Wednesday, February 2, 2011

* మెరుస్తున్న ఆఫ్రికా వజ్రం ఘనా * '' ఘనం'' గా ఉంటుంది లైఫ్

ఆఫ్రికాలో ఇప్పుడు మెరుస్తున్న వజ్రం ఘనా. సహజ వనరులతో తులతూగుతున్న ఈ దేశం.. పెట్టుబడిదారులకు స్వర్గధామం. బంగారం, ఆయిల్, కోకో ఉత్పత్తిలో చాలా దేశాలతో పోటీపడుతోంది. ఈ దేశం సంప్రదాయాలకు ఎంత ప్రాధాన్యమిస్తుందో... స్వేచ్ఛా జీవితానికి కూడా అంతే ప్రాధాన్యమిస్తుంది. ఇక్కడి ప్రజలకు భారతీయులంటే ఎంతో గౌరవం. ఘనా రాజధాని అక్రాలో పనిచేస్తున్న చిత్తూరు జిల్లా మదనపల్లి వాసి మురళీకృష్ణ అక్కడి అనుభవాలను పంచుకున్నారు...

మనం టీవీల్లోనో, న్యూస్‌పేపర్లలోనో చూస్తే... ఆఫ్రికా దేశాల్లో నిత్యం ఏదో ఒక అలజడి జరుగుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈ దేశాల గురించి చాలామందిలో ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ, అది కరెక్ట్ కాదు. నేను నాలుగేళ్ల నుంచి ఘనా రాజధాని అక్రాలో ఐనెక్సో కంపెనీలో ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నాను.

మన దేశం కంటే ఈ దేశం ఎన్నో రెట్లు మేలు. ఎన్నికలప్పుడు తప్పిస్తే- అల్లర్లు, బందులు, ధర్నాలు అస్సలు కనిపించవు. మన దగ్గరున్నట్లు ఒకడిమీద ఒకడు దుమ్మెత్తిపోసుకునే రాజకీయాలైతే అసలు లేవు. సహజ వనరులు పుష్కలం. వ్యవసాయంతోపాటు ఆయిల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకే, ప్రపంచంలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఘనావైపు చూస్తున్నారిప్పుడు.

ఇక్కడ 'టొట్రో' అని పిలిచే పెద్ద ఆటోలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ఒక్కో ఆటోలో 20 మంది వెళ్లవచ్చు. అయిదు కిలోమీటర్లకు 50 పేస్వాస్ (మన పైసలులాగ) తీసుకుంటారు. రోడ్లు మనకంటే మెరుగు. తిండి విషయానికొస్తే ఘనాలో చాలా వెరైటీ ఉంటుంది. మనం అన్నం, పప్పు తిన్నట్లే వాళ్లు 'ఫుఫు', 'యామ్' అనే పదార్థాల్ని రోజూ తింటారు. మైదా, పచ్చి అరటికాయలు, మరికొన్ని దినుసులు వేసి బాగా ఉడకబెట్టి, దంచి ఒక వంటకం చేస్తారు. దాన్ని వేరుసెనగ సూప్‌తో కానీ, చికెన్ సూప్‌తో కానీ కలిపి లాగిస్తారు. 'కెన్కా' అనే మరో రకం తిండి ఉంది.

దాన్ని పల్లెల్లో పండే జొన్నలతో చేస్తారు. 'వాచె' అనే ఆహారాన్ని బియ్యం, అలసందలు, కారంపొడితో వండుతారు. చికెన్, ఎద్దుమాంసం దుమ్ములేపుతారు. ఆఫ్రికన్లు శారీరక శ్రమ ఎక్కువ చేస్తుంటారు కాబట్టే ఇలాంటి బలవర్ధకమైన తిండి తింటారు. మేము కూడా ఈ తిండికి అలవాటు పడ్డాం. అక్కడ మన సరుకులు కావాలంటే 'సాగర్ ఘనా లిమిటెడ్', 'శివసాయి', 'షాప్‌రైట్' అనే మూడు భారతీయ దుకాణాలున్నాయి. వీటిలో బియ్యం, పప్పులు, మసాలా దినుసులన్నీ దొరుకుతాయి. ఏం ఇబ్బంది లేదు.

సహజవనరులే ఘనాకు సిరిసంపదలు. బంగారం, వజ్రాల ఉత్పత్తిలోనూ ఈ దేశం ముందుంది. ఇక, హస్తకళలైతే చెప్పనవసరం లేదు. చాలా వెరైటీల్లో కళాఖండాలు దొరుకుతాయి. పంటల సంగతికొస్తే- ఘనాలో ప్రకృతి వైపరీత్యాలు లేకపోవడం వ్యవసాయానికి బాగా సానుకూలం. భూకంపాలు, వరదలు కూడా ఉండవు. సహజ వాతావరణ ఉంటుంది. సారవంతమైన భూములున్నాయి. వర్షాధారం మీదనే సేద్యం చేస్తుంటారు.

వ్యవసాయం ఘనాలో ఇప్పుడు లాభదాయకమైన వ్యాపారం. అందుకే, మన తెలుగువాళ్లు కూడా ఇక్కడికొచ్చి సేద్యం చేస్తున్నారు. చాక్లెట్‌లలో వాడే కోకోను బాగా పండిస్తున్నారు. ఘనాలో ఓల్టాలేక్ అతిపెద్ద మ్యాన్‌మేడ్ (మానవ నిర్మిత) లేక్. ఏడాది పొడవునా నీరు పుష్కలం. ఈ సరస్సు కింద వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఇక్కడ పండించిన కూరగాయలు, పళ్లు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

ఇంగ్లీషు అంతగా రాదు

చదువు, ఉద్యోగాల సంగతికొస్తే.. మన దేశంలో ఉన్నన్ని విద్యాసంస్థలు ఘనాలో లేవు. ఇది చాలా చిన్న దేశం అనేదొక్కటే కాదు. వీళ్లలో విద్యా చైతన్యం ఆలస్యంగా వచ్చింది. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు. ఇండియన్లు బాగా చదువుకున్న వాళ్లని ఎంతో గౌరవంతో చూస్తారు. వారి ఆప్యాయత కూడా సహజంగా ఉంటుంది. ఘనాలో పదో తరగతి గట్టెక్కితే మహా గొప్ప. ఇక్కడ బాగా ఉన్నోళ్లు నలభై శాతం, ఏమీ లేనోళ్లు 60 శాతం ఉంటారు. రెండు వర్గాల మధ్యా గ్యాప్ ఎక్కువ. ఉన్నోళ్లు మాత్రం విదేశాలకు వెళ్లి ఖరీదైన కోర్సులు చేస్తుంటారు.

ఈ మధ్య కాలంలో చాలామంది ఘనా విద్యార్థులు ఇండియాకు వచ్చి చదువుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి బలమైన సంస్కృతి నడుమ పెరిగిన ఘనావాసులు ఇంగ్లీషు అంత బాగా మాట్లాడలేరు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కనీసం 16 ప్రాంతీయ భాషలు మాట్లాడతారు. మారుమూల గ్రామాల్లో అయితే మనుషులంతా మొరటుగా కనిపిస్తారు. శరీరం మీద ధరించే పూసలు, దుస్తులు.. అన్నీ భక్తితో చేస్తారు. కొత్త జనరేషన్ మాత్రం ఈ జీవనశైలికి దూరం అవుతోంది. పాశ్చాత్య ప్రభావం ఈ దేశంలో కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

ఘనా అభ్యర్థులకు ఇంగ్లీషు సమస్య మూలంగానే ఉద్యోగాలు రావడం కష్టంగా ఉంది. మన హైదరాబాద్, బెంగుళూరులో ఉన్నట్లు సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేవు. ఇటీవలే విప్రో, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ తమ బ్రాంచ్‌లను ఓపెన్ చేశాయి. వీసాల విషయానికొస్తే- మన దేశం నుంచి వచ్చే వాళ్లకు సులువుగానే దొరుకుతున్నాయి. పొరుగునున్న నైజీరియా అవినీతిలో ఫస్ట్. అందుకే వాళ్లను ఘనాలోకి అడుగుపెట్టనివ్వాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

వినాయక చవితి బాగా చేస్తారు

ఎందుకో మరి ఇండియా, పాకిస్తాన్ విడిపోయినప్పుడు ముస్లింలు ఈ దేశానికి పెద్దఎత్తున వలసొచ్చారు. వచ్చీరాగానే వ్యాపారంలో స్థిరపడిపోయారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ముస్లింలవే. ఇండియా నుంచి వలసొచ్చిన వారిలో సిం«ధీలు, గుజరాతీలు, తమిళులు, ఆం«ద్రులు ఎక్కువగా కనిపిస్తారు. ఘనా ఒక్కటే కాదు. ఈ దేశం చుట్టుపక్కల దేశాల్లో కూడా మన తెలుగువాళ్లు ఉన్నారు.

వినాయక చవితిని ఘనంగా చేస్తారిక్కడ. ఘనా దేశస్తులకైతే ఈస్టర్, క్రిస్‌మస్, రంజాన్ పెద్ద పండుగలు. కాలక్షేపానికి కొదవలేదిక్కడ. ఆఫ్రికావాళ్లంటే నల్లోళ్లు మొరటోళ్లు అనుకుంటాం మనం. వాళ్లు చేసేంతగా ఎంజాయ్ మనం చేయలేం. ఆఫీసుల్లో ఎంతపనైనా ఉండనీ వారానికి అయిదు రోజులే ఉద్యోగం. శని, ఆదివారాలు ఇళ్లలో ఉండరు. బీచ్‌లకు పరిగెత్తుతారు. అట్లాంటిక్ సముద్రం ఒడ్డున 'లబాడీ బీచ్' చాలా ప్రసిద్ధి. యూరోపియన్ శైలిలోనే ఉంటుంది వీరి కాలక్షేపం. యూత్ నైట్‌క్లబ్స్‌కు వెళుతుంటారు.

ఇక్కడ మందు కొట్టని వాడు పాపాత్ముడు. 365 రోజులు తాగుతూనే ఉంటారు. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి కూర్చొని మందు కొడతారు. ఎవరి బ్యాగుల్లో అయినా డబ్బులు కనిపించవేమో కానీ 'గినిస్' అనే బీరు మాత్రం కనిపిస్తుంది. నీళ్లు తాగినట్లు బీర్లు తాగడం ఘనా ప్రజలకే చెల్లు. వారాంతంలో అయితే ఇళ్లన్నీ మందువాసనతో గుబాళిస్తుంటాయి. ఆదివారం మాత్రం చర్చి, మసీదులకు వెళ్లి ప్రశాంతంగా ప్రార్థనల్లో మునిగిపోతారు. ఇండియన్స్ అయితే ఇక్కడే ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కు వెళతారు.

ఈ దేశంలో చిత్రమైన విషయం ఏమిటంటే- చాలామంది పెళ్లిళ్లు చేసుకోకుండానే కలిసుంటారు. మన దేశంలో ఈ మధ్యనే విస్తరిస్తున్న 'లివింగ్ టు గెదర్' ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే పాతబడిపోయింది. వివాహం లేకుండానే పిల్లల్ని కంటారు. కుటుంబాల్లో సంక్షోభం వస్తే, పిల్లల భారం మోసేది మాత్రం మహిళలే. పొలాలు, గనులు, కర్మాగారాల్లో కష్టమైన పనులను కూడా మహిళలు ఎంతో అంకితభావంతో చేస్తారు. రెండువందల కిలోల బరువున్న సామాగ్రిని సైతం నెత్తిమీద పెట్టుకొని, మైళ్లకు మైళ్లు నడుస్తుంటారు. పేద దేశం అంటాం కానీ, ఘనా కరెన్సీ మనకంటే ఎక్కువ. వాళ్ల రూపాయికి మన దేశంలో ముప్పై రూపాయలు వస్తాయి.
 
- మల్లెంపూటి ఆదినారాయణ

Tuesday, February 1, 2011

అక్షరాలతో ఆట!

ఆ ముగ్గురి విజిటింగ్ కార్డ్స్ చూస్తూనే మనకు అర్థమైపోతుంది. వీళ్లు అందరిలాంటోళ్లు కాదు కొత్తగా ఏదో చేయాలన్న తపన ఉన్నవాళ్లని. ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఈ ముగ్గురి హోదాలు భలే తమాషాగా ఉన్నాయిలెండి. 'హెడ్ ర్యాట్' రజత్ (27), 'ద డిజైన్ ర్యాట్' మధుమిత (27), 'ఐడియేటింగ్ ర్యాట్' మనుజ్ (25). అందరూ ఐ.ఐ.టి.ల్లో పట్టభద్రులు. చదువు పూర్తవుతూనే ఎంచక్కా ఉద్యోగం చేసుకోకుండా మ్యాడ్‌ర్యాట్ అనే (రూబిక్స్) గేమ్స్ కంపెనీ పెట్టారు. 'అందులో ఏముంది గొప్ప..? ఈ రోజుల్లో బోలెడంత మంది కంపెనీలు పెట్టేస్తున్నారు. అందులో ఇదొకటి..' ఇలాంటి సాధారణ కామెంట్లు వినబడ్డప్పుడు వీళ్లు ' ప్రపంచంలో తొలి హిందీ బోర్డ్‌గేమ్ కంపెనీ మాదే' అని గర్వంగా చెబుతారు.

విద్యార్థుల మేథోసామర్థ్యాన్ని, తార్కిక పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు మ్యాడ్‌ర్యాట్ గేమ్స్ టానిక్‌లా పనిచేస్తాయి. అచ్చు చెస్ బోర్డు ఉన్నట్లే ఉంటుంది మ్యాడ్‌ర్యాట్ కంపెనీ తయారు చేసిన హిందీ గేమ్ 'అక్షరిత్'. ఇందులో అక్షరాలు, కొన్ని ఖాళీ గళ్లు ఉంటాయి. హిందీ అక్షరాలు తెలిసిన ఎవరైనా ఈ గేమ్‌ను సులువుగా ఆడవచ్చు. పిల్లలు రెగ్యులర్‌గా ఆడితే భాషలో గట్టి పట్టు దొరుకుతుంది. పిల్లలకైతే సులువుగా, పెద్దలకైతే కొంచెం క్లిష్టంగా ఉండేలా విడివిడిగా గేమ్స్‌ను తయారుచేశారు. మధ్యప్రదేశ్‌లో 200 పాఠశాలలు, పశ్చిమబెంగాల్‌లో 100, రాజస్థాన్‌లో 75 పాఠశాలలు ఈ గేమ్స్‌ను తెప్పించుకోవడం విశేషం.

ఐడియా ఎలా వచ్చింది..?

ఐ.ఐ.టి. పూర్తి చేసిన మనుజ్ ఒకసారి రైల్లో దూర ప్రయాణం చేస్తున్నాడు. అదేదో గంటా రెండుగంటలు ప్రయాణం కాదు. ఏకంగా 55 గంటల ప్రయాణం. టీ తాగాడు. పేపర్లు తిరగేశాడు. పాటలు విన్నాడు. వేరుశెనక్కాయలు తింటూ టైమ్‌పాస్ చేశాడు. అయినా విసుగు. దిక్కుతోచలేదు. 'నేనే కాదు. రోజూ నాలాగే రైళ్లలో లాంగ్ జర్నీ చేసే వాళ్లందరికీ ఇదే బోర్. ఈ బోర్‌ను బద్దలు చేసే 'ఫన్'టాస్టిక్ ఐడియా ఏదన్నా ఉంటుందా..?' అంటూ తెగ ఆలోచిస్తే.. అప్పుడు వెలిగింది 'బోర్డ్‌గేమ్'. 'హిందీలో ఇంతవరకు చిన్నాచితక గేమ్స్ వచ్చాయి కానీ, కేవలం అక్షరాలతో మ్యాజిక్ చేసే గేమ్ రాలేదు. ఎలాగైనా భాషతో ఆడుకునే ఆటను కనిపెట్టాలి..' అనుకున్నాడు.

ఇంటికి వచ్చీ రావడంతోనే సోదరుడు రజత్‌తో షేర్ చేసుకున్నాడు మనుజ్. "అరే భాయ్, హిందీతో గేమ్ తయారు చేయడం అంటే ఆటలా..? హిందీ అక్షరాల రూపం ఎలా ఉంటుందో తెలుసుకదా..? ఆంగ్లంలో 26 అక్షరాలే ఉంటాయి. హిందీలో 600 ధ్వనులున్నాయి. హాఫ్ లెటర్స్, కాంపౌండ్ లెటర్స్, మాత్రాస్.. వీటన్నిటినీ కలుపుకుంటే గేమ్ కోసం 4 వేల టైల్స్ చేయాలి. ఈ టైల్స్ పట్టే బోర్డ్ సైజ్ ఎంతుండాలో తెలుసా..? మన బెడ్‌రూంలో ఉన్న డబుల్ బెడ్ అంత..'' అన్నాడు నవ్వుకుంటూ. రజత్ నోటికి ఏది వస్తే అది చెప్పేరకం కాదు. అతని మాటంటే మనుజ్‌కు గురి.

ఎందుకంటే, రజత్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసింది అమెరికాలోని కార్నెగీ మిలాన్ యూనివర్శిటీలో. అప్పటికైతే సైలెంట్‌గా ఉండిపోయిన మనుజ్.. కొన్నాళ్ల తర్వాత ఇదే ఐడియాను తన భార్య మధుమితతో చెప్పాడు. ఈ భార్యాభర్తలిద్దరూ ఒకప్పుడు మదనపల్లి దగ్గరున్న 'రిషివ్యాలీ'లో టీచర్లు. ఇద్దరిదీ ఒకే బోధనానుభవం కావడంతో 'ఈ ఐడియా బావుంది. ప్రాక్టికల్‌గా వర్కవుట్ అవుతుందో లేదో స్టడీ చేయాలి..' అంది మధుమిత.

గేమ్‌లో గెలిచారు..
ముగ్గురూ కలిసి పలువురు భాషాశాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కలిసి అభిప్రాయాలను తెలుసుకున్నారు. "బోర్డ్‌గేమ్స్ వస్తే ఆసక్తిగా ఆడతారా, కొన్నాళ్లకు మానేస్తారా..? తెలుసుకునేందుకు మారూమూల పల్లెల్లో సైతం తిరిగాం..'' అన్నారు మనుజ్, మధుమిత. వీళ్ల ఐడియాను పొగిడిన వాళ్లు ఉన్నట్లే, తెగిడిన వాళ్లూ ఉన్నారు. ఏదైతే అది అవుతుందని 'ఆట' మొదలుపెట్టారు. గేమ్‌బోర్డును డిజైన్ చేసేందుకు ఇటలీ వెళ్లి అక్కడ పేరున్న గేమ్ డిజైనర్‌ను కలిశారు ఈ ముగ్గురూ.

కలర్‌ఫుల్‌గా పిల్లలు చూస్తూనే ఆకట్టుకునేలా బోర్డ్‌ను తీర్చిదిద్దారు. మార్కెట్‌లోకి వస్తూనే ఈ గేమ్ అందర్నీ కట్టిపడేసింది. చాలామంది ఎగబడి కొన్నారు. పాఠశాలల యాజమాన్యాల వారు ఫోన్లు చేసి తెప్పించుకున్నారు. పలు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు అధికారికంగా కొనుగోలు చేశారు. ఇప్పుడు కొన్ని నోకియా మొబైల్ ఫోన్‌లలో కూడా మ్యాడ్‌ర్యాట్ గేమ్స్ చేరిపోయాయి. కొత్త ఆలోచన పండితే తీయటి ఫలితాలు వాటంతట అవే వస్తాయనేందుకు ఈ 'త్రీ ఐడియట్స్' నిదర్శనం. ఏమంటారు..? మరింత 'మ్యాడ్‌ర్యాట్ ' సమాచారం కోసం : http://www.aksharit.com