Sunday, November 7, 2010

వహ్...వాచ్!!

122 వజ్రాలు పొదిగిన ఈ వాచీ మీ చేతికి కట్టుకుంటే తళతళా మెరిసిపోతుంది. ఎక్కడలేని హుందాతనాన్ని ఇస్తుంది. గడియారం చుట్టూ రెండు వరుసల్లో చక్కగా పొదిగిన తెల్లటి వజ్రాలు, సిల్వర్ లిజార్డ్ స్ట్రాప్, స్టెయిన్‌లెస్ స్టీల్ కలగలిపి ఫెర్గామ్స్ బ్రాండ్ తయారు చేసిన 'గాన్సినో' చూడగానే మగువలను కట్టిపడేస్తుంది. నాజూకైన వారి అందాన్ని రెట్టింపుచేసే ఈ వాచీ ధర సుమారు లక్ష రూపాయలు.

56 వజ్రాలతో తయారైన ఈ స్విస్ వాచీ స్టైలే వేరు. నిత్యం కొత్తగా కనిపించాలని ఉవ్విళ్లూరే వారికి 'గాన్సినో స్పార్క్‌లింగ్' అనే ఈ మోడల్ అతికినట్లు సరిపోతుంది. వాచీ అంచులో చతురస్త్రాకారంలో స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేసిన అరలో మరో వజ్రం మెరుస్తుండటం దీని ప్రత్యేకత.

లేత నలుపు పట్టీతో అద్భుతమైన షేపింగ్ ఈ వాచీ సొంతం. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సమ్మోహన గడియారం ఫెర్గామ్స్ కంపెనీ వెలువరించింది.

ఒమెగా తయారు చేసిన ఈ గడియారం మగధీరుల హుందాతనాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. ఒరిజినల్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైంది. గంటలు, నిమిషాలు, సెకండ్లతోపాటు క్రోనోగ్రాఫ్ చూపిస్తుంది.

ఒమెగా స్పీడ్ మాస్టర్ మెన్స్ మూన్‌వాచ్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మార్కెట్‌లో లభిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే ఇలాంటి వాచీల కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీని ధర సుమారు 3.50 లక్షల రూపాయలు.

బంగారంతో తయారై, ఫస్ట్‌లుక్‌లోనే మనసు దోచుకునే ఈ గడియారం ఖరీదు కూడా చాలా ఎక్కువ. ప్రపంచ ప్రఖ్యాత లాంగిన్స్ కంపెనీ దీన్ని రూపొందించింది. నల్లటి పట్టీతో లైట్‌గా కనిపిస్తుంది కానీ ఎదుటివాళ్లకు మన వ్యక్తిత్వాన్ని పట్టి చూపిస్తుంది. ఈ గడియారం ఖరీదు : సుమారు 5 లక్షలు
లాంగిన్స్ కంపెనీ తయారు చేసిన మరో స్టెయిన్‌లెస్ స్టీల్ వాచీ ఇది. అన్ని కొలతలు బ్యాలెన్స్ అయ్యేలా అమరిన ఈ గడియారం ధవళకాంతులతో ఎదుటివాళ్లను ఒక్క నిమిషం మనవైపు చూపు తిప్పుకొనేలా చేస్తుంది. ఈ వాచీ ధర : రూ.2.30 లక్షలు. ఇదే ధరల శ్రేణిలో ఈ సంస్థ బోలెడు మోడల్స్‌ను తయారు చేసింది

. ఇన్నోవేటివ్ లుక్‌తో అదరగొట్టే గడియారాలు ఈ కంపెనీ సొంతం. ఒమెగా ఖాతాలో మరో కలికితురాయిలాంటి గడియారం 'మదర్ ఆఫ్ పెర్ల్ డయల్ అండ్ గ్రే బ్రాండ్. 18 క్యారెట్ల ఎల్లో గోల్డ్‌ను కరిగించి ప్రత్యేక డిజైన్‌తో దీన్ని తయారుచేశారు.

చతురస్త్రాకారంలోని ఈ గడియారం చుట్టూ స్టయిలిష్ డిజైన్‌తో వజ్రాలను అమర్చారు. కొడుకులు, కూతుళ్లు తల్లులకు ప్రజెంట్ చేసేందుకు ఈ గడియారం సరిపోతుంది. వెలకట్టలేని అమ్మ ప్రేమకు గౌరవంతో అందించే ఈ వాచీ ధర : 1.60 లక్షలకు పైగానే ఉంది.

స్టెయిన్‌లెస్ స్టీల్‌తో అచ్చుపోసిన ఈ గడియాన్ని ప్రత్యేకంగా మగవారి కోసం తయారు చేసింది టిస్సాట్ కంపెనీ. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి ఈ వాచీ నప్పుతుంది. వాచీలోపల తెలుపు మీద నల్లటి అంకెలు కళ్లకు చాలా ఇంపుగా అనిపిస్తాయి. చాలా అరుదుగా దొరికే డిజైన్‌లలో ఇదొకటి. స్మార్ట్ మెన్‌కు స్మార్ట్ వాచ్ అయిన దీని ధర : సుమారు 55 వేల రూపాయలు.

ప్రముఖ వాచ్‌మేకర్ గుస్సీ చాలా భిన్నమైన ఆకారాల్లో వాచీలను తయారు చేస్తుంటుంది. క్వార్ట్జ్ మూవ్‌మెంట్‌లో తయారైన ఈ వాచీ మహిళలకు కొత్త సొగసును ఇస్తుంది. వాచీ లోపల ఎలాంటి అంకెలు అచ్చువేయకుండా చాలా ప్లెయిన్‌గా డిజైన్ చేశారు. విలువైన 54 వజ్రాలను పొదిగిన ఈ వాచీ ధర : లక్షకు పైగానే ఉంది.

గడియారాల కంపెనీల్లో కార్‌టైర్‌కు ఉన్న ప్రత్యేకత చెప్పనక్కర్లేదు. ఆ కంపెనీ బ్రాండ్ వాచీ చేతిలో ఉంటే చాలు, ఆ స్టయిలే వేరు. 18 క్యారెట్ల గోల్డ్‌తో మహిళల కోసం ముస్తాబైన ఈ వాచీని చూడగానే ఉద్వేగభరితమైన అనుభూతి కలుగుతుంది. వాచీ లోపల రోమన్ అంకెలు, ముద్దుగా కనిపించే ముల్లులతో కట్టిపడేస్తుంది.

గంటలు, నిమిషాలు, సెకండ్లు, తేదీలను మాత్రమే ఇది చూపిస్తుంది. చుట్టూ బంగారం, అంచులకు వజ్రాలతో మెరిసిపోతున్న ఈ వాచీ ధర : సుమారు ఆరు లక్షల రూపాయలు. 18 క్యారెట్ల పింక్ గోల్డ్‌తో చాలా అగ్రెసివ్ లుక్‌తో కనిపించే ఈ మగమహారాజుల వాచీని బ్రెయిట్‌లింగ్ తయారు చేసింది.

డార్క్ బ్రౌన్ స్ట్రాప్ రంగుకు సరిపోయే కలర్‌తోనే బాడీని తయారు చేశారు. రోమన్ అంకెలు వాడటంతో చాలా హుందాగా కనిపిస్తుంది. దీని ధర : నాలుగు లక్షల రూపాయలు. - ఆది మల్లెంపూటి

Monday, November 1, 2010

మాయదారి మనసు


ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురుంటారని అంటారు. కానీ ఏ ఇద్దరి వ్యక్తిత్వమూ ఒకే విధంగా వుండదని సైకాలజిస్టులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఆలోచనలూ, గుణగణాలూ, ఇతర పద్ధతులూ కొన్ని కలిస్తే కలవ వచ్చేమో కాని, వ్యక్తిత్వంలో మాత్రం ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత వుండి తీరుతుంది.

ఈ మధ్య మా క్లినిక్‌కు ఓ వ్యక్తి వచ్చాడు. ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఏవీ లేవు. అన్నీ బాగానే వున్నాయి కాని, ఈ మధ్య తననొక చిత్రమైన సమస్య వేధిస్తూందని చెప్పాడు. గడ్డంతో వున్న యువకులను చూస్తే తనకు ఒక ఎలర్జీ లాంటి ఫీలింగ్ వస్తుందట. "అలా వచ్చినప్పుడు తన్నాలనిపిస్తుంది. వారెంత మంచివారైనా, అది నాకనవసరం. ఓ తెలుగు సినిమా హీరోకు చాలా ఫాలోయింగు ఉంది. అలాగే దక్షిణ భారతదేశంలో ఓ గాయకుడున్నాడు. అతనికున్న గడ్డం వల్ల, అతని పాట నాకు నచ్చదు."

"దానివల్ల వచ్చిన నష్టం ఏమిటి?"

"అదే చెప్తున్నాను. ఈ గడ్డం వాళ్లను చూస్తే బద్ధకస్థులనీ, గడ్డం గీసుకోడానికి బధ్ధకించేవారేమోననీ, అందుకే నాకిష్టం లేదనీ మొదట్లో నాకే అనిపిస్తుండేది. అంతెందుకు? గడ్డంగాళ్లను చూశాక ఇక సినిమాలే చూడకూడదనిపించింది. ఈ జబ్బేమిటో అర్థం కావటం లేదు."

"ఈ విధంగా గడ్డం వున్నవారు మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా, కొట్టారా?
అటువంటివారిని చూస్తే మీకెందుకు కోపమో మీరెప్పుడైనా బాగా ఆలోచించారా?"

"చాలాసార్లు ఆలోచించినా నాకేమీ అంతు చిక్కలేదు. ఇంతకూ నేనొచ్చిన సమస్య ఏమిటంటే, ఇప్పుడు నాకు కొత్త బాసు వచ్చాడు. అతనికి గడ్డం వుంది. నేను ప్రతిరోజూ అతనితో కనీసం నాలుగైదు గంటలైనా కలిసి వుండాలి. నేను ఎలా ప్రవర్తిస్తానో తలుచుకుంటే నాకే భయంగా వుంది. దీనికి మీరేమైనా చేయగలరా?"

"తప్పకుండా చేయగలను" అని చెప్పి, అతనికి హిప్నాటిజం, దానివల్ల కలిగే లాభాల గురించి చెప్పి, అతనికి హిప్నాటిజం పట్ల వున్న అపోహలను తొలగించి, నెమ్మదిగా ట్రాన్స్‌లోకి పంపాను. ఆ మత్తు స్థితిలో అతనికి బాల్యంలో రోజులు గుర్తు చేశాను. ఇంటి పరిస్థితులు, ఫ్రెండ్స్, స్కూలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. అతని స్కూలు ఆలోచనలు, ఫ్రెండ్స్‌తో తిరగటం, టీచర్లు, చుట్టాలు, హాజరైన సమావేశాలు, ఎక్కడైనా గడ్డం వున్న మనుషులతో ఘర్షణలు - ఇలా నెమ్మదిగా అడగడం ప్రారంభించాను. ఓ అరగంట తరువాత గడ్డం బూచాడు దొరికాడు. తరువాత ట్రాన్స్‌లోంచి బయటికి తీసుకొచ్చాను.

ఇంతకూ జరిగిందేమిటంటే, ఇతను స్కూల్లో చదివే రోజుల్లో ఒకనాడు ఫ్రెండ్‌తో కలిసి సైకిల్ మీద డబుల్స్ వస్తూంటే, ఒక కాన్స్‌టబుల్ చూశాడు. అతన్ని చూసి ఈ అబ్బాయి సైకిల్ స్పీడు పెంచాడు. దాంతో కాన్స్‌టబుల్ మండిపడి, మరో సైకిల్ మీద వెంబడించి పట్టుకుని, స్టేషన్‌కు తీసుకుపోయాడు. అక్కడున్న సబ్ఇన్స్‌పెక్టరు వీళ్లిద్దరినీ చెరో దెబ్బా వేసి తప్పించుకు పారిపోయినందుకు పిచ్చి తిట్లు తిట్టి, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ సబ్ఇన్స్‌పెక్టరుకు గడ్డం ఉంది. తరువాత ఇంటికి వచ్చేశారు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. వారం, పది రోజులు అది తలుచుకుని బాధపడ్డారు. ఆ తరువాత నెమ్మదిగా మరిచిపోయారు. కానీ ఆ గడ్డం మనిషి మనసులో ఎక్కడో ఓ మూల దాక్కుని వుండిపోయాడు. ఉద్యోగంలో చేరిన తరువాత గడ్డం వున్నవారిని చూసినపుడు చికాకు పడుతుండేవాడు.

సైకాలజీలో నిష్ణాతులైన జోసెఫ్‌లుఫ్త్, హారీఇంగం అనే వ్యక్తులు, తమ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని 'జోహారీ విండో' అనే ఒక పట్టిక తయారుచేశారు. ఇది కౌన్సిలింగ్ రంగంలో సంచలనం సృష్టించింది. ఇందులో నాలుగు విండోలు (కిటికీలు) వుంటాయి. ఒక్కొక్కటీ ఒక్కో లక్షణాన్ని తెలుపుతుంది.

మొదటి భాగంలోని అవగతం విషయాలు, మీకూ తెలుసు, ఇతరులకూ తెలుసు. అంటే మీ పేరు, ఊరు, మీ వృత్తి, మీరు చేసే పని వగైరాలు. రెండో భాగంలో విషయాలు మీకు తెలియదు. కానీ ఇతరులు గుర్తించారు. అవి మీ అహంకారం, కులాభిమానం, అసూయ, మీ మేనరిజంలు వంటివి. అంటే అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఇతరులకు మీ పట్ల అభిప్రాయం వుంది. అది మీకు తెలియదు. మూడో భాగంలో విషయాలు ఇతరులకు తెలియవు. కానీ మీకు మాత్రమే తెలుసు. అంటే మీ వ్యక్తిగత రహస్యాలు, మీరు పొందిన అవమానాలు లేదా చేసిన తప్పుడు పనులు తదితరాలు. ఇక చివరగా అయోమయం అంటే ఆ ప్రవర్తనకు కారణం మీకు తెలియదు, ఇతరులకూ తెలియదు. అటువంటి చిత్రమైన పరిస్థితిలో సైకాలజిస్టులు మీతో మాట్లాడి, ప్రశ్నలు వేసి, మీ నుంచే సమాధానం రాబడతారు.

మన మనసులో ఒక అద్భుతమైన వీడియో లైబ్రరీ వుంది. అందులో మన బాల్యం నుంచి ఉన్న ఎన్నో వీడియో కేసెట్లుంటాయి. అప్పుడప్పుడు అవి చూస్తూ వుండటం మంచిది. వాటిలో సంతోషం కలిగించిన సన్నివేశాలెన్నో వుంటాయి. వాటిని పదేపదే మననం చేసుకుంటే మనకన్నా అదృష్టవంతులెవరూ వుండరు!
Dr. బి.వి. పట్టాభిరాం

ఒక్కసారి బ్రతికించు

                                                                               
    
పాపాలు పాపాలు
ఘోరమైన నేరాలు
అందుకు నరకంలో శిక్షలు
శూలాల్తో పొడుస్తారు
సలసలకాగే నూనెలో వేస్తారు
ఱంపాలతో కోస్తారు
చిత్రహింసలు పెడ్తారు
ఏం వింటేనే భయంగా ఉందా
అందుకే దేవుడి హుండీలో
లక్షలూ కోట్లూ పోస్తున్నావా
స్వాములు బాబాల చుట్టూ తిరుగుతున్నావా?
నీకీ సత్యం తెలియలేదేమో?
నరకంలో పెట్టే శిక్షలు
కాలి బూడిదైన నీ దేహానికేమో
నీ ఆత్మకు కాదేమో
నీ ఆత్మ నాశనరహితమైనది
గీతలో రెండవ అధ్యాయం చదవలేదా??

నైనం చిందన్తి శస్త్రాణి

నైనం దహతి పావకః
నచైనం క్లేదయన్త్యాపో
నశోషయతి మారుతః

పుణ్యాలు చేస్తే హాయిగా

పొందవచ్చు స్వర్గ సౌఖ్యాలు
మగచచ్చినాళ్ళయితే
రంభాది అప్సరసంయోగాలు

ఏమి పిచ్చి ఆలోచలు

ఏమి మూడ విశ్వాసాలు
నువ్వు చేసే పాపపుణ్యాల ఫలితం
నువు బ్రతికివుండగానే అనుభవిస్తావేమో
కొంచెం నిదానంగా ఆలోచించు
భవితలో కలిగే పరిణామాలను ఊహించు

ఊహూ! నీకు నమ్మకం లేదు

నమ్మకం రాదు
భయాందోళనా సమ్మిళితమైన భక్తితో
నీపాపాలను ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నావా?

ఓ అనంత సృష్టికర్తా

మానవాతీత అఖండ శక్తిదాయకా
నేను చచ్చిపోయాక
నా కట్టె కాల్చేలోపుగా
ఒక్కసారి బ్రతికుంచు
చచ్చాక అంతా శూన్యమేనని
ఇది నా స్వానుభవమని
ఈ నరకం స్వర్గం లేవని
అభూతకల్పనలేనని
పాపపుణ్యాల ఫలితాలు
ఇక్కడే అనుభవిస్తామని
ఈ సత్యాన్ని ఉద్ఘాటించి
మళ్ళీ చచ్చిపోతా!
- కాలనాథభట్ట వీరభద్ర శాస్త్రి