Friday, May 25, 2012

కుర్రాళ్ల కళ

ప్రయాణం ఎక్కడైనా మొదలవ్వొచ్చు. మొదలయ్యాక మాత్రం ఆగదు. ఈ కుర్రాళ్ల కళాత్మక ప్రయాణమూ అలాగే మొదలైంది. కుంచె నుంచి కంప్యూటర్‌కు చేరింది. వ్యక్తిగత ప్రతిభ వృత్తిగా మారింది. వాళ్ల పేరును విదేశాలకు పరిచయం చేసింది. విశాఖలో ఉంటున్న ఆ నలుగురు యువకుల కళాత్మక ప్రయాణమే ఇది...

నలుగురిలోకి కనక దుర్గేశ్వరరావు సీనియర్. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. వృత్తిరీత్యా కార్పెంటర్. ఇంట్లో అమ్మానాన్న, తోబుట్టువులు అందరూ అదే పనిచేస్తారు. ఆరో తరగతి చదువుతున్నప్పుడు విజయనగరం వలస వచ్చేశారు. అక్కడ మహారాజా విద్యాలయాల్లో చదవడం వల్ల ఆ వాతావరణం, ప్రాచీన కట్టడాలు, సంగీత కళాశాల నుంచి స్ఫూర్తి పొందాడు. కళలో రాణించాలంటే..ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పొందాలని తెలుసుకున్నాడు. పట్టుదలతో సీటు సాధించాడు. పెయింటింగ్ స్పెషలైజేషన్‌గా తీసుకున్నాడు. అక్కడ చేరాకే రంగులకు ప్రత్యేకతలు ఉంటాయని, వాటిని భావాలకనుగుణంగా వాడాలని తెలుసుకున్నాడు. వస్తువుని ఎలా చూడాలి? సృజనాత్మకత అంటే ఏమిటి? భావవ్యక్తీకరణ ఎలా చేయాలి? అనే దానిపై అవగాహన ఏర్పరుచుకున్నాడు.

ఇప్పుడు సింబియోసిస్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్నాడు. అందులోకి అడుగుపెట్టగానే రిసెప్షన్‌లో గోడకు ఎదురుగా బుద్ధుడి చిత్రపటం ఆకట్టుకుంటుంది. పరిశీలనగా చూస్తే బురదలో నుంచి పూసిన కలువ పువ్వు, దానిపై పచ్చటి ప్రకృతిలో ప్రతిబింబించే బుద్ధుడు, నుదుటిపై ప్రతిభావంతుడైన సూర్యుడు కనిపిస్తారు. ఆ చిత్రం రూపశిల్పి కనకదుర్గేశ్వరరావును ఆ బొమ్మలోని భావం గురించి అడిగితే "క్రూరంగా మారిన ఈ ప్రపంచానికి మరో బుద్ధుడు అవసరమనే ఉద్దేశంతో నా భావాల్ని అందులో పొందుపరిచాను. చిత్రంలో కనిపించే బురద సమాజంలో క్రూరత్వానికి ప్రతిబింబం. దాన్ని చీల్చుకుని పైకివచ్చిన కలువ బుద్ధుడు. అది ప్రపంచమంతా విస్తరించాలని ప్రకృతిలో మిళితం చేశాను. బుద్ధుడి నుదుటిపై సూరీడంత ప్రకాశంతో బుద్ధిజం వర్ధిల్లాల''ని విశ్లేషించాడు.

శివది 'బ్రోకెన్ హార్ట్'
బొగ్గుతో 'చిత్రాలు' గీసే శివకృష్ణది విశాఖపట్నం జిల్లా కోటవురట్ల మండలం దగ్గరి రాట్నాలపాలెం. తండ్రి రిక్షాపుల్లర్. పొద్దంతా రిక్షా తొక్కుతాడు. ఇంటికొచ్చాక బొగ్గుముక్కలతో గోడలపై బొమ్మలు గీసేవాడు. వాటిని చూసి శివకృష్ణకు అలా బొమ్మలు గీయాలనిపించేది. తండ్రితో చెబితే...ఎలా గీయాలో నేర్పించాడు. అలా తండ్రే తొలి గురువుగా చిత్రాభ్యాసం చేసిన శివకృష్ణ గొలుగొండ గురుకులం ఆరవ తరగతిలో చేరాడు. అక్కడ ప్రతి ఏటా చిత్రకళలో మొదటి బహుమతి పొందేవాడు. డ్రాయింగ్ టీచర్ మోహన్‌రావు ఇచ్చిన సలహాతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎఫ్ఎ చేరాడు.

ఆర్థిక స్థితి సహకరించకపోయినా అన్నయ్య సాయంతో కోర్సు పూర్తిచేశాడు. ఆ తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్ఎఫ్ఏ చేశాడు. అప్పటివరకు ఆసరాగా నిలిచిన అన్న టీచర్ ్రటైనింగ్ కోర్స్‌లో చేరతాననడంతో... బరోడా వెళ్లి ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌గా స్థిరపడాలనే తన కోరికకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. ఆ సమయంలోనే సీనియర్ దుర్గేశ్ ద్వారా సింబియోసిస్‌లో ఉద్యోగానికి పిలుపు రావడంతో పదిహేను వేల రూపాయల జీతానికి యానిమేషన్ వింగ్‌లో కేరక్టర్ డిజైనర్‌గా చేరాడు.

స్వీయ ప్రేమ అనుభవాన్ని ప్రతిఫలించేలా 'బ్రోకెన్ హార్ట్' పేరుతో తన చిత్రాన్ని తానే బొగ్గుతో గీసి దాన్నే ప్రదర్శనకు పెట్టాడు. అది కళాభిమానుల ప్రశంసలు అందుకుంది. "సచిన్ టెండూల్కర్ చిత్రానికి లభించిన ప్రశంసలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి. స్వేచ్ఛగా నచ్చిన చిత్రాలు గీయాలని మనసు ఎంతగానో ఉవ్విళ్లూరుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలనేది నా ఆకాంక్ష'' అన్నాడు శివకృష్ణ.

రెక్కల గుర్రం
కత్తుల శ్రీనుది ఇంకో కథ. అంబాజీపేట దగ్గరి పుల్లేటికూరు స్వస్థలం. నాన్న టైలరు. పేద కుటుంబం. బాల్యంలో ఒక వికలాంగుడైన కళాకారుడు ఆర్థిక సాయం కోసం బొమ్మలు గీస్తుంటే ఆయనకు సాయం చేసేవాడు శ్రీను. అలా కళతో పరిచయం ఏర్పడింది. పాఠశాలలో సామాజిక సమస్యలపై బొమ్మలు గీస్తే, కోనసీమ చిత్ర కళాపరిషత్ బహుమతులతో సత్కరించింది. పెయింటింగ్‌లో అనుభవం ఉండడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎఫ్ఎ శిల్పకళలో చేశాడు. చెక్కతో, రాళ్లతో బొమ్మలు తయారుచేయడం నేర్చుకున్నాడక్కడ.

కోర్స్ పూర్తికాగానే సొంతూరుకు వెళ్లాడు. అక్కడ సొంతంగా బొమ్మలు చేసేవాడు. అయితే చేతినిండా పనులు ఎప్పుడూ ఉండేవి కావు. అందుకని ఏడాదిన్నర క్రితం సింబియోసిస్‌లో ఉద్యోగానికి చేరాడు. "నేను తయారుచేసిన తెల్లటి రెక్కల గుర్రం సింబియోసిస్ భవనం ముందు నిలబడగానే కుడివైపున పచ్చటి గార్డెన్‌లో గాలిలో ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. దాని పక్కనే హయగ్రీవుడు పద్మాసనం వేసుకుని కూర్చున్న బొమ్మ ఉంటుంది.

ఈ రెండింటిని మా బాస్ కోరిక మేరకు రూపొందించాను. ప్రస్తుతం మదర్ థెరిసా, గొరిల్లా ప్రతిమలు తయారుచేస్తున్నాను. మైనంతో కేంద్ర మంత్రి పురందేశ్వరి బొమ్మ చేయడం మొదలుపెట్టాను. ఇవేకాకుండా కొల్లాజ్ చిత్రకళ కూడా బాగా చేయగలను. ప్రధాని మన్మోహన్‌సింగ్, ముంబైకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పాండా, జ్యోతిరావ్ సింధియా తదితరుల ప్రోటయిట్‌లను రూపొందిస్తున్నాను'' అని చెప్పాడు శ్రీను.

ఈ బృందంలో చివరివాడు గోపి. "బికామ్ కంప్యూటర్స్ పాసయిన తరువాత హైదరాబాద్‌లో '3డి మాయ' కోర్సు చేశాను. ఆరునెలలు అక్కడే పనిచేశాను. ఆ తరువాత సింబియోసిస్‌లో చేరాను. అక్కడ సహోద్యోగుడయిన శ్రీను పరిచయం శిల్పాలు తయారీవైపు నడిపించింది. మదర్ థెరిస్సా, గొరిల్లా బొమ్మల తయారీలో కూడా సాయం చేస్తున్నాను. బయట రూపొందించే బొమ్మ ఎలా ఉంటుందో ముందుగా కంప్యూటర్‌లో '3డి' టెక్నాలజీతో చూపిస్తాను. కొల్లాజ్ చిత్రాల తయారీలోను నాకంటూ ఒక శైలిని రూపొందించుకున్నా'' అన్నాడు.

- యర్రా శ్రీనివాసరావు,విశాఖపట్నం
ఫొటోలుః ఎం. విజయ రఘునాథ్

Monday, May 7, 2012

కె.ఎల్. కొత్త బంగారు లోకం

 http://cdn2.supergoodmovies.com/FilesTwo/48c62ceaf658427f928d931135af1ed6.gif

 మనుషుల రోగాలు నయం చేద్దామని ఎంబిబిఎస్ చదివారు. కాని పరిస్థితుల ప్రభావం వల్ల నిర్మాణ రంగం వైపు అడుగిడారు. డాక్టరుగా మనుషుల ఆరోగ్యాన్ని పట్టించుకోలేకపోతేనేం బిల్డర్‌గా ఇళ్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నాణ్యమైన ఇళ్లను నిర్మించడమే కాకుండా పచ్చదనానికి పెద్ద పీట వేస్తున్న ఈ డాక్టర్ బిల్డర్ పేరు కె.ఎల్.నారాయణ. నిర్మాణ రంగంలో 'ట్రెండ్‌సెట్' చేసిన నారాయణ పని వివరాలు ఆయన మాటల్లోనే...

"మల్టీనేషనల్, కార్పొరేట్ సంస్థల వలె నేను ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టను. చాలా తక్కువే చేస్తాను. అవే నిర్మాణ రంగంలో ట్రెండ్‌సెట్టర్‌లుగా నిలుస్తాయి. ఆర్కిటెక్‌లు ఇచ్చిన ప్లాన్ ఆధారంగానే కట్టినప్పటికీ అంతకుముందు నేను చూసిన, చదివిన పలు అంశాలు వాటికి చేర్చి నిర్మిస్తుంటాను. అందుకే మా కట్టడాలకు ఆదరణ ఎక్కువ.

అందుకు ఉదాహరణ నా ఇరవై యేళ్ల నిర్మాణరంగ సర్వీసులో ఇంతవరకు బ్రోచర్‌లు వేయించడం గాని, ఫ్లెక్సీలు - హోర్డింగులు పెట్టడం, వాణిజ్యప్రకటనలు ఇవ్వడం వంటివేమీ చేయకపోవడమే. నా దగ్గర ఫ్లాట్ కొన్నవాళ్లు బాగుందని చెప్పడం వల్ల మరొకరు వస్తారు. మా నిర్మాణాలపట్ల నమ్మకం, మా దగ్గర కొన్న వాటిని తిరిగి అమ్ముకున్నా మంచి విలువ వస్తుందన్న గ్యారంటీయే కొనుగోలుదారుల్ని మా దగ్గరికి తీసుకొస్తున్నాయి.

పేరుకు తగ్గ పని మాది

1989లో శ్రీ దుర్గ ఎస్టేట్స్ ప్రారంభించి తక్కువ ఆదాయ వర్గాలకోసం జీడిమెట్లలో ఐదు వందల ఇళ్ల సముదాయాన్ని నిర్మించాను. ఇది నా మొదటి ప్రాజెక్ట్. ఆ తరువాత 1993లో ట్రెండ్‌సెట్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించాను. ట్రెండ్‌సెట్ అన్న మా కంపెనీ పేరుకు తగ్గట్టే ఉంటుంది మా పని. యాంత్రికంగా ఏదో చేశాం, ఇచ్చాం అన్నట్టు ఉండదు. చేసేది వ్యాపారమే అయినప్పటికీ అందులో వ్యక్తిగత సంబంధం ఉండడమనేది చాలా ముఖ్యం. అలా ఉన్నప్పుడే వ్యాపారంలో విజయం సాధించడం సులువు. బిల్డర్‌గా నేను వంద ఫ్లాట్లు క ట్టొచ్చు. కాని కొనుగోలుదారుడికి జీవితకాలం కష్టపడి ఆదా చేసుకున్న డబ్బుతో కొనుక్కునే ఇల్లు ఒక్కటే కదా. వాళ్లకది ఎంతో అపురూపం. అందుకే వాళ్ల డబ్బుకి న్యాయం చేసేలా మా నిర్మాణం ఉంటుంది.

పూల మొక్కలు - పచ్చదనం

ఇప్పటివరకు ఎన్నో వెంచర్‌లు చేశాం. కొండాపూర్‌లోని 30 అపార్టుమెంట్‌ల కాంప్లెక్స్, ట్రెండ్‌సెట్ టవర్స్, ఎఎన్ఆర్ సెంటర్, శ్రీదుర్గా టవర్స్, ట్రెండ్‌సెట్ విల్లె, ట్రెండ్‌సెట్ వింటేజ్‌లు మేము కట్టినవే. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో ట్రెండ్‌సెట్ వింజ్ పేరుతో ఏడు బ్లాక్‌ల గేటెడ్ కమ్యూనిటీ మా సరికొత్త వెంచర్. ఆరు ఎకరాల భూమిలో 280 ఫ్లాట్స్‌తో కట్టిన ఈ నిర్మాణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

పార్కింగ్ ఏరియా ఏమాత్రం బయటికి కనిపించకుండా ఐదు ఎకరాల్లో సెల్లార్ కార్ పార్కింగ్ ఏర్పాటుచేశాం. దాని పైభాగమంతా లాన్‌తో కప్పి ఉంటుంది. పార్కింగ్‌లోకి వెళ్లేందుకు డ్రైవ్‌వే ర్యాంప్ ఉంది. సెల్లార్ పార్కింగ్ అనగానే చాలామందికి నీళ్లు నిల్వ ఉండడం గుర్తు రావొచ్చు. అలాంటిదేం ఉండదు. ఒకవేళ వచ్చినా బయటికి పోవడానికి పార్కింగ్‌లో డ్రెయిన్ వ్యవస్థ ఉంది. ఆటోమేటిక్ పంప్ సీవరేజ్ వ్యవస్థ, కలెక్షన్ పిట్‌లు ఉన్నాయి. కలెక్షన్ పిట్ నిండగానే నీళ్లు వాటంతటవే బయటికి పోయేలా ఏర్పాటు ఉంది.

ముంగిట్లోకే అన్నీ...

ఇక్కడ స్విమ్మింగ్‌పూల్‌తో కలిపి క్లబ్ హౌస్ నిర్మించాం. ఎ/సి జిమ్, స్పా, ఇండోర్ గేమ్స్, బాంక్వెట్ హాల్, ఎసి రెస్టారెంట్ లతో పాటు పిల్లల కోసం క్రెచ్ కూడా ఉంది. బాస్కెట్ బాల్, వాలీ బాల్ కోర్టులు, సింథటిక్ ఫ్లోరింగ్‌తో పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేశాం. జాగింగ్ ట్రాక్, హెల్త్‌సెంటర్‌లు కూడా ఉన్నాయి. బయటికి వెళ్లే పనిలేకుండా తాజా గాలిని పీలుస్తూ కంటినిండా పచ్చదనాన్ని నింపుకుని ఎంచక్కా వాకింగ్ కూడా చేయొచ్చు. ఎటు చూసినా సిమెంటు కట్టడాలతో నిండిపోతున్న హైదరాబాద్‌లాంటి ప్రదేశంలో ఎటు చూసినా పచ్చదనం, పూలు కనిపించేలా కట్టిందే ట్రెండ్‌సెట్ వింజ్.

కరెంటు కోతలు ఇబ్బంది పెట్టకుండా 100 శాతం పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉంది. జనరేటర్ ద్వారా అందించే ఈ కరెంటు ఎంత వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు మీటర్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి పైపు గ్యాస్ లైన్లు ఉన్నాయి. గ్యాస్ బ్యాంక్ నుంచి అందించే ఈ గ్యాస్ ఎంత వినియోగిస్తున్నారో మీటర్ల ద్వారా తెలుసుకునే ఏర్పాటుంది. అలాగే ఎస్‌టిపి (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) కూడా ఉంది. ఫైర్ సేఫ్టీ వ్యవస్థతో పాటు భూకంపాలను తట్టుకునేలా కట్టిన డిజైన్ ఇది. వాస్తుపరంగా కూడా పక్కాగా ఉంది.

ప్రస్తుతం విజయవాడ బెంజిసెంటర్‌లో ఆరుస్క్రీన్లతో మల్టీప్లెక్స్ మాల్ నిర్మిస్తున్నాం. మెట్రో నగరాల్లో మాల్స్ ఎలాగయితే ఉంటాయో వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది ఇది. దీనికి ట్రెండ్‌సెట్ బెంజ్ మాల్ అని పేరు పెట్టాం.

రెసిషన్+ఉద్యమం

నిర్మాణ రంగం బాగా బూమ్‌లో ఉన్నప్పుడు మొదట రెసిషన్ ప్రభావం, ఆ తరువాత తెలంగాణ ఉద్యమ ప్రభావం పడింది. ఇదివరకు శివార్లలో యాభై, వంద ఎకరాలు కొని వెంచర్‌లు కట్టేవాళ్లు. ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే నాణ్యతతో కట్టిన భవనాలకు డిమాండ్ ఇప్పటికీ బాగానే ఉంది. కాకపోతే ఇదివరకులా పేపర్ మీద చూపించి అమ్ముదామనుకుంటే మాత్రం కుదరదు. బిల్డర్ ట్రాక్ రికార్డును చూసి మాత్రమే కొంటున్నారు. ధరలపైన మాత్రం ఉద్యమ ప్రభావం ఉంది. రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నప్పుడు చదరపు అడుగు నాలుగు వేలు ఉంటే ఇప్పుడది మూడు వేల ఐదొందలకి తగ్గింది.''

మూడు సినిమాలతో మళ్లీ...

నిర్మాణరంగంతో పాటు సినిమాలంటే కూడా చాలా ఇష్టం నాకు. 1990లో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ఎస్ గోపాలరెడ్డి (సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ)గారితో పరిచయం నన్ను నిర్మాతను చేసింది. శ్రీదుర్గ ఆర్ట్స్ ఏర్పాటుచేసి వెంకటేష్, శ్రీదేవిలతో క్షణక్షణం నిర్మించాం. ఇది మా మొదటి సినిమా. ఆ తరువాత హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, నిన్నే ఇష్టపడ్డాను, సంతోషం, రాఖీ సినిమాలు వరసగా తీశాం. రాఖీ తరువాత నాలుగేళ్లుగా సినిమా నిర్మించకపోవడానికి కారణం కథలు నచ్చకపోవడమే. ఈ ఏడాది రాంచరణ్ - బోయపాటి శ్రీనివాస్, మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లలో రెండు సినిమాలు నిర్మించబోతున్నాం. ఎన్టీఆర్‌తో కూడా సినిమా తీయబోతున్నాం.

మంచికథ ఉంటే కొత్త వాళ్లతో అయినా, చిన్న హీరోలతో అయినా సినిమా నిర్మించేందుకు సిద్ధం. పద్ధతిగా, ప్రణాళికగా చేసుకుంటే నష్టం వచ్చే వ్యాపారం కాదు సినిమా. కాకపోతే హిపోక్రసీకి పోకుండా నిజాయితీగా వ్యవహరించాలి. మంచి సినిమా తీసినప్పుడు, మంచి బిల్డింగ్ నిర్మించినప్పుడు కలిగే సంతృప్తిని ఎంత డబ్బు పెట్టినా కొనలేం. ప్రజలతో సంధానమై ఉన్న నిర్మాణ, సినీ రంగాలు రెండూ నమ్మకం, స్థిరత్వం, నిజాయితీల పై ఆధారపడి విజయాలను అందిస్తాయి.

Friday, May 4, 2012

జీవితానుభవం ఎంతైనా గొప్పది

 
















'తాతా.. బావున్నావా?'- ఆ పలకరింపు విని తల తిప్పి చూసా. నా పక్కనే కారులో కిరణ్. సాధారణంగా కారుకు, సైకిలుకు స్నేహం తక్కువ. అందులో లిబర్టీలాంటి బిజీ సెంటర్‌లో కారు ఆపి మరీ పలకరించటం అరుదైన సంఘటనే. బహుశా అందుకే కాబోసు, అందరూ మమ్మల్నే చూస్తున్నారు. కిరణ్ చిన్నప్పుడు మా స్కూల్లోనే చదువుకున్నాడు. ఈ సంఘటన జరగడానికి సరిగ్గా వారం రోజుల క్రితం మేమిద్దరం వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నాం. మళ్లీ ఇంత త్వరగా పలకరించుకోవాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. 'మా ఆఫీసు ఈ పక్క వీధిలోనే తాతా.

ఒక్క సారి రా.. అందరికీ పరిచయం చేస్తా' అన్నాడు కిరణ్. ఈ మధ్య కాలంలో నన్ను కిరణ్ అంత ఆప్యాయంగా ఆహ్వానించిన వారెవ్వరూ లేరు. మారు మాట్లాడకుండా అతనితో పాటు వెళ్లా. ఆఫీసు లోపలికి తీసుకువెళ్లి కొలీగ్స్‌నందరినీ పరిచయం చేశాడు. తన చిన్ననాటి సంగతులు జ్ఞాపకం చేసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత 'అప్పుడప్పుడు వస్తూ ఉండు తాత..' అన్నాడు. నాకు కన్నీళ్లొచ్చాయి. హోదాలు, అంతస్థులు, అహంకారాలు, అభిజాత్యాలే కనిపించే సమాజంలోఆప్యాయత ఎదురయితే కన్నీళ్లే వస్తాయేమో!

నాది కిరణ్‌ది ఒక చిత్రమైన బంధం. నేను వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న స్కూల్లో కిరణ్ చదువుతూ ఉండేవాడు. ఇక్కడ మా స్కూలు గురించి కొంత చెప్పాలి. మాది నిజమైన మాంటిస్సోరీ స్కూలు. పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే వాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తారనే భావనతో మొదలైన స్కూలు. అందుకే మా దగ్గర ఉన్న పిల్లలకు స్వేచ్ఛ ఎక్కువ ఉండేది. నేను పేరుకు వాచ్‌మ్యాన్‌నే అయినా కొత్తగా చేరిన పిల్లలను స్కూలు వాతావరణానికి అలవాటు చేసే బాధ్యత నాదే. ప్రతి ఏడాది అనేక మంది పిల్లలు స్కూల్లో కొత్తగా చేరుతూ ఉండేవారు.

వాళ్లకు స్కూలు అలవాటయ్యే దాకా తిప్పుతూ ఉండేవాడిని. అలా నేను స్కూల్లో తిప్పిన పిల్లల్లో కిరణ్ కూడా ఒకడు. కిరణ్ వాళ్ల అమ్మ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆ ఏడాది ప్రాజెక్టు పని కోసం అమెరికాకు వెళ్లింది. దాంతో కిరణ్ బెంగ బెంగగా ఉండేవాడు. అందుకే నేను కిరణ్‌ను ఎక్కువగా చేరదీసేవాడిని. ఏడాది గడిచింది. కిరణ్‌కు స్కూలు అలవాటయిపోయింది. ఒక్కసారి వాతావరణం అలవాటు అయిపోయిన తర్వాత పిల్లలు సాధారణంగా నా దగ్గరకు వచ్చేవారు కాదు. కిరణ్ మాత్రం అలా కాదు. చాలాసార్లు దగ్గరకి వచ్చి కబుర్లు చెప్పేవాడు. కొద్ది కాలానికి కిరణ్ కూడా స్కూలు వదిలి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత నా జీవితంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. మా అబ్బాయి స్కాలర్‌షిప్‌లతో బీటెక్ దాకా చదువుకున్నాడు. ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్లాడు. అక్కడే స్థిరపడిపోయాడు. 'నాన్నా.. నాకు ఇక్కడ డబ్బులు బాగానే వస్తున్నాయి. నువ్వు ఉద్యోగం మానేయి' అని ఫోన్లు చేస్తూ ఉండేవాడు. కొడుకుకు ఉద్యోగం వచ్చి సంపాదన పెరిగిన తర్వాత మా ఆవిడకు కూడా నా ఉద్యోగం నచ్చటం మానేసింది.

'మా ఆయన స్కూల్లో పనిచేస్తారు..' అని ఒకప్పుడు గర్వంగా అందరితోను చెప్పుకొనే మా ఆవిడ నిరసన వ్యక్తం చేయటం మొదలుపెట్టింది. వాచ్‌మ్యాన్ ఉద్యోగం నాకు కేవలం వృత్తి మాత్రమే కాదని, ప్రవృత్తి అని- డబ్బుల అవసరం ఉన్నా లేకపోయినా పిల్లల కోసమైనా స్కూలుకు వెళ్తానని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు. మా అబ్బాయికి పెళ్లిసంబంధాలు చూసేటప్పుడు కూడా ఈ విషయంలో అనేక ఘర్షణలు జరిగాయి. 'వాచ్‌మ్యాన్ కొడుకు అంటే వచ్చే సంబంధం కూడా రాదు. ఉద్యోగం మానేయండి. వాళ్లు ఇచ్చే ఐదు వేలు మనకు ఏ మూలకూ రాదు' అని పోరుపెట్టేది. అయినా నేను ఉద్యోగం మానలేదు. నాకు పిల్లలంటే ఇష్టం.

వాళ్లతో మాట్లాడటమంటే ఇష్టం. అలాంటప్పుడు స్కూలెలా మానేస్తా..? మా అబ్బాయికి పెళ్లైంది. వాడికి ఒక పిల్ల పుట్టింది. 'ఇక అక్కడ ఉన్నది చాలు. కష్టపడింది చాలు. ఇక్కడకు వచ్చేయండి..' అని వాడు ఫోన్లు చేయటం మొదలుపెట్టాడు. మా ఆవిడది కూడా అదే కోరిక. చివరికి ఉద్యోగం మానేసా. మేమిద్దరం రెండు నెలల కోసం అమెరికా వెళ్లాం. ఆరు నెలలు అక్కడే ఉండిపోయాం.

ఒక రోజు మా మనవరాలు వచ్చి- 'నువ్వేం పని చేస్తావు తాతా'' అని ముద్దుముద్దుగా అడిగింది. నేను పిల్లలను ఎలా తిప్పుతానో, వాళ్లకు స్కూలు వాతావరణం ఎలా అలవాటయ్యేలా చేస్తానో చెప్పా. అదంతా దాని ప్రాజెక్టు వర్క్‌ట. నేను చెప్పిన విషయాలన్నీ రాసి స్కూలు టీచర్‌కి ఇస్తే- వాళ్ల స్కూల్‌డేకి నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా పిలిచారు. 'కిందటి ఏడాది మేయర్‌ని పిలిచారు. ఈ సారి నీ వర్క్ చూసి ఇంప్రస్ అయ్యారుట. అందుకే నిన్ను పిలిచారు..' అని మా అబ్బాయి గొప్పగా చెబుతుంటే ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు.

కళ్లలో నీళ్లు కూడా రాలేదు. సంతోషాన్ని మించిన స్థితి అది. నన్ను ఇండియాలో ఎవరూ ఎప్పుడూ గౌరవించలేదు. నా వృత్తిని గౌరవించలేదు. స్కూల్లో వాచ్‌మ్యాన్ ఉద్యోగం అతి చిన్నది. కొందరి దృష్టిలో అనవసరమైనది కూడా. కాని ఆ ఉద్యోగానికి ఉన్న ప్రాముఖ్యత, గౌరవం అమెరికా వాళ్లు గుర్తించారు. అమెరికా చెడ్డదని చాలామంది అంటూ ఉంటే విన్నా. కాని వాళ్లకు మనలా భేషజాలు లేవు. హెచ్చుతగ్గులు లేవు. 'ఎన్ని తెలివితేటలుంటే అంత పెద్ద ఉద్యోగం..' అదే వారి సూత్రం.

ఇండియాకి వచ్చేస్తుంటే ఎయిర్‌పోర్టులో కిరణ్ కనపడ్డాడు. అతనే నాకు గుర్తులేడు. అతను గుర్తుపెట్టుకొని మరీ నా దగ్గరకు వచ్చి పలకరించాడు. ఓ పెద్ద పూల బొకే కూడా కొనిచ్చాడు. నాకు చాలా ఆనందమనిపించింది. అమెరికాలో ఉంటే అందరూ కిరణ్‌లా అయిపోతారేమోననిపించింది. జీవితంలో తొలిసారి అమెరికాలోనే స్థిరపడిపోతే బావుంటుందా అనిపించింది. విమానం ఎక్కే ముందు మళ్లీ 'నీ దగ్గరకు వచ్చేస్తారా..' అని మా అబ్బాయికి చెప్పి మరీ వచ్చా.

ఇండియాకు వచ్చిన తర్వాత మళ్లీ కిరణ్‌ను చూస్తానని అనుకోలేదు. అక్కడ గౌరవించిన వారు ఇక్కడ గౌరవించాలనేం లేదు కదా. కాని నా అంచనాలు తారుమారయ్యాయి. కిరణ్‌లాంటి వాళ్లు మన దగ్గర కూడా ఉన్నారు. అలాంటి వాళ్ల కోసం నేను అమెరికాకే వెళ్లాల్సిన అవసరం లేదని ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది! 


- ANDHRA JYOTHI daily

Sunday, March 4, 2012

ఇది మా ఊరు... 'ఎస్ఒఎస్ చ్రిల్డన్స్ విలేజ్'

http://www.hope.ac.uk/images/stories/sos-childrens-villages.jpeg
ఇంటిని మించిన స్వర్గం లేదు. తల్లిని మించిన దైవం లేదు. సోదరప్రేమకు ఏదీ సాటి రాదు. మనిషన్న వాడు ఇంకా మాయమైపోవడం లేదంటే.. ఆ మూడే కారణమని చెప్పొచ్చు. అందుకేనేమో ఇల్లులేని, తల్లిలేని, సోదరులు లేని.. అనాథపిల్లలకు ఓ కొత్త సమాజాన్ని అందివ్వాలనుకున్నారు ఓ మహానుభావుడు. ఆస్ట్రియాలో అప్పుడెప్పుడో ఆయన నాటిన మొక్క విశ్వవ్యాప్తమై.. ఇప్పుడు 133 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3.50 లక్షల మంది దిక్కులేని పిల్లలకు పెద్దదిక్కై నిలిచిన ఆ సంస్థ పేరు 'ఎస్ఒఎస్ చ్రిల్డన్స్ విలేజ్'. అన్నీ కోల్పోయి ఒట్టి చేతులతో అడుగుపెట్టిన ప్రతి చిన్నారికీ అన్నీ తానై నిలుస్తోంది ఈ సంస్థ. మంచి చదువులు చెప్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్ది.. తిరిగి సమాజానికి అప్పగిస్తోంది. మన రాష్ట్రంలో మూడు విలేజ్‌లను ఏర్పాటు చేసింది. అందులో ఒకటైన హైదరాబాదుకు సమీపంలోని వట్టినాగులపల్లి చ్రిల్డన్స్ విలేజ్ విశేషాలు...

తల్లిదండ్రులంటే ఎవరు?
దేనికీ లోటు రాకుండా పెంచేవారు.
అన్నదమ్ములు అక్కచెల్లెళ్లలంటే..?
రక్తసంబంధం తెంచుకోలేనివారు.
కుటుంబం అంటే..
భద్రతతోపాటు భరోసానిచ్చేది. ఇవన్నీ లేనోళ్లను 'అనాథ'లు అంటుంది సమాజం. ఒకసారి 'ఎస్.ఒ.ఎస్.(సేవ్ అవర్ సోల్) చిల్డ్రన్స్ విలేజ్'కు వెళ్లి అక్కడున్న పిల్లల్ని చూస్తే.. ఆ మాట అనేందుకు నోరు రాదు. ఆపిల్లల తల్లిదండ్రులు బతికున్నా.. ఇంతకంటే గొప్ప జీవితాన్ని పొందేవారు కాదేమో అనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి శంకర్‌పల్లి రూట్‌లో యాభై కిలోమీటర్లు వెళితే.. వట్టినాగులపల్లికి పక్కనే ఉంటుంది ఈ స్వర్గధామం. చుట్టూ పచ్చటి పొలాలు. ఆహ్లాదకరమైన వాతావరణం. ఆత్మీయంగా పలకరించే పల్లె జనం. వీటన్నిటి నడుమ నాలుగున్నర ఎకరాల్లో ఎస్ఒఎస్‌ను తీర్చిదిద్దారు. గేటు దాటి లోపలికి అడుగుపెడుతూనే.. చూడముచ్చటైన ఇళ్లు, విశాలమైన గడ్డిమైదానాలు, అటూ ఇటూ కలియదిరిగే తెల్లటి బాతులతో.. ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీకంటే గొప్పగా కనిపిస్తుంది. పొద్దున తొమ్మిదిలోపు వెళితే పిల్లలందరూ యూనిఫాం వేసుకుని, బూట్లు తొడుక్కుని, క్యారేజ్‌లు పట్టుకుని స్కూలు బస్సులు ఎక్కుతుంటారు. తల్లులందరూ ఇళ్ల గుమ్మాల్లో నిలబడి.. చిరునవ్వులతో వారిని సాగనంపుతున్నారు.
http://www.soscvindia.org/charity/images/aboutus/milestone/2006.jpg
ఉదయాన్నే స్కూళ్లకు వెళ్లడం, తిరిగి సాయంత్రం ఇంటికి రావడం, మళ్లీ ట్యూషన్లకు వెళ్లడం.. సమయం దొరికినప్పుడల్లా ఆడుకోవడం.. అందరి పిల్లల్లాగే వీళ్లు కూడా బిజీగా కనిపిస్తారు. ఇక్కడున్న పిల్లల్లో కొందరికి అమ్మలేదు. మరికొందరికి నాన్న లేడు. చాలామందికి ఇద్దరూ లేరు. అయితే, ఈ ప్రాంగణంలోకి వచ్చాక.. పిల్లలకు ఆ లోటు తెలియదు. వారి దిగులు ముఖాల్లో వెలుగులు పూస్తాయి. పిల్లల కోసం కట్టిన ఇళ్లు, వాళ్లకు పెట్టే తిండి, వేసుకునే బట్టలు, కంటికి రెప్పలా చూసుకునే తల్లులను చూశాక.. దీన్ని అనాథాశ్రమం అంటే నమ్మబుద్ధి కాదు.
మామూలు అనాథాశ్రమాలకు దీనికీ పోలికే లేదు. అందరి ఇళ్లలో పిల్లలు ఎంత హాయిగా బతుకుతారో, అనా«థ పిల్లలు కూడా అంతే హాయిగా బతకాలన్నదే ఎస్ఒఎస్ లక్ష్యం. ఈ సంస్థ పునాదులే చాలా ప్రత్యేకమైనవి. ఆ పునాదుల్లోనే నాలుగు మూలస్తంభాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి: తల్లి (మదర్), రెండు : అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు (బ్రదర్స్ అండ్ సిస్టర్స్), మూడు : ఇల్లు (హౌస్), నాలుగు : గ్రామం (విలేజ్). ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చిల్డ్రన్స్ విలేజ్ పెట్టాలనుకున్నా వాళ్లు ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఇప్పటి వరకు 130 దేశాలలో 500 చ్రిల్డన్స్ విలేజ్‌లను ఏర్పాటు చేసిస సంస్థ ఎస్ఒఎస్.SOS Children's Villages of India
పుట్టుక ఆస్ట్రియాలో..
వ్యాపార సంస్థను స్థాపించేవారికి తెలివితేటలు కావాలి. పదిమందికి సేవచేసే సంస్థను ఏర్పాటు చేసేవారికి తెలివితేటలకంటే సున్నితమైన హృదయం ఉండాలి. అలాంటి మనసున్న మనిషి డాక్టర్ హెర్మన్ మీనర్. ఆస్ట్రియాలోని ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఈయన చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి తల్లిలేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేసింది వాళ్ల అక్క. బాగా చదువుకుని హెర్మన్ డాక్టర్ అయ్యారు. తల్లిదండ్రులు లేని తనలాంటి వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది ఆయనకు. తన అక్క మాదిరి ప్రేమతో చూసుకునే మనుషులు దొరికితే.. అనాథలకు ఏ దిగులూ ఉండదనుకున్నారు. అప్పటికే ఎన్నో రకాల అనాథాశ్రమాలను చూశారాయన. వాటన్నిటినీ అధ్యయనం చేసిన తర్వాత హెర్మన్‌కు.. ఒక కొత్త ఆలోచన తట్టింది. ఒక మనిషిని మానవీయ విలువలతో పెంచి పెద్దచేసేందుకు కుటుంబం కంటే గొప్ప వ్యవస్థ ఈ ప్రపంచంలో మరొకటి లేదనుకున్నాడు. ఆ కుటుంబం నమూనాలోనే అనాథాశ్రమాన్ని పెడితే ఎలా ఉంటుంది? అనుకున్నారు.

ఆ ఆలోచనను మిత్రుల ముందు పెడితే అద్భుతం అన్నారు. దీంతో ఆస్ట్రియాలో తొలి ఎస్ఒఎస్ చిల్డ్రన్స్ విలేజ్ ఊపిరిపోసుకుంది. అందులో- రెండో ప్రపంచ యుద్ధంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆశ్రయం కల్పించారు. కొరియా యుద్ధం తర్వాత కొరియాలో రెండో కేంద్రం వెలసింది. మిగిలిన దేశాలు కూడా హెర్మన్‌ను ఆహ్వానించడంతో.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో చ్రిల్డన్స్ విలేజ్‌లు వెలిశాయి. హెర్మన్ మరణించాక ఆ స్థానంలో హెల్మట్ కుటిన్ బాధ్యతలు తీసుకున్నారు. ఒకప్పుడు కుటిన్‌కు కూడా ఎస్ఒఎస్ విలేజ్‌లోనే చదువకునే భాగ్యం కలిగింది. ఎస్ఒఎస్ చిల్డ్రన్స్ విలేజ్ కాన్సెప్ట్‌కు మన తొలి ప్రధాని నెహ్రూ సైతం స్పందించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రోత్సాహం ఇవ్వడంతో ఇండియాలో తొలి చిల్డ్రన్స్ విలేజ్ ఫరీదాబాద్‌లో ఆవిర్భవించింది. ఇప్పుడు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 32 విలేజ్‌లు పనిచేస్తున్నాయి. మన రాష్ట్రంలో నెలకొల్పిన విలేజ్‌లలో విశాఖపట్టణంలో 283 మంది, వట్టినాగులపల్లిలో 170 మంది పిల్లలకు ఆశ్రయం లభించింది. తిరుపతిలో విలేజ్ నిర్మాణం చురుగ్గా జరుగుతోంది. అక్కడ కూడా తాత్కాలిక వసతి కింద 60 మంది పిల్లలను చేరదీశారు.

ఎవరి ఇల్లు వారిదే..


పిల్లలందర్నీ ఒకే గదిలో పెడితే సొంతింట్లో ఉన్నామన్న భావన కలుగదు. వాళ్ల మనస్తత్వాన్ని పసిగట్టి పెంచటమూ కష్టమవుతుంది. ఆ వయసులో తగినంత ప్రేమ అందకపోతే మానసిక ఎదుగుదల లోపిస్తుంది. ప్రేమాభిమానాలు లేకుండా కేవలం సౌకర్యాలొక్కటే అమర్చితే- వేళకు తిండి జరిగిపోవచ్చు. అంతో ఇంతో చదువు రావచ్చు. కాని అన్ని భావోద్వేగాల మధ్య పెరిగిన మనిషి మాత్రం అవ్వలేరు. అందుకే ప్రతి పదిమందికి ఒక హౌస్‌ను ఏర్పాటు చేసింది ఎస్ఒఎస్. ఈ ఇళ్లన్నీ గేటెడ్ కమ్యూనిటీ లోపలే ఉంటాయి. విస్తీర్ణాన్ని బట్టి హౌస్‌ల సంఖ్య పెరగొచ్చు, తగ్గొచ్చు. వట్టినాగులపల్లిలోని చ్రిల్డన్స్ విలేజ్‌లో మాత్రం 12 హౌస్‌లను నిర్మించారు.

హౌస్‌లు ఎన్ని ఉన్నా ఒక్కో ఇంట్లో 10 నుంచి 12 మంది పిల్లలకే ఆవాసం లభిస్తుంది. అంతకు మించి ఒక్కరిని కూడా ఉంచరు. ఇంట్లోలానే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండే అలవాటు రావాలన్న ఉద్దేశ్యంతో.. ప్రతి హౌస్‌లో ఆడమగ ఇద్దరూ ఉండేలా చూస్తారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మాదిరి సోదర ప్రేమకు దూరం కాకూడదన్నదే ఎస్ఒఎస్ లక్ష్యం. హౌస్‌లలో చేరిన వెంటనే పిల్లల ఆసక్తులను బట్టి ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో చేర్పిస్తుంది యాజమాన్యం. స్కూలు ఫీజులు, యూనిఫాం, పుస్తకాల ఖర్చు పెట్టుకోవడమే కాక రానుపోను బస్సులను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం ట్యూషన్లను కూడా పెట్టించారు. ఇక్కడున్న వాళ్లలో ఎనభైశాతం మంది పిల్లలు తొంభై శాతం మార్కులతో పాసవుతుండం విశేషం.

మగ పిల్లలకు 14 ఏళ్లు వచ్చాక.. 'యూత్ ఫెసిలిటీ' పేరుతో నగరంలో ప్రత్యేక వసతిని కల్పిస్తారు. పగలు వస్తూపోతూ ఉండొచ్చు కాని రాత్రి పూట మాత్రం హౌస్‌లో ఉండేందుకు అనుమతించరు. యూత్‌ఫెసిలిటీ పొందుతున్న పిల్లలువాళ్ల ఆసక్తులను బట్టి పై చదువులు చదువుకోవచ్చు. లేదా కోర్సుల్లో శిక్షణ తీసుకోవచ్చు. అందుకు అయ్యే ఖర్చులను సంస్థే భరిస్తుంది. ఆడపిల్లల్ని మాత్రం వాళ్లు బాగా చదువుకుని, ఉద్యోగాల్లో స్థిరపడి, పెళ్లిళ్లు చేసుకునే వరకు విలేజ్ హౌస్‌లలోనే ఉంచుకుంటారు. "నాకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరన్న కొరతే లేదు. నేను ఎక్కడ పుట్టానో, ఇప్పుడు నా అమ్మానాన్నలెవరో నాకు అనవసరం. ఈ విలేజ్‌లో ఇంతమంది మాకోసం కనిపెట్టుకుని ఉన్నారంటే మేమెంత అదృష్టవంతులం..? మా హౌస్‌లో ఉన్న పిల్లలే నాకు బ్రదర్సు, సిస్టర్సు. ఇంతకంటే ఏం కావాలి..? విలేజ్‌లోని ఉద్యోగుల్ని కూడా 'సార్' అని పిలవం. అంకుల్, బాబాయ్, చిన్నమ్మ, పెద్దమ్మ.. అనే పిలుస్తాం..'' అంది అక్కడ ఉంటున్న ఓ ఎనిమిదేళ్ల అమ్మాయి.

సకల సౌకర్యాలు..

ప్రతి ఇంట్లో ఫ్రిజ్, టీవీ, డైనింగ్ టేబుల్, కిచెన్‌లతో పిల్లలకు కావాల్సిన సదుపాయాలన్నీ అమర్చారు. సాధారణ అనాథాశ్రమాల్లో అయితే- నిద్రపోవాలన్నా, అన్నం తినాలన్నా అందరికీ ఒకే చోట సదుపాయం ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఎవరింట్లో వాళ్లు వండుకు తింటారు. ఇంటికి అవసరమైన సరుకులు, కూరగాయలను ఎవరికి వాళ్లే తెచ్చుకుంటారు. కిరాణాకొట్టుకు వెళ్లినా, బట్టల దుకాణానికి వెళ్లినా, పుస్తకాలు కొనాల్సి వచ్చినా.. 'తల్లి'తోపాటు పిల్లలందరూ కలిసి బజారుకు వెళతారు. అందుకు అయ్యే బిల్లులను సంస్థ చెల్లిస్తుంది. "ఈ ఇల్లు మాది అన్న భావన పిల్లల్లో కలగాలి. వాళ్లకు ఏం కావాలో కొనుక్కునే స్వేచ్ఛ ఉండాలి. అప్పుడే బయటి సమాజంతో సహజంగా కలిసిపోయే మనస్తత్వం అలవడుతుంది. ఆత్మవిశ్వాసం చిగురిస్తుంది..'' అన్నారు విలేజ్ డైరెక్టర్ కె.నటరాజన్. పండుగలు వచ్చినప్పుడు కూడా ఎవరికి నచ్చిన వంటలు వారు చేసుకుంటారు. కుల, మతాల భేదాలుండవు. ఏం చేసినా పిల్లల మనసెరిగే చేయాలి. "మా హౌస్‌లో ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకుంటాం.

పండగలప్పుడే కాదు. మిగిలిన రోజుల్లో కూడా పిల్లలు తమకు ఏం కావాలన్నా పోట్లాడి మరీ చేయించుకుంటారు..!'' అని చెప్పారు తల్లులు. ఇక్కడ చేరిన పిల్లలకు పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా చేస్తారు. చిన్న పిల్లలకైతే బాసర తీసుకెళ్లి అక్షరాభ్యాసం చేయిస్తారు. "అక్కడ గోడ మీదున్న నా కూతురు ఫోటోను చూడండి. దాని పేరు సాయిప్రియ. చిట్టిది ఎంత ముద్దొస్తోందో చూడండి. అది ఇక్కడికి వచ్చినప్పుడు రెండ్రోజుల పసిపాప. ఎక్కడో ఆస్పత్రిలో దొరికిందట పాపం. పోలీసులు తీసుకొచ్చి మాకు అప్పగించారు. పేరు కూడా నేనే పెట్టాను. పదకొండు రోజులకు బారసాల చేశాం. తల్లులందరం బాసరకు తీసుకెళ్లి అక్షరాభ్యాసం చేయించాం. ఇప్పుడు ఆ పిల్ల రెండో తరగతి చదువుతోంది..'' అంటూ మురిపెంగా చెప్పుకొచ్చారు మదర్ ఉషారాణి. పిల్లలు తమ రక్తం పంచుకు పుట్టకపోయినా.. సొంతపిల్లల కంటే ఎక్కువగా చూసుకునే తల్లులు ఉన్నారిక్కడ. "స్వచ్ఛమైన ప్రేమను పంచే మదర్స్ లేకపోతే ఈ విలేజెస్సే ఉండవు'' అని చెప్పిన హెర్మన్ లక్ష్యం నెరవేరింది.


విలేజ్‌కు అమ్మలే దిక్కు...
'చిట్టీ హోంవర్క్ పూర్తయిందా?', 'చిన్నోడా స్నాక్స్ తీసుకున్నావా?', 'స్నానం చేసిరా తల్లీ కూర్చుందాం. లెక్కల్లో డౌట్స్ అన్నావుగా' 'పరీక్షలు పూర్తయ్యాక పిక్‌నిక్ పెట్టుకుందాం'.. చ్రిల్డన్స్ విలేజ్‌లోని ఇళ్లలో ఇలాంటి మందలింపులు, బుజ్జగింపులే కనిపిస్తాయి. అప్పుడప్పుడు మన ఇళ్లలో విధించే చిన్నపాటి దండనలూ కనిపిస్తాయక్కడ. ఏం చేసినా పిల్లల బాగు కోసమేనంటారు తల్లులు. పిల్లల తిండితిప్పల దగ్గర్నుంచి చదువుసంధ్యల వరకు అంతా తల్లులదే బాధ్యత. అందుకే తల్లుల ఎంపికకు ఎస్ఒఎస్ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంది. మదర్ కావాలనుకునే వారు పదోతరగతి పూర్తి చేసుండాలి. భర్త చనిపోయి పిల్లలు లేని మహిళలను మాత్రమే అర్హులుగా పరిగణిస్తుంది సంస్థ. ఎలాంటి బాదరబందీలు లేని మహిళలే పిల్లలను బాగా చూసుకుంటారని ఈ నిబంధనలను పెట్టారు. "రిలేషన్‌షిప్ అనే మాటకు అర్థం తల్లి నుంచే బిడ్డలకు తెలుస్తుంది.



మహిళలందరూ మాతృప్రేమ అందించగలరు. అందుకే మా పిల్లల సంరక్షణ కోసం అలాంటి తల్లులనే తీసుకుంటున్నాం..'' అని చెప్పారు అసిస్టెంట్ విలేజ్ డైరెక్టర్ విజయశ్రీ. ఎంపికైన తల్లులకు ఢిల్లీలోని 'మదర్స్ ట్రైనింగ్ స్కూల్'లో ప్రాక్టికల్, థియరిటికల్ శిక్షణ ఇస్తారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్, చైల్డ్‌కేర్, రిలేషన్‌షిప్స్, హెల్త్, న్యూట్రీషన్, హ్యూమన్ సైకాలజీ వంటి అంశాల మీద లోతైన అవగాహన కల్పిస్తారు నిపుణులు. ఇక్కడి నుంచి వెళ్లే మహిళలకు భాషా సమస్య తలెత్తితే, అనువాదకులను ఏర్పాటు చేస్తారు. చ్రిల్డన్ విలేజ్‌కు భిన్న మనస్తత్వాలు కలిగిన పిల్లలు వస్తారు కాబట్టి.. వాళ్లను అర్థం చేసుకునేందుకు ఈ శిక్షణ తోడ్పడుతుంది. శిక్షణ పూర్తయ్యాక మదర్స్‌గా ఉద్యోగం ఇస్తారు. రెండేళ్లకు పూర్తిస్థాయి వేతనం అందుతుంది. ఉచిత భోజన, వైద్య సదుపాయాలతోపాటు పింఛను సౌకర్యం కూడా కల్పిస్తారు. అరవై ఏళ్లు పూర్తయి రిటైర్ అయ్యే వరకు మదర్స్ యోగక్షేమాలన్నీ కూడా సంస్థే చూసుకుంటుంది. తమ ఇంటిని, పిల్లలను చక్కగా చూసుకునే తల్లులను ఎస్ఒఎస్ ప్రెసిడెంట్ బంగారపు ఉంగరంతో సన్మానిస్తారు.

పిల్లల్ని ఎలా తీసుకుంటారు..?

ఒకప్పుడు మరీ పసి పిల్లల్ని, ఒక పేరెంట్ ఉన్న పిల్లల్ని తీసుకునేవారు కాని కొత్త నిబంధనల ప్రకారం.. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లలను మాత్రమే తీసుకుంటున్నారు. అయిదు నుంచి పదేళ్ల దేళ్లలోపు వయసున్న పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా జిల్లాల స్త్రీ, శిశు సంక్షేమశాఖకు చెందిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీల నుంచి ఆమోదపత్రం తీసుకోవాలి. తల్లిదండ్రులు మరణించినట్లు ధృవీకరణ పత్రాలు, పిల్లల బర్త్ సర్టిఫికెట్టు ఉండాలి. దత్తత నిబంధనలకు లోబడే పిల్లలకు విలేజ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఒక్కసారి తీసుకున్నాక పిల్లలకు అన్నీతానై నిలుస్తుంది ఎస్ఒఎస్. చ్రిల్డన్ విలేజ్‌తోనే ఆగకుండా గ్రామాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు కూడా మార్గదర్శిగా నిలవాలనుకుంటున్నారు వాళ్లు.


ఫ్యామిలీ స్ట్రెంతెనింగ్ ప్రోగ్రామ్ (ఎఫ్ఎస్‌పి) పేరుతో విలేజ్ చుట్టుపక్కల గ్రామాల్లోని తల్లిదండ్రుల సంరక్షణ కోల్పోతున్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు సంస్థ ప్రతినిధులు. కొందరికి ఆర్థిక చేయూతను అందించి కొత్త జీవితాన్ని కూడా ప్రసాదించారు. ఈ పనులన్నిటికీ కార్పొరేట్ సంస్థలు తలా ఒక చేయి వేస్తున్నాయి. చ్రిల్డన్స్ విలేజ్‌లు నడిపేందుకు మాత్రం యూరోపియన్ దేశాల దాతలే ఎక్కువ సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశాలను ఆర్థికమాంద్యం పీడిస్తుండటంతో.. దాతలు చేసే సాయంపైనా ఆ ప్రభావం పడింది. ఈ విలేజ్‌లలో చదువుకున్న ఎంతోమంది పిల్లలు ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. విమానాలను నడిపే ఫైలెట్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, సీఈవోలు, ఫ్యాషన్ డిజైనర్లు అయ్యారు.



ఇదొక భాగ్యం..
మాది విశాఖలోని భీమిలి. అప్పట్లో వరదలొచ్చి మా జీవితాలన్నీ ఛిద్రమయ్యాయి. ఏం చేయాలో దిక్కుతోచని సమయంలో మదర్స్ కావాలంటూ పత్రికలో వచ్చిన ప్రకటన చూశాను. అప్లికేషన్ పెట్టాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక ఢిల్లీలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ రెండేళ్లు అసిస్టెంట్ మదర్‌గా పనిచే శాక ఇప్పుడు మదర్‌గా పదోన్నతి పొందాను. నేను పెళ్లి చేసుకోలేదు కనక పిల్లల ఆలనాపాలన చూసే భాగ్యం లేదనుకున్నాను. ఇక్కడికొచ్చాక ఆ ముచ్చట తీరింది. మా హౌస్‌లో పన్నెండుమంది పిల్లలున్నారు. వాళ్లందరూ బాగా చదువుకుంటున్నారు. 'అమ్మా నేను పాసయ్యాను. నూటికి తొంభై అయిదు మార్కులొచ్చాయి' అంటూ చెబుతుంటే చాలా సంతృప్తిగా ఉంటోంది.
- ఉషారాణి, మదర్




అస్తిత్వాన్ని కాపాడతాం..
పిల్లలు మా విలేజ్‌లో చేరాక.. వాళ్ల పేర్లు, కులం, మతం.. ఇలాంటివేవీ మార్చము. పిల్లల అస్తిత్వానికి ఏ మాత్రం భంగం కలిగించము. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేటప్పుడు కూడా తల్లిదండ్రుల పేర్లే నమోదు చేయిస్తాం. ఇవన్నీ చిన్న విషయాలే అనుకుంటాం కాని పిల్లలకు తమ మీద తమకు విశ్వాసాన్ని కలుగజేస్తాయవి. పండుగలు, పుట్టినరోజుల నాడు చాలామంది అనా«థాశ్రమాలకు వచ్చి.. మిఠాయిలు పంచిపెట్టడం, భోజనాలు అందివ్వడం చేస్తుంటారు. ఇలా బయటి నుంచి వచ్చే పదార్థాలను మేము ప్రోత్సహించం. ఎందుకంటే, సమాజం సానుభూతి మీద బతుకుతున్నామన్న విషయం పదే పదే గుర్తుకొస్తే.. వాళ్లలో న్యూనతాభావం కలిగే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రతికూల ఆలోచనలను తొలగించి.. స్ఫూర్తిని రగిలించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటాం. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు ఎంతో మంది ప్రముఖులు మా విలేజ్‌కు వచ్చి పిల్లల్ని ప్రోత్సహిస్తుంటారు.
- కె.నటరాజన్, డైరెక్టర్,
విజయశ్రీ, అసిస్టెంట్ విలేజ్ డైరెక్టర్


ఆ పిలుపే ఒక బంధం
- సత్యవతి, మదర్
ఈ పిల్లలు ఏ తల్లిదండ్రులకు పుట్టారో.. ఏ ఊరో తెలియదు. అయినా నోరు తెరిచి 'అమ్మా' అంటుంటే ఆ పిలుపుతోనే బంధం అల్లుకుంది. నేను పుట్టి పెరిగిన ఇంట్లో కూడా ఇంత అనుబంధాన్ని చూడలేదు. పిల్లలందరూ మా చేతుల్లోనే పెరిగి పెద్ద చదువులకు వెళుతుంటే అదొక వరంగా భావిస్తున్నాం. వాళ్లకు ఏమీ తక్కువ కాకుండా అన్ని సదుపాయాలను కల్పించింది సంస్థ. అర్థరాత్రయినా అపరాత్రయినా ఏ కష్టమొచ్చినా అమ్మలం మేమున్నాం. వాళ్లు ఆడుతూపాడుతూ చదువుకుంటే చాలు. మిగిలినవన్నీ మేము చూసుకుంటాం. దిక్కులేని పిల్లలన్న ఆలోచనే రాదు. ఇది అంతర్జాతీయ స్వచ్ఛందసంస్థ. అన్ని దేశాలలో వేలమంది పిల్లలు ఈ విలేజ్‌లలో ఉంటున్నారు. వాళ్లంతా వీరికి బంధువులేనని చెబుతుంటాను. మా హౌస్‌లో పెద్దమ్మాయి విష్ణుప్రియ డిగ్రీ చదువుతోంది. మిగిలిన పిల్లలు పాఠశాల చదువు చదువుతున్నారు.

- * మల్లెంపూటి ఆదినారాయణ

Thursday, January 19, 2012

జీవితంలో ఎత్తుపల్లాలు... - గెలుపు పాఠాలు

వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం ద్వారా విజయాలు సాధించవచ్చని వేణు.జి. సోమినేని 'వన్ బుక్ ఫర్ లైఫ్ సక్సెస్' పుస్తకం ద్వారా చెబుతున్నారు. వ్యక్తిత్వ వికాస రచనల్లో ఈ పుస్తకం మంచిగుర్తింపు పొందింది. దాన్లోని కొన్ని భాగాలు ...
http://chennaionline.com/images/articles/July2010/c8b65112-ce20-4523-8f86-3c3d1eed855bOtherImage.jpg

దురదృష్టవశాత్తు, చాలా కొద్దిమంది మాత్రమే తమ గురించి తాము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక దశాబ్ద కాలంగా చాలామందిని ఈ ప్రశ్న అడుగుతూ వచ్చా "మీ గురించి మీకు ఏం తెలుసు'' అని. ఆశ్చర్యకరంగా ఎవరూ వెంటనే జవాబు చెప్పలేదు. "ఇది చాలా మంచి ప్రశ్న. ఆలోచిస్తాను'' అని అన్నవాళ్లే ఎక్కువమంది.


మిమ్మల్ని మీరు ఈ కింది ప్రశ్నలు అడిగి చూసుకోండి...
- నేను ఎవరు?
- నా జీవితానికి అర్థం ఏమిటి?
- జీవితాన్ని ఎక్కడ ప్రారంభించాను?
- ఇప్పుడెక్కడ ఉన్నాను?
- నా జీవితానికి స్ఫూర్తినిచ్చేదేమిటి?
- నేను చేస్తున్న పనితో సంతృప్తి చెందుతున్నానా?
- నా సామాజిక సంబంధాలతో సంతోషంగా ఉన్నానా?
- నేను ఎటువైపు వెళుతున్నాను?
- నా అసలైన బలం ఏమిటి?
- నాకు ఇష్టమైన పని ఏమిటి?
- నేను సాధించాలనుకుంటున్నది ఏమిటి?
- నన్ను ఆనందంగా ఉంచే విషయం ఏమిటి?


ఇలా మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఇతరులు మీపై ప్రభావం చూపలేరు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ప్రతీ క్షణాన్నీ ఆనందమయం చేసుకోండి.















ప్రముఖుల బాల్యం -అపజయాలు
బాల్యంలో సాదాసీదా చదువులతో నెట్టుకొచ్చిన కొందరు ప్రముఖులు వీరు. ర్యాంకులు, గ్రేడులతో సంబంధం లేకుండా జీవితంలో తిరుగులేని విజేతలుగా నిలిచారు.


థామస్ ఎడిసన్
http://images.wikia.com/assassinscreed/images/e/e2/ThomasEdison1.png
 ఎడిసన్ తన టీచరుతో' శుద్ధమొద్దు'గా ముద్ర వేయించుకున్నాడు. తెలివి పెద్దగా అవసరం లేని రంగంలోకి వెళ్లమని కూడా ఆయనే సలహా ఇచ్చాడు. అయినా ఎడిసన్ ఎల క్ట్రిక్ బల్బు కనుగొన్నాడు. దానికోసం 9000 ప్రయోగాలు చేశాడు. అతను ఐదు ప్రయత్నాల తర్వాత గాని, 500 ప్రయత్నాల తర్వాత గాని విరమించుకుని ఉంటే మనం ఇప్పటికీ లాంతర్ల, కొవ్వొత్తుల వెలుగుల్లోనే చదువుకుంటూ ఉండేవాళ్లం. ఎడిసన్ కనిపెట్టిన విషయాలే 20 వ శతాబ్దాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లాయి. 1, 093 వస్తువులపై ఆయనకు పేటెంట్ హక్కు ఉందంటే అదేం చిన్న విషయమా!.

స్టీఫెన్ స్పీల్‌బర్గ్
http://www-deadline-com.vimg.net/wp-content/uploads/2011/01/steven-spielberg.jpg
సరిగా చదవలేక స్పీల్‌బర్గ్ ఎన్నోసార్లు స్కూలు మానేయాల్సి వచ్చింది. చివరకు సినిమా స్కూల్‌లో కూడా చేరడానికి ఆయన చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతని తక్కువ మార్కులే గ్రేడ్ అందులో చేరడానికి ఆటంకం అయింది. అలాంటి స్పీల్‌బర్గ్ తరువాత కాలంలో ప్రముఖ హాలీవుడ్ దర్శకునిగా పేరుపొందాడు. మూడు ఆస్కార్ అవార్డులను అందుకోవడమే కాకుండా హాలీవుడ్ చరిత్రలో తిరుగులేని దర్శకునిగా నిలిచిపోయాడు.


ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
http://amazingnotes.com/wp-content/uploads/2011/05/strange-albert-einstein.jpg
నాలుగు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు ఐన్‌స్టీన్‌కు మాటలు రాలేదు. ఏడు సంవత్సరాల వయసు వచ్చేవరకు చదవలేకపోయాడు. ప్రాథమిక స్కూలు స్థాయిలో ఐన్‌స్టీన్‌ను ఒక మానసిక వికలాంగునిగా చూసేవారు. ఉపాధ్యాయులు ఏదైనా అడిగితే తనలో తాను కూడబలుక్కొని ఆ తరువాత బయటకు చెప్పేవాడు. దాంతో ఉపాధ్యాయులు ఈ విద్యార్థి జీవితంలో ఎందుకూ పనికిరాడని అన్నారు. అలాంటి ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొని నోబెల్ బుహుమతి అందుకున్నాడు.


జీవితంలో ఎత్తుపల్లాలు...
http://paradigms4progress.files.wordpress.com/2008/06/freedom.jpg
జీవితం ఎత్తుపల్లాలమయం. రాత్రి, పగలు, వేసవి, చలికాలంలా అవి ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఒక అవరోహణ తర్వాత ఒక ఆరోహణ తప్పకుండా ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. పైకెళ్లాక కూడా ఆ స్థాయిని నిలబెట్టుకునేందుకు చాలా కృషి చేయాల్సి వుంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా క్షణాల్లో కిందికి పడిపోతారు.


ఎదగడానికి దగ్గరి దారి లేదు. ఏ కష్టమూ అనుభవించకుండా ఒకేసారి పైకి వెళ్లడం అసాధ్యం. అందుకే -" నీకు చేదు గురించి తెలియకపోతే తీపిని ఆస్వాదించలేవు.'' అని చెపుతుంది ఒక పాత సామెత. నిన్ను కష్టాల్లోకి తోసిన ప్రతి సందర్భమూ నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక అవకాశంగా భావించాలి. చాలెంజ్‌లను ఎదుర్కోకుండా పరిణతిని సాధించలేం. ఎంత పెద్ద కష్టాన్ని నువ్వు అధిగమించగలిగితే అంత పటిష్టంగా తయారవుతావు.


విజేతగా నిలవాలంటే - సంక్లిష్టసమస్యల్ని పట్టుదలగా పరిష్కరించుకుంటూ, అదే సమయంలో మరిన్ని చాలెంజ్‌లను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సమస్యలు ఒక వేళ నిన్ను కిందికి పడదోసినా నువ్వు దిగులుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించిన అనుభవం సంపాదించుకున్నావు కనక.


జీవితంలో గెలిచిన వారు తమ గొప్ప క్షణాలను అపజయాలు పాలైనప్పుడే అనుభూతి చెంది ఉంటారు. సమస్యలను పరిష్కరించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు చెప్పలేనంత ఉత్తేజాన్ని పొంది ఉంటారు. నిజానికి పరాజయంలో ఉన్నప్పుడే ఎవరైనా ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతారు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ మీముందు ఉంచుతాను.


హ్యారీపోటర్ రచయిత్రి జె.కె.రోలింగ్
http://www.edinburgh-inspiringcapital.com/images/jk_rowling_holds_up_deathly_hallows_book_v_300px-wide.jpg
పుస్తక వ్యాపారంలో 'హ్యారీపోటర్' సిరీస్ పెను సంచలనం. అది కోటానుకోట్ల వ్యాపారాన్ని సృష్టించింది. అలాంటి 'హ్యారీపోటర్' సృష్టికర్త, రచయిత్రి జె.కె. రోలింగ్ ప్రాథమిక దశలో ఎన్ని కష్టాలు అధిగమించారో తెలుసుకోవడానికి ఇది చదవండి.


ఇంగ్లాడులోని గ్లౌసెస్టర్‌షైర్‌లోని చిప్పింగ్ సాడ్‌బరీలో రోలింగ్ పుట్టారు. పోర్చుగల్‌కు చెందిన ఒక జర్నలిస్టును ఆమె వివాహమాడారు. వారికి 1993లో ఒక పాప పుట్టింది. కూతురు పుట్టిన కొన్నాళ్లకే భర్తతో విడాకులు తీసుకున్న రోలింగ్ పాపతో సహా స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు చేరుకున్నారు. అప్పుడే హ్యారీపోటర్ రాయడానికి రోలింగ్ సిద్ధపడ్డారు. ఈ సమయం ఆమె జీవితంలో ఎంతో భయానకమైనది.


హ్యారీపోటర్ నవల రాయడానికే కాదు, దాన్ని పబ్లిష్ చేయడానికీ రోలింగ్ ఎన్నో అవరోధాలు అధిగమించాల్సి వచ్చింది. తన కూతురితో కలిసి రెస్టారెంట్‌లో కూర్చుని రాసేవారు. అక్కడైతే చలిలేకుండా వెచ్చగా ఉంటుందని. నవల పూర్తి చేయడానికి స్కాటిష్ ఆర్ట్స్ కౌన్సిల్ వారి ఆర్థిక సహాయం తీసుకున్నారు. అయినా రోలింగ్ కష్టాలు కొలిక్కి రాలేదు. నవలను కొనడానికి ఏ పబ్లిషింగ్ సంస్థా ముందుకు రాలేదు.


చివరకు ఎన్నో తిరస్కరణల తర్వాత యుకెకు చెందిన బ్లూమ్స్‌బరీ సంస్థ నాలుగువేల డాలర్లకు హ్యారీపోట్టర్ నవలను కొనుగోలు చేసింది. ఎంతో కష్టపడి రాసిన ఈ నవలనుఆమె మారుపేరుతో విడుదల చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యువకులు స్త్రీలు రాసిన పుస్తకాలంటే పెద్దగా ఆసక్తి చూపరని బ్లూమ్స్‌బరీ భావించింది. జె.కె రోలింగ్ అసలు పేరు జోన్‌కాథలిన్. దానిని జె.కె.గా ఉంచి జె.కె. రోలింగ్ పేరుతో విడుదల చేశారు.


ఆపై హ్యారీపోటర్ సిరీస్ సృష్టించిన సంచలనం తెలిసిందే. పుస్తకాలు రాయడం ద్వారా బిలియనీర్‌గా మారిన తొలి వ్యక్తి జె.కె. రోలింగ్ అని ఫోర్బ్స్ పేర్కొంది. హార్వర్డ్ అల్యుమిని అసోషియేషన్ నిర్వహించిన వార్షికోత్సవ సభలో జె.కె రోలింగ్ తన విజయాల గురించి మాట్లాడుతూ "ఇదంతా అపజయం నుంచి పొందిన లాభమే'' అన్నారు.
http://ecx.images-amazon.com/images/I/51GiQxbGd%2BL._SL500_AA300_.jpg
 - వన్ బుక్ ఫర్ లైఫ్ సక్సెస్
రచయిత: వేణు.జి. సోమినేని
పేజీలు: 188
ధర: 475