందిస్తున్నాను'' అని చెప్పాడు శ్రీను.

ఈ బృందంలో చివరివాడు గోపి. "బికామ్ కంప్యూటర్స్ పాసయిన తరువాత హైదరాబాద్‌లో '3డి మాయ' కోర్సు చేశాను. ఆరునెలలు అక్కడే పనిచేశాను. ఆ తరువాత సింబియోసిస్‌లో చేరాను. అక్కడ సహోద్యోగుడయిన శ్రీను పరిచయం శిల్పాలు తయారీవైపు నడిపించింది. మదర్ థెరిస్సా, గొరిల్లా బొమ్మల తయారీలో కూడా సాయం చేస్తున్నాను. బయట రూపొందించే బొమ్మ ఎలా ఉంటుందో ముందుగా కంప్యూటర్‌లో '3డి' టెక్నాలజీతో చూపిస్తాను. కొల్లాజ్ చిత్రాల తయారీలోను నాకంటూ ఒక శైలిని రూపొందించుకున్నా'' అన్నాడు.

- యర్రా శ్రీనివాసరావు,విశాఖపట్నం
ఫొటోలుః ఎం. విజయ రఘునాథ్

Monday, May 7, 2012

కె.ఎల్. కొత్త బంగారు లోకం

 http://cdn2.supergoodmovies.com/FilesTwo/48c62ceaf658427f928d931135af1ed6.gif

 మనుషుల రోగాలు నయం చేద్దామని ఎంబిబిఎస్ చదివారు. కాని పరిస్థితుల ప్రభావం వల్ల నిర్మాణ రంగం వైపు అడుగిడారు. డాక్టరుగా మనుషుల ఆరోగ్యాన్ని పట్టించుకోలేకపోతేనేం బిల్డర్‌గా ఇళ్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాణ్యమైన ఇళ్లను నిర్మించడమే కాకుండా పచ్చదనానికి పెద్ద పీట వేస్తున్న ఈ డాక్టర్ బిల్డర్ పేరు కె.ఎల్.నారాయణ. నిర్మాణ రంగంలో 'ట్రెండ్‌సెట్' చేసిన నారాయణ పని వివరాలు ఆయన మాటల్లోనే...

"మల్టీనేషనల్, కార్పొరేట్ సంస్థల వలె నేను ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టను. చాలా తక్కువే చేస్తాను. అవే నిర్మాణ రంగంలో ట్రెండ్‌సెట్టర్‌లుగా నిలుస్తాయి. ఆర్కిటెక్‌లు ఇచ్చిన ప్లాన్ ఆధారంగానే కట్టినప్పటికీ అంతకుముందు నేను చూసిన, చదివిన పలు అంశాలు వాటికి చేర్చి నిర్మిస్తుంటాను. అందుకే మా కట్టడాలకు ఆదరణ ఎక్కువ.

అందుకు ఉదాహరణ నా ఇరవై యేళ్ల నిర్మాణరంగ సర్వీసులో ఇంతవరకు బ్రోచర్‌లు వేయించడం గాని, ఫ్లెక్సీలు - హోర్డింగులు పెట్టడం, వాణిజ్యప్రకటనలు ఇవ్వడం వంటివేమీ చేయకపోవడమే. నా దగ్గర ఫ్లాట్ కొన్నవాళ్లు బాగుందని చెప్పడం వల్ల మరొకరు వస్తారు. మా నిర్మాణాలపట్ల నమ్మకం, మా దగ్గర కొన్న వాటిని తిరిగి అమ్ముకున్నా మంచి విలువ వస్తుందన్న గ్యారంటీయే కొనుగోలుదారుల్ని మా దగ్గరికి తీసుకొస్తున్నాయి.

పేరుకు తగ్గ పని మాది

1989లో శ్రీ దుర్గ ఎస్టేట్స్ ప్రారంభించి తక్కువ ఆదాయ వర్గాలకోసం జీడిమెట్లలో ఐదు వందల ఇళ్ల సముదాయాన్ని నిర్మించాను. ఇది నా మొదటి ప్రాజెక్ట్. ఆ తరువాత 1993లో ట్రెండ్‌సెట్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించాను. ట్రెండ్‌సెట్ అన్న మా కంపెనీ పేరుకు తగ్గట్టే ఉంటుంది మా పని. యాంత్రికంగా ఏదో చేశాం, ఇచ్చాం అన్నట్టు ఉండదు. చేసేది వ్యాపారమే అయినప్పటికీ అందులో వ్యక్తిగత సంబంధం ఉండడమనేది చాలా ముఖ్యం. అలా ఉన్నప్పుడే వ్యాపారంలో విజయం సాధించడం సులువు. బిల్డర్‌గా నేను వంద ఫ్లాట్లు క ట్టొచ్చు. కాని కొనుగోలుదారుడికి జీవితకాలం కష్టపడి ఆదా చేసుకున్న డబ్బుతో కొనుక్కునే ఇల్లు ఒక్కటే కదా. వాళ్లకది ఎంతో అపురూపం. అందుకే వాళ్ల డబ్బుకి న్యాయం చేసేలా మా నిర్మాణం ఉంటుంది.

పూల మొక్కలు - పచ్చదనం

ఇప్పటివరకు ఎన్నో వెంచర్‌లు చేశాం. కొండాపూర్‌లోని 30 అపార్టుమెంట్‌ల కాంప్లెక్స్, ట్రెండ్‌సెట్ టవర్స్, ఎఎన్ఆర్ సెంటర్, శ్రీదుర్గా టవర్స్, ట్రెండ్‌సెట్ విల్లె, ట్రెండ్‌సెట్ వింటేజ్‌లు మేము కట్టినవే. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో ట్రెండ్‌సెట్ వింజ్ పేరుతో ఏడు బ్లాక్‌ల గేటెడ్ కమ్యూనిటీ మా సరికొత్త వెంచర్. ఆరు ఎకరాల భూమిలో 280 ఫ్లాట్స్‌తో కట్టిన ఈ నిర్మాణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

పార్కింగ్ ఏరియా ఏమాత్రం బయటికి కనిపించకుండా ఐదు ఎకరాల్లో సెల్లార్ కార్ పార్కింగ్ ఏర్పాటుచేశాం. దాని పైభాగమంతా లాన్‌తో కప్పి ఉంటుంది. పార్కింగ్‌లోకి వెళ్లేందుకు డ్రైవ్‌వే ర్యాంప్ ఉంది. సెల్లార్ పార్కింగ్ అనగానే చాలామందికి నీళ్లు నిల్వ ఉండడం గుర్తు రావొచ్చు. అలాంటిదేం ఉండదు. ఒకవేళ వచ్చినా బయటికి పోవడానికి పార్కింగ్‌లో డ్రెయిన్ వ్యవస్థ ఉంది. ఆటోమేటిక్ పంప్ సీవరేజ్ వ్యవస్థ, కలెక్షన్ పిట్‌లు ఉన్నాయి. కలెక్షన్ పిట్ నిండగానే నీళ్లు వాటంతటవే బయటికి పోయేలా ఏర్పాటు ఉంది.

ముంగిట్లోకే అన్నీ...

ఇక్కడ స్విమ్మింగ్‌పూల్‌తో కలిపి క్లబ్ హౌస్ నిర్మించాం. ఎ/సి జిమ్, స్పా, ఇండోర్ గేమ్స్, బాంక్వెట్ హాల్, ఎసి రెస్టారెంట్ లతో పాటు పిల్లల కోసం క్రెచ్ కూడా ఉంది. బాస్కెట్ బాల్, వాలీ బాల్ కోర్టులు, సింథటిక్ ఫ్లోరింగ్‌తో పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేశాం. జాగింగ్ ట్రాక్, హెల్త్‌సెంటర్‌లు కూడా ఉన్నాయి. బయటికి వెళ్లే పనిలేకుండా తాజా గాలిని పీలుస్తూ కంటినిండా పచ్చదనాన్ని నింపుకుని ఎంచక్కా వాకింగ్ కూడా చేయొచ్చు. ఎటు చూసినా సిమెంటు కట్టడాలతో నిండిపోతున్న హైదరాబాద్‌లాంటి ప్రదేశంలో ఎటు చూసినా పచ్చదనం, పూలు కనిపించేలా కట్టిందే ట్రెండ్‌సెట్ వింజ్.

కరెంటు కోతలు ఇబ్బంది పెట్టకుండా 100 శాతం పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉంది. జనరేటర్ ద్వారా అందించే ఈ కరెంటు ఎంత వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు మీటర్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి పైపు గ్యాస్ లైన్లు ఉన్నాయి. గ్యాస్ బ్యాంక్ నుంచి అందించే ఈ గ్యాస్ ఎంత వినియోగిస్తున్నారో మీటర్ల ద్వారా తెలుసుకునే ఏర్పాటుంది. అలాగే ఎస్‌టిపి (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) కూడా ఉంది. ఫైర్ సేఫ్టీ వ్యవస్థతో పాటు భూకంపాలను తట్టుకునేలా కట్టిన డిజైన్ ఇది. వాస్తుపరంగా కూడా పక్కాగా ఉంది.

ప్రస్తుతం విజయవాడ బెంజిసెంటర్‌లో ఆరుస్క్రీన్లతో మల్టీప్లెక్స్ మాల్ నిర్మిస్తున్నాం. మెట్రో నగరాల్లో మాల్స్ ఎలాగయితే ఉంటాయో వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది ఇది. దీనికి ట్రెండ్‌సెట్ బెంజ్ మాల్ అని పేరు పెట్టాం.

రెసిషన్+ఉద్యమం

నిర్మాణ రంగం బాగా బూమ్‌లో ఉన్నప్పుడు మొదట రెసిషన్ ప్రభావం, ఆ తరువాత తెలంగాణ ఉద్యమ ప్రభావం పడింది. ఇదివరకు శివార్లలో యాభై, వంద ఎకరాలు కొని వెంచర్‌లు కట్టేవాళ్లు. ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే నాణ్యతతో కట్టిన భవనాలకు డిమాండ్ ఇప్పటికీ బాగానే ఉంది. కాకపోతే ఇదివరకులా పేపర్ మీద చూపించి అమ్ముదామనుకుంటే మాత్రం కుదరదు. బిల్డర్ ట్రాక్ రికార్డును చూసి మాత్రమే కొంటున్నారు. ధరలపైన మాత్రం ఉద్యమ ప్రభావం ఉంది. రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నప్పుడు చదరపు అడుగు నాలుగు వేలు ఉంటే ఇప్పుడది మూడు వేల ఐదొందలకి తగ్గింది.''

మూడు సినిమాలతో మళ్లీ...

నిర్మాణరంగంతో పాటు సినిమాలంటే కూడా చాలా ఇష్టం నాకు. 1990లో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ఎస్ గోపాలరెడ్డి (సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ)గారితో పరిచయం నన్ను నిర్మాతను చేసింది. శ్రీదుర్గ ఆర్ట్స్ ఏర్పాటుచేసి వెంకటేష్, శ్రీదేవిలతో క్షణక్షణం నిర్మించాం. ఇది మా మొదటి సినిమా. ఆ తరువాత హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, నిన్నే ఇష్టపడ్డాను, సంతోషం, రాఖీ సినిమాలు వరసగా తీశాం. రాఖీ తరువాత నాలుగేళ్లుగా సినిమా నిర్మించకపోవడానికి కారణం కథలు నచ్చకపోవడమే. ఈ ఏడాది రాంచరణ్ - బోయపాటి శ్రీనివాస్, మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లలో రెండు సినిమాలు నిర్మించబోతున్నాం. ఎన్టీఆర్‌తో కూడా సినిమా తీయబోతున్నాం.

మంచికథ ఉంటే కొత్త వాళ్లతో అయినా, చిన్న హీరోలతో అయినా సినిమా నిర్మించేందుకు సిద్ధం. పద్ధతిగా, ప్రణాళికగా చేసుకుంటే నష్టం వచ్చే వ్యాపారం కాదు సినిమా. కాకపోతే హిపోక్రసీకి పోకుండా నిజాయితీగా వ్యవహరించాలి. మంచి సినిమా తీసినప్పుడు, మంచి బిల్డింగ్ నిర్మించినప్పుడు కలిగే సంతృప్తిని ఎంత డబ్బు పెట్టినా కొనలేం. ప్రజలతో సంధానమై ఉన్న నిర్మాణ, సినీ రంగాలు రెండూ నమ్మకం, స్థిరత్వం, నిజాయితీల పై ఆధారపడి విజయాలను అందిస్తాయి.

Friday, May 4, 2012

జీవితానుభవం ఎంతైనా గొప్పది

 
















'తాతా.. బావున్నావా?'- ఆ పలకరింపు విని తల తిప్పి చూసా. నా పక్కనే కారులో కిరణ్. సాధారణంగా కారుకు, సైకిలుకు స్నేహం తక్కువ. అందులో లిబర్టీలాంటి బిజీ సెంటర్‌లో కారు ఆపి మరీ పలకరించటం అరుదైన సంఘటనే. బహుశా అందుకే కాబోసు, అందరూ మమ్మల్నే చూస్తున్నారు. కిరణ్ చిన్నప్పుడు మా స్కూల్లోనే చదువుకున్నాడు. ఈ సంఘటన జరగడానికి సరిగ్గా వారం రోజుల క్రితం మేమిద్దరం వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నాం. మళ్లీ ఇంత త్వరగా పలకరించుకోవాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. 'మా ఆఫీసు ఈ పక్క వీధిలోనే తాతా.

ఒక్క సారి రా.. అందరికీ పరిచయం చేస్తా' అన్నాడు కిరణ్. ఈ మధ్య కాలంలో నన్ను కిరణ్ అంత ఆప్యాయంగా ఆహ్వానించిన వారెవ్వరూ లేరు. మారు మాట్లాడకుండా అతనితో పాటు వెళ్లా. ఆఫీసు లోపలికి తీసుకువెళ్లి కొలీగ్స్‌నందరినీ పరిచయం చేశాడు. తన చిన్ననాటి సంగతులు జ్ఞాపకం చేసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత 'అప్పుడప్పుడు వస్తూ ఉండు తాత..' అన్నాడు. నాకు కన్నీళ్లొచ్చాయి. హోదాలు, అంతస్థులు, అహంకారాలు, అభిజాత్యాలే కనిపించే సమాజంలోఆప్యాయత ఎదురయితే కన్నీళ్లే వస్తాయేమో!

నాది కిరణ్‌ది ఒక చిత్రమైన బంధం. నేను వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న స్కూల్లో కిరణ్ చదువుతూ ఉండేవాడు. ఇక్కడ మా స్కూలు గురించి కొంత చెప్పాలి. మాది నిజమైన మాంటిస్సోరీ స్కూలు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే వాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తారనే భావనతో మొదలైన స్కూలు. అందుకే మా దగ్గర ఉన్న పిల్లలకు స్వేచ్ఛ ఎక్కువ ఉండేది. నేను పేరుకు వాచ్‌మ్యాన్‌నే అయినా కొత్తగా చేరిన పిల్లలను స్కూలు వాతావరణానికి అలవాటు చేసే బాధ్యత నాదే. ప్రతి ఏడాది అనేక మంది పిల్లలు స్కూల్లో కొత్తగా చేరుతూ ఉండేవారు.

వాళ్లకు స్కూలు అలవాటయ్యే దాకా తిప్పుతూ ఉండేవాడిని. అలా నేను స్కూల్లో తిప్పిన పిల్లల్లో కిరణ్ కూడా ఒకడు. కిరణ్ వాళ్ల అమ్మ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆ ఏడాది ప్రాజెక్టు పని కోసం అమెరికాకు వెళ్లింది. దాంతో కిరణ్ బెంగ బెంగగా ఉండేవాడు. అందుకే నేను కిరణ్‌ను ఎక్కువగా చేరదీసేవాడిని. ఏడాది గడిచింది. కిరణ్‌కు స్కూలు అలవాటయిపోయింది. ఒక్కసారి వాతావరణం అలవాటు అయిపోయిన తర్వాత పిల్లలు సాధారణంగా నా దగ్గరకు వచ్చేవారు కాదు. కిరణ్ మాత్రం అలా కాదు. చాలాసార్లు దగ్గరకి వచ్చి కబుర్లు చెప్పేవాడు. కొద్ది కాలానికి కిరణ్ కూడా స్కూలు వదిలి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత నా జీవితంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. మా అబ్బాయి స్కాలర్‌షిప్‌లతో బీటెక్ దాకా చదువుకున్నాడు. ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్లాడు. అక్కడే స్థిరపడిపోయాడు. 'నాన్నా.. నాకు ఇక్కడ డబ్బులు బాగానే వస్తున్నాయి. నువ్వు ఉద్యోగం మానేయి' అని ఫోన్లు చేస్తూ ఉండేవాడు. కొడుకుకు ఉద్యోగం వచ్చి సంపాదన పెరిగిన తర్వాత మా ఆవిడకు కూడా నా ఉద్యోగం నచ్చటం మానేసింది.

'మా ఆయన స్కూల్లో పనిచేస్తారు..' అని ఒకప్పుడు గర్వంగా అందరితోను చెప్పుకొనే మా ఆవిడ నిరసన వ్యక్తం చేయటం మొదలుపెట్టింది. వాచ్‌మ్యాన్ ఉద్యోగం నాకు కేవలం వృత్తి మాత్రమే కాదని, ప్రవృత్తి అని- డబ్బుల అవసరం ఉన్నా లేకపోయినా పిల్లల కోసమైనా స్కూలుకు వెళ్తానని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు. మా అబ్బాయికి పెళ్లిసంబంధాలు చూసేటప్పుడు కూడా ఈ విషయంలో అనేక ఘర్షణలు జరిగాయి. 'వాచ్‌మ్యాన్ కొడుకు అంటే వచ్చే సంబంధం కూడా రాదు. ఉద్యోగం మానేయండి. వాళ్లు ఇచ్చే ఐదు వేలు మనకు ఏ మూలకూ రాదు' అని పోరుపెట్టేది. అయినా నేను ఉద్యోగం మానలేదు. నాకు పిల్లలంటే ఇష్టం.

వాళ్లతో మాట్లాడటమంటే ఇష్టం. అలాంటప్పుడు స్కూలెలా మానేస్తా..? మా అబ్బాయికి పెళ్లైంది. వాడికి ఒక పిల్ల పుట్టింది. 'ఇక అక్కడ ఉన్నది చాలు. కష్టపడింది చాలు. ఇక్కడకు వచ్చేయండి..' అని వాడు ఫోన్లు చేయటం మొదలుపెట్టాడు. మా ఆవిడది కూడా అదే కోరిక. చివరికి ఉద్యోగం మానేసా. మేమిద్దరం రెండు నెలల కోసం అమెరికా వెళ్లాం. ఆరు నెలలు అక్కడే ఉండిపోయాం.

ఒక రోజు మా మనవరాలు వచ్చి- 'నువ్వేం పని చేస్తావు తాతా'' అని ముద్దుముద్దుగా అడిగింది. నేను పిల్లలను ఎలా తిప్పుతానో, వాళ్లకు స్కూలు వాతావరణం ఎలా అలవాటయ్యేలా చేస్తానో చెప్పా. అదంతా దాని ప్రాజెక్టు వర్క్‌ట. నేను చెప్పిన విషయాలన్నీ రాసి స్కూలు టీచర్‌కి ఇస్తే- వాళ్ల స్కూల్‌డేకి నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా పిలిచారు. 'కిందటి ఏడాది మేయర్‌ని పిలిచారు. ఈ సారి నీ వర్క్ చూసి ఇంప్రస్ అయ్యారుట. అందుకే నిన్ను పిలిచారు..' అని మా అబ్బాయి గొప్పగా చెబుతుంటే ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు.

కళ్లలో నీళ్లు కూడా రాలేదు. సంతోషాన్ని మించిన స్థితి అది. నన్ను ఇండియాలో ఎవరూ ఎప్పుడూ గౌరవించలేదు. నా వృత్తిని గౌరవించలేదు. స్కూల్లో వాచ్‌మ్యాన్ ఉద్యోగం అతి చిన్నది. కొందరి దృష్టిలో అనవసరమైనది కూడా. కాని ఆ ఉద్యోగానికి ఉన్న ప్రాముఖ్యత, గౌరవం అమెరికా వాళ్లు గుర్తించారు. అమెరికా చెడ్డదని చాలామంది అంటూ ఉంటే విన్నా. కాని వాళ్లకు మనలా భేషజాలు లేవు. హెచ్చుతగ్గులు లేవు. 'ఎన్ని తెలివితేటలుంటే అంత పెద్ద ఉద్యోగం..' అదే వారి సూత్రం.

ఇండియాకి వచ్చేస్తుంటే ఎయిర్‌పోర్టులో కిరణ్ కనపడ్డాడు. అతనే నాకు గుర్తులేడు. అతను గుర్తుపెట్టుకొని మరీ నా దగ్గరకు వచ్చి పలకరించాడు. ఓ పెద్ద పూల బొకే కూడా కొనిచ్చాడు. నాకు చాలా ఆనందమనిపించింది. అమెరికాలో ఉంటే అందరూ కిరణ్‌లా అయిపోతారేమోననిపించింది. జీవితంలో తొలిసారి అమెరికాలోనే స్థిరపడిపోతే బావుంటుందా అనిపించింది. విమానం ఎక్కే ముందు మళ్లీ 'నీ దగ్గరకు వచ్చేస్తారా..' అని మా అబ్బాయికి చెప్పి మరీ వచ్చా.

ఇండియాకు వచ్చిన తర్వాత మళ్లీ కిరణ్‌ను చూస్తానని అనుకోలేదు. అక్కడ గౌరవించిన వారు ఇక్కడ గౌరవించాలనేం లేదు కదా. కాని నా అంచనాలు తారుమారయ్యాయి. కిరణ్‌లాంటి వాళ్లు మన దగ్గర కూడా ఉన్నారు. అలాంటి వాళ్ల కోసం నేను అమెరికాకే వెళ్లాల్సిన అవసరం లేదని ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది! 


- ANDHRA JYOTHI daily