సమస్యను అధిగమించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయితే భయం ఉండదు. ఆ సంసిద్ధత రావడానికి మనసంతా ఆ సమస్య మీదే లగ్నం కావాలి. కానీ, చాలా సార్లు అలా జరగదు. మనసు అలా లగ్నం కాలేకపోవడానికి సమస్య నుంచి పారిపోవాలనుకోవడమే కారణం. అలా అనుకోకపోతే అసలు భయమే ఉండదు.సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటే పరిష్కారం ఆ సమస్యలోంచే పుట్టుకొస్తుంది. ఎందువల్ల అంటే పరిష్కారం అనేది సమస్యకు వేరేమీ కాదు.
* నీలో ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచoలోకి వెళ్లే తాళం చెవి కూడా నీ చేతిలోనే ఉంది. నిజానికి నీలో ఉన్న ఆ ప్రపంచపు ద్వారాన్ని నువ్వు తప్ప మరెవరూ తెరవలేరు. * ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నోట జాలువారిన సత్యాల్లో మచ్చుకు కొన్ని. జీవితంలోని ప్రతి సంఘటన గురించి, ప్రతి సమస్య గురించి అంత లోతుగా విశ్లేషించిన వ్యక్తి బహుశా మరొకరు ఉండరు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో (మే12, 1895) జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. ఆయన చిన్నతనంలోనే ఆయన తలిదండ్రులు కడపకు వలస వెళ్లారు. కృష్ణమూర్తి పదేళ్ల వయసులో ఉన్నప్పుడే అతని తల్లి చనిపోయింది. తరువాత వారి మకాం కడప నుంచి మద్రాసుకు మారింది. అక్కడున్న కాలంలోనే కృష్ణమూర్తి థియోసాఫికల్ సొసైటీ నిర్వాహకులైన అనీబిసెంట్ దృష్టిలో పడ్డాడు. అప్పటికి ఆమె ఆ సొసైటీకి సంబంధించి ప్రపంచ గురువు అయ్యే యోగ్యతలు ఉన్న వ్యక్తి కోసం గాలిస్తోంది. ఆ లక్షణాలు ఆయనలో కనిపించాయి. అందుకే కృష్ణమూర్తి తండ్రిని ఒప్పించి ఆ గురుస్థానానికి కృష్ణమూర్తిని ఎంపిక చేసింది.
విషాదం నుంచి అంతర్మథన థియోసాఫికల్ సొసైటీలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే కృష్ణమూర్తి అమితంగా ప్రేమించే తన తమ్ముడు క్షయవ్యాధితో మరణించాడు. అతని మరణం కృష్ణమూర్తిని తీవ్రమైన అంతర్మధనానికి గురిచేసింది. అది అతని ఆలోచనలను రగిల్చింది. అప్పటి నుంచి జీవిత వాస్తవాలనూ, జీవిత సత్యాలనూ అత్యంత నిశితంగా పరిశీలించడం మొదలయ్యింది. ఆ క్రమంలో గురుత్వం అనే భావనే సరికాదనిపించింది. ప్రపంచ గురువుగా తనను ప్రతిష్టించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ అర్థం లేనివనిపించింది.
సత్యాల్ని ఎవరికి వారు తెలుసుకోవలసిందే. తనకు తెలిసిన సత్యాలను ఎవరైనా ఇతరులతో పంచుకోవలసిందే. అంతే గానీ, ఎవరో గురుస్థానంలో ఉండిపోతే మిగతా వారంతా అతని శిష్యులై అతని చెప్పినవన్నీ వినుకుంటూ పోవడం సరికాదనిపించింది. అందుకే కృష్ణమూర్తి తాను కేంద్రంగా ఉన్న థియోసాఫికల్ సొసైటీని, దాని అనుబంధ సంస్థలన్నిటినీ రద్ధుచేశాడు. ఆ సొసైటీ కి విరాళంగా లభించిన 5 వేల ఎకరాల భూమిని ఆ దాతలకే తిరిగి ఇచ్చేశాడు. ఆ తరువాత వివిధ అంశాల మీద చర్చిస్తూ, ప్రపంచ దేశాలన్నీ పర్యటించడానికే తన జీవితాన్ని వెచ్చించాడు. జీవితంలోని దాదాపు ప్రతి అంశం మీదా మనోవిజ్ఞాన వేత్తలు, తత్వవేత్తలు, విద్యావేత్తలతో సమావేశమై సుదీర్ఘంగా చ ర్చించేవాడు.
మానవ జీవితంలోని వైరుధ్యాలు, ఘర్షణలు, దుఃఖం, అశాంతి, ఒంటరి తనం, అసంతృప్తి వంటి పలు విషయాల మీద ఆయన తన భావాలను వ్యక్తం చేశాడు. ఆయన చర్చించిన వాటిలో 'ఒంటరితనం' అనే విషయానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. "అణచివేయడం ద్వారానో, నిర్లక్ష్యం చేయడం ద్వారానో ఒంటరితనం ఎప్పుడూ తొలగిపోదు. కిక్కిరిసిన జనసమూహంలో ఉన్నా మనసులో అనుబంధం లేకపోతే నువ్వు ఒంటరితనాన్నే చవిచూస్తావు. మద్యమో మరో వినోదమో ఒంటరితనం నుంచి విముక్తి చేయలేవు. ఆ సమయంలో తాత్కాలికంగా పక్కకు వెళ్లినా ఆ తరువాత ఒంటరితనం మళ్లీ వచ్చి గుండెల మీద వాలిపోతుంది'' అంటాడు.
కృత్రిమ ప్రయత్నాల ద్వారా తాత్కాలిక ఉపశమనమే తప్ప ఒంటరి తనం నుంచి పూర్తిగా బయటపడలేవు అంటారాయన. ఎవరైనా నేరుగా ఒంటరితనపు గుహలోకే ప్రవేశించి నలుమూలలా నిశితంగా పరిశీలిస్తే గాని, ఒంటరిత నపు అసలు కారణాలు బోధపడవు అంటూ... "నిజానికి మన చర్యలన్నీ మనల్ని సంకుచిత పరిచేవిగానే ఉన్నాయి. మన ఆలోచనలు, మన లక్ష్యాలు పైకి ఎంత విశాలంగా కనిపించినా వాటిలో మనుషులు పరస్పరం విడిపోవడానికి దోహదం చేసేవే ఎక్కువ. ప్రతి ఒక్కరూ మరొకరిపై ఆధిపత్యాన్నే ఆశిస్తున్నారు.
ప్రతి పనినీ నీది-నాది అంటూ వేరువేరుగానే చూస్తున్నారు. సంఘాల పేరుతోనో, మతాల పేరుతోనో, దేశం పేరుతోనో అంతా విడివిడిగానే ఉంటున్నారు. మొత్తంగా మన వ్యవహార సరళి అంతా మనం విడిపోవడానికే దారి తీస్తోంది. క్రమంగా ఒక దశలో ఏ చర్యాలేని ఒంటరితనానికి చేరుకుంటాం. మనసులో ఒక శూన్యం ఏర్పడుతుంది. అయితే ఆ శూన్యాన్ని మనం భరించలేం. అందుకే వెంటనే ఆ శూన్యాన్ని పూరించాలని చూస్తాం. ఉన్నతంగానో, హీనంగానో ఎలాగోలా ఆ శూన్యాన్ని, ఆ ఖాళీని పూరించడానికి మన జీవితాన్నే వెచ్చిస్తాం.''అంటాడు.
'' ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి కొన్నిసార్లు మనం ప్రేమ అన్న పదం మాటున తలదాచుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ, ప్రేమ, ఒంటరితనం ఈ రెండూ ఒకేచోట ఇమడలేవు. నువ్వు ప్రేమించే వ్యక్తి కోసం, నువ్వు అనుకున్న లక్ష్యం కోసమో నువ్వు అంకితం కావచ్చు. అయినా ఒక కటిక చీకటిలా ఒంటరితనం నిన్ను ఆవహించే ఉంటుంది. నువ్వు ప్రేమించినా, కడకు ద్వేషించినా ఒంటరితనం నిన్ను వెన్నంటే ఉంటుంది. కాకపోతే నీకు కొంచెం దూరంలో నీ కోసం ఎదురుచూస్తూ అనుక్షణం నిన్నే గమనిస్తూ కొద్ది క్షణాల పాటు కాస్త వెనక్కి జరిగి ఉండిపోతుంది. అయితే అదంతా మళ్లీ నిన్ను ఆవహించడానికే.'' అంటాడాయన.
అభద్రతా భావం మౌలికంగా ఒంటరితనంలో ఒక అభద్రతా భావం ఉంటుంది. అభద్రతా భావంతో మొదలైన చర్యలు పైకి ఎంత ఉదాత్తత కనిపించినా అవన్నీ మనసులోని సంకుచితత్వానికి కవచాలు మాత్రమే అంటాడు కృష్ణమూర్తి. తనకు తానే అందరికీ దూరమైపోయి కొందరు ఇతరులే తనను దూరంగా తరిమేశారు అనుకుంటారు. తనకెవరో ముప్పు తలపెట్టినట్లు భావించి ఏవో ఆత్మరక్షణా ప్రయత్నాలు మొదలెడతారు. ఇవన్నీ ఒంటరి తనపు భయాన్ని రెట్టింపు చేస్తాయంటారాయన. " శూన్యం నుంచి, అసంపూర్ణత నుంచి, ఒంటరితనం నుంచి పారిపోవాలని చూసే వ్యక్తి నిజనికి వాటికి వేరేమీ కాదు. శూన్యం, అంసపూర్ణత, ఒంటరితనం ఇవన్నీ అతని ఆలోచనల్లోంచి వచ్చినవే.
ఒంటరితనం నుంచి పారిపోవాలనే ఆలోచలన్నిటికీ మూలాలు అక్కడే ఉన్నాయి. దానికి ఎవరూ తమ నుంచి తాము పారిపోలేరు. తమను, తమ ఒంటరి తనాన్ని అర్థం చేసుకోవడం ఒక్కటే ఎవరైనా చేయగలిగేది. అలా కాకుండా వాటిని తనకు వేరుగా భావించినంత కాలం అతడు ఆ ఒంటరితనం నుంచి బయటపడలేడు. అందుకే తానే తన ఒంటరితనమని, తన ఆలోచనా ధోరణే తన ఒంటరితనానికి అసలు కారణమని గ్రహించినప్పుడే ఆ ఒంటరితనం నుంచి సంపూర్ణంగా బయటపడతాడు అంటాడు కృష్ణమూర్తి. తెలుగునేలపై జన్మించి, అంతర్జాతీయ తత్త్త్వవేత్తలలో ఒకరిగా, వారికి సైతం ఆరాధనీయుడుగా ఎదిగిన కృష్ణమూర్తి ఒక కొత్త ఆలోచనా స్రవంతికి మార్గం చూపిన మహనీయుడు.
thank you ......
ReplyDeletenice article
ReplyDeleteNice
ReplyDelete
ReplyDeleteGood message but whom it is implemented they are identified