బుద్ధుని జీవితం ఒక సాధనా సోపానం. ఆయన తత్త్వం జీవితాన్ని పరిపూర్ణం చేసే అమృతం. తనకు సర్వసుఖాలూ ఉన్నా, ప్రపంచపు దుఃఖాన్ని తొలగించాలన్న తీవ్ర తపన సిదార్థునికి కునుకుపట్టనీయలేదు. భార్య అనురాగం గానీ, తన వారి పట్ల మమత గానీ, ఆయనను ఆపలేకపోయాయి. ఇల్లు విడిచి న డకసాగించాడు. వారాలు, నెలలు గడిచాయి. తిండి లేక, నిద్రలేక నీరసించాడు. అడుగులు తడబడుతుండగా ఒక చెట్టుకిందకు చేరి చతికిలపడ్డాడు. కళ్లు మూతపడ్డాయి. 'ఉరువేల' ఆ ప్రాంతం పేరు. అక్కడికి సమీపంలో ఒక గృహస్తు ఉండేవాడు. అతని పేరు సేనాని. సుజాత అతని కుమార్తె. తన కడుపు పండి, తన ఇంట వెలుగునిండితే రావిచెట్టుకు, నాగదేవత పుట్టకు మొక్కుచెల్లిస్తానని మనసారా ప్రార్థించింది. ఆమె ప్రార్థించినట్లే జరిగింది. మొక్కుతీర్చుకొనేందుకు సిద్ధమైంది సుజాత.
తన సేవకురాలైన పున్నను అడవిలోని మర్రిచెట్టు వద్ద శుభ్రపరచి రమ్మని పంపింది. పున్న అక్కడ శుభ్రం చేసి వచ్చిన వెంటనే సుజాత ఒంటరిగా అడవికి బయలుదేరింది. పుట్ట ఎదుట పాలునిండిన పసిడి గిన్నెను, పాయసం ఉన్న వెండి గిన్నెను ఉంచి భక్తిశ్రద్ధలతో నమస్కరించింది. పుట్టలోని సర్పం బయటకు వచ్చి సుజాతను ఆశీర్వదించింది. చీకటి పడుతుండడంతో ఇంటికి బయలుదేరేందుకు లేచింది సుజాత. త్వరత్వరగా అడుగులు వేస్తున్న సుజాతకు మూలుగు వినిపించింది. అట చూసిన ఆమెకు బంగారు ఛాయతో అలసి పడిన దేహం కనిపించింది. సుజాత ముంగాళ్లపై కూర్చొని అతనిని తట్టింది. అతని తలను ఒడిలో పెట్టుకుంది. అతడు బాగా అలసి స్పృహతప్పిపోయాడని గ్రహించింది. అతని నాలుక ఎండిపోయి ఉంది. దగ్గరలో నీరు లేదు. మరికాసేపు ఆలస్యం చేస్తే అతనికి ప్రాణాపాయం ఉందనిపించింది సుజాతకు.
ప్రేమనేర్పిన తల్లి
దట్టమైన చీకటి వేగంగా ప్రపంచాన్ని ఆవరిస్తున్నది. సుజాతకు ఇంటివద్ద విడిచి వచ్చిన తన నోముల పంట, బంగారుబాబు గుర్తుకు వచ్చాడు. స్పృహతప్పి ఉన్న వ్యక్తిలో తన బాబు రూపం ప్రతిఫలించినట్లయింది! చంటివాడి కోసం దాచుకున్న పాలను ఒక ఆకును దోనెగాచేసి, అందులో పట్టింది సుజాత. స్పృహతప్పి ఉన్న సిద్ధార్థ్దుడి నోటిలో ఆ పాలను పోసింది. కాసేపటికి సిద్ధార్థుడు కళ్లు తెరిచాడు. ఎదుట ఉన్న కరుణామూర్తి 'అమ్మా' అన్నాడు. ఆ తల్లి పులకించిపోయింది. ఆమె లేచినిలబడి, చేయి అందిస్తూ, లే నాయనా! అంది.
కొంచెం ఓపిక తెచ్చుకొని, నా వెంట నడువు. ఈ రాత్రికి నా ఇంట్లో విశ్రాంతి తీసుకొని, స్వస్థత చేకూరగానే నీ గమ్యం వైపు సాగిపో అన్నది. సిద్ధార్థుడు ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా! అగమ్యగోచరంగా, చుట్టూ శూన్యమే గోచరిస్తున్న నాకు, నీ మానవత్వంతో వెలుగు కనిపిస్తున్నది. నా అన్వేషణకు అర్థం స్ఫురిస్తున్నది. ఇక నీవు వెళ్లిరా అమ్మా! నా ప్రాణదాతవు నీవు. ఇదే నా ప్రణామం. అంటూ నీరు నిండిన నయనాలతో అంజలి ఘటించి నమస్కరించాడు గౌతముడు. నీకు బుద్ధత్వం సిద్ధించుగాక! అని మనసారా దీవించింది సుజాత. ఆ ప్రేమమూర్తి దీవెనలు వృధాకాలేదు. సిద్ధార్ధుడు బుద్ధుడయ్యాడు. ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు.
అమృతంగమయ
అసత్యాన్ని ఛేదించి, సత్యాన్ని కనుగొన్న వారిని, చీకటిని చీల్చి కాంతిరేకల్ని కనుగొన్న వారిని, మృత్యువును అధిగమించి అమృతత్త్వాన్ని కనుగొన్ని వారిని ఎవరూ ఏమీ చేయలేరు. అలాంటి వారిపట్ల ద్వేషభావాన్ని పెంచుకుంటే అది వారికే హానిచేస్తుంది. ఆ మహనీయుల గొప్పతనం మరింత ఇనుమడిస్తుంది. ఈ సత్యాన్ని తెలిపే బుద్ధుని జీవితంలోని ఒక సంఘటన ఇది. దేవదత్తుడు గౌతమ బుద్ధుని సమీపబంధువు. మారుటి సోదరుడు. గౌతముడంటే ముందు నుంచీ అతనికి అకారణంగా అసూయ, ద్వేషం. ఒకనాడు కొండపై నుంచి ఒక గుండును గౌతమునిపైకి దొర్లించాడు. ఆ గుండు గౌతముని మీద పడలేదు కానీ, ఆ గుండు కింద ఉన్న పాము దేవదత్తుడిని కాటు వేసింది.
దేవదత్తుడు బాధతో కేకలు వేశాడు. గౌతముడు తన అంగవస్త్రాన్ని చించి, దేవదత్తునికి పాము కరచిన చోట, విషం పైకి ఎగబాక కుండా గట్టిగా కట్టు కట్టాడు. నోటితో విషాన్ని పీల్చి పక్కకు ఉమ్మేశాడు. దేవదత్తునికి ప్రాణభిక్షపెట్టాడు. అతడిని ఇంటికి చేర్చాల్సిందిగా పరిచారకులకు చెప్పాడు. అయినా దేవదత్తుడికి బుద్ధిరాలేదు. రాకుమారుడైన అజాతశత్రువును ఆశ్రయించి, సహాయాన్ని కోరాడు. అజాతశత్రువు అతనికి కొంత పరివారాన్ని ఇచ్చాడు. వారిలో ఒకరిని దేవదత్తుడు ఉసిగొల్పాడు.
బుద్ధుడిని చంపాల్సిందిగా ఆయనపైకి పంపాడు. వాడు ఏకాంతంగా, మౌనంగా, ప్రశాంత వదనంతో కూర్చున్న బుద్ధుడిని సమీపించాడు. ఆయన శరీరం నుంచి వెలువడుతున్న శక్తివంతమైన ప్రేమ తరంగాలు అతనిలో పరివర్తనను కలిగించాయి. ఏమీ చేయలేక వాడు వెనక్కు తిరిగి వచ్చాడు. దేవదత్తుడికి తన అనుభవం చెప్పాడు.
కరుణామూర్తి గౌతముడు
మరోసారి దేవదత్తుడు రాజగృహంలోనే అత్యంత క్రూరమైన నలగిరి అనే మదపుటేనుగును బుద్ధుడిపైకి తోలించాడు. ఒకవేళ మదపుటేనుగు నుంచి తప్పించుకుంటే, వెంటనే ఆయన్ను చంపేందుకు కొందరు విలుకాండ్రను నియమించాడు. బుద్ధుడు తన శిష్యులతో వెళుతున్నప్పుడు భయంకరంగా ఘీంకరించుకుంటూ అటుగా వచ్చింది మదపుటేనుగు. అందరూ పరుగులు తీశారు. కానీ బుద్ధుడు ప్రశాంత దృష్టితో ముందుకు నడిచాడు. దగ్గరకు వచ్చిన ఆ ఏనుగు మంత్ర ముగ్ధలా నిలిచిపోయింది. తనకు ఇంతకు ముందు ఒకసారి ప్రాణభిక్ష పెట్టిన మహనీయుడే ఆయన అని గుర్తించింది. ఆయనముందు మోకరిల్లింది. మావటీవాని అంకుశం పోట్ల వల్ల ఏర్పడిన గాయం నుంచి కారుతున్న రక్తాన్ని చూసి గౌతముడు చలించిపోయాడు. తన అంగవస్త్రంతో ఆ గాయాన్ని తుడిచి, కట్టుకట్టాడు బుద్ధుడు. కృతజ్ఞతా పూర్వకంగా కన్నీరు కారుస్తూ కదిలిపోయింది మత్తగజం.
ప్రేమకు ప్రతిరూపం
గౌతముడిని హత్య చేయించేందుకు దేవదత్తుడు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అతని కుటిలబుద్ధి ప్రజలందరికీ తెలిసిపోయింది. వారి నుంచి అతనికి వచ్చే ధర్మాదాయం తగ్గిపోయింది. దేవదత్తుడు చివరకు ఇంటింటికీ వెళ్లి బిచ్చమెత్తి బతకాల్సి వచ్చింది. ఆ బతుకు బతకలేక కోసల రాజు ప్రసేనజిత్తు తనను ఆదరిస్తాడనే గంపెడు ఆశతో అక్కడి వెళ్లాడు. కానీ జరిగింది తెలుసుకున్న కోసల రాజు దేవదత్తుడిని నిర్దాక్షిణ్యంగా తన రాజ్యం నుంచి గెంటి వేశాడు. సోదరుడికే అంతటి హాని తలపెట్టిన వ్యక్తిని ఆదరిస్తే ప్రజలు నవ్విపోతారని గ్రహించిన ప్రసేనజిత్తు అలా చేశాడు. మహనీయుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటే అవి రెట్టింపయి వచ్చి, మనల్ని నాశనం చేస్తాయంటారు వివేకానందులు. అందుకు దేవదత్తుని ఉదాహరణగా చెప్పకోవచ్చు. అపారమైన కరుణకు, ప్రేమ స్వభావానికి, శత్రువుకి సైతం హాని తలపెట్టని స్వభావానికి గౌతముడు ప్రతిరూపం... ఆ అద్భుత గుణాలే ఆయనను మహనీయుని చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన బోధలను ఆనుసరించేలా, ఆయనను ఆరాధించేలా చేశాయి.
- రాచమడుగు శ్రీనివాసులు
No comments:
Post a Comment