Monday, December 19, 2011

వర్తమానమే వాస్తవం!

 
"గతంలో ఆ పొరపాటే చేసి ఉండకపోతే, ఇప్పుడు ఈ దుస్థితి ఉండేదే కాదు. ఏం చేస్తాం? భవిష్యత్తులో నైనా అలాంటి తప్పిదం మరోసారి జరగకుండా చూసుకోవాలి.''ఇలాంటి మాటలు ఎక్కడైనా విన్నప్పుడు, వారికేదో గొప్ప జ్ఞానోదయం అయినట్లే అనిపిస్తుంది. కానీ, ఇప్పుడు మాత్రం ఆయన చేస్తున్నదేమిటి? గతంలో చేసిన తప్పు, భవిష్యత్తులో చేయకుండా జాగ్రత్తపడతా అంటున్నాడు. బాగానే ఉంది. కానీ, వర్తమానం మాటేమిటి? వర్తమానంలో మాత్రం ఆ తప్పే కొనసాగిస్తాడనేగా? లేదంటే, గతం గురించి, భవిష్యత్తు గురించీ మాట్లాడి వర్తమానాన్ని ఎందుకు వదిలేసినట్లు? పూర్తి స్ఫురణతో అయినా, కాకున్నా, మనసు చాలాసార్లు అలా వర్తమానం నుంచి పక్కకు జరిగిపోతూనే ఉంటుంది. అనుభవాలు నేర్పిన జీవిత పాఠాలను యథాతథంగా భవిష్యత్తులోకి బదిలీ చేయడం వల్ల కలిగే విపత్తే ఇది. నిజానికి మనముందు గత మూ లేదు, భవిష్యత్తూ లేదు. ఉన్నదల్లా వ ర్తమానమే. కానీ, చాలా సార్లు ఆ వర్తమానం మీదే మనసు నిలవదు.

* * * "ఇప్పుడేదో ఈ కాస్తకే తెగమురిసిపోతున్నారు కానీ, ఆ రోజుల్లో మేము ఎన్నెన్ని అద్భుతాలు చేశామండి?'' "అవునవును వాటిని చూసిన వారంతా నిజంగా ఎంత ఆశ్చర్యపోయే వారని? మేము చేసిన ఏ పనికీ అసలు తిరుగే ఉండేది కాదు." కొందరి సంభాషణల్లో ఎంతసేపూ ఇలా గత వైభవాల గురించిన ఆత్మస్తుతే ఉంటుంది. గతంలో వారు కొన్ని అద్భుతాలే చేసినా, ఆ ఆ వైభవాన్ని ఎంత కాలమని భుజాల మీద వేసుకుని తిరుగుతారు? గతం ఘనకీర్తి కాదు, ఇక్కడ, ఇప్పుడేం చేస్తున్నారన్నది కదా ముఖ్యం ? నిజానికి వర్తమానంలో నిర్జీవంగా మారిపోయిన వారే ఇలా అస్తమానం గతంలో జీవిస్తూ గడిపేస్తారు. అయినా, అంతంత సమయం గతంలో జీవిస్తున్నారూ అంటే, వర్తమానంలో వారు లేరనే కదా అర్థం? వాస్తవానికి, నువ్వు సంపూర్ణంగా ఉన్న చోట గతానికి తావే ఉండదు. ? నవ్వున్న చోట గతమే ఉందీ అంటే అక్కడ నువ్వు లేవనే కదా!
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEju_t6EZT7Zw0yCyTBShWrFrGhSOmT0jXVKKA3mzJm0JswYsI8GQThHa3ojkolOnu2WgK1UQypMEkmzZLnBXrXfJkD5m4hR0Lqg9TABb_yEynE3IkunQaz763ea8IUwtEq3TrDf6XgDJite/s1600/Vision.jpg
 తప్పించుకోవడమే
పెద్ద అవసరం లేకపోయినా, గతం గురించి ఆలోచించడం, దాని గురించి మాట్లాడటం నిజంగా వర్తమానాన్ని పక్కకు తప్పించే ప్రయత్నమే. అయితే మనకు తెలియకుండానే కొంత మేరకు గతం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. బాల్యం నాటి కొన్ని అనుభవాలు, పెరిగిన సంస్కృతి, దేశ కాల పరిస్థితులు, మన వెంట నీడలా నడుస్తూనే ఉంటాయి. ప్రపంచం పట్ల మన దృక్ఫథాన్ని, ఆలోచనల్ని, మన స్పందనల్ని, మనం ఏర్పచుకునే మానవ సంబంధాల్ని ఇవి ఏదో ఒక స్థాయిలో ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అయితే వర్తమానంలోకి విస్తృతంగా వ్యాపించడం ద్వారా మాత్రమే ఆ ప్రభావాల నుంచి బయటపడటం సాధ్యమవుతుంది. అలా వ్యాపించడానికి వర్తమానం విశిష్టత గురించి తెలియాలి. అలా వర్తమానం గురించి సమగ్రంగా తెలిసి, దానికి అంకితమయ్యే దాకా గతం నీడలోనుంచి పక్కకు జరగడం సాధ్యం కాదు. వర్తమానం మీద తమను తాము నిలబెట్టుకోవడం ద్వారానే జీవితం నిలబడుతుంది. గ తాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పెంచే కొద్దీ విషయం మరింత సంక్లిష్టమవుతూ వెళుతుంది.
http://hrushikeshzadgaonkar.files.wordpress.com/2011/06/simplify-your-life.jpg?w=640
సంసిద్ధతే ముఖ్యం
వర్తమానంలోని ఘర్షణనూ, బాధనూ ఎదుర్కోవడానికి సిద్దం కాలేక కూడా మనసు కొన్నిసార్లు గతంలోకి, భవిష్యత్తులోకీ దూరిపోతూ ఉంటుంది. అలాగే, తమలోని అలసత్వాన్నీ, అశక్తతనూ, పలాయనత్వాన్నీ సోమరితనాన్నీ కప్పి పుచ్చుకోవడానికి కొందరు చాలా తెలివిగా గతం లేదా భవిష్యత్తు ముసుగును కప్పుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన ఊహా సౌధంలో తిరుగుతూ కాలం వెలిబుచ్చుతూ ఉంటారు. అలా పక్కకు జరిగిపోవడం వల్ల వర్తమాన విషయాలు మరింత జటిలంగానూ, సంక్లిష్టంగానూ తయారవుతాయి. వర్తమానం దుర్భరంగా మారిన వారిలో కొందరు ఈ కోవకే చెందుతారు. నిజంగానే భవిష్యత్తులో ఏదో అద్భుతమే జరగాలనుకుంటే, వర్తమానంలో దానికి పునాదులు పడాలి. ఆ స్థాయిలో కార్యాచరణ కూడా ఉండాలి. అదేమీ లేకుండా నిరంతరం గతంలోని తమ ప్రతాపం గురించి, ఉత్తుత్తి ఉజ్వల భవిష్యత్తు గురించి అనుకుంటూ పోవడం క చ్ఛితంగా పలాయనమే అవుతుంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj49Tty3dpwV4719s0asEhiHyRpDMHAzoGJ-MjF2t2iTI5cTMHqTuxL0AuITqmX-c3-NKFzmx0yY3UljLbLaOvOoIdyfI2wYgbRtSdz5Fn6KjazZkKaTFANrR21oemiFHHziR58Yh5mMvI/s400/normal_TreeofLife.jpg
ఎందుకిలా?
అసలు మనసెందుకు ఇలా పదేపదే గతంలోకి, భవిష్యత్తులోకి జారుకుంటుంది? వర్తమాన జీవితంలో శ్రమ, ఘర్షణ, బాధ ఇవన్నీ ఉంటాయి. ఈ స్థితిలో గతంలో శ్రమించిన రోజుల్ని సైతం గుర్తు చేసుకుంటాం. కారణం, ఆ గుర్తు చేసుకోవడంలో శ్రమ గురించిన జ్ఞాపకాలే తప్ప శ్ర మ ఉండదు. అందుకే అవి భారంగా అనిపించవు. అయినా, జీవితం తాలూకు ఘర్షణ జీవిత వాస్తవం అయినప్పుడు ఆ ఘర్షణ నుంచి పక్కకు జరిగితే ఫలితమేముంది? అంటే మానసిక వేత్త ఎక్కార్ట్ టోల్ " వర్తమానం అంత బాధాకరంగా అనిపించడానికి వర్తమానాన్ని యథాతథంగా స్వీకరించలేని తనమే ప్రధాన కారణం. పరిష్కరించే ప్రయత్నమేదీ లేకుండా సమస్యలను నిరో«ధించే ప్రయత్నాలే ఆ సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. నిజానికి వర్తమానపు బాధల తీవ్రత వర్తమానాన్ని నిరోధించే స్థాయి మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. చేయవలసిందల్లా వర్తమాన స్థితి గతుల్ని యథాతథంగా స్వీకరించడానికి సిద్ధం కావడమే. అప్పుడే అ పరిస్థితుల్ని చక్కదిద్దడం గానీ, సమస్యల్ని పరిష్కరించడం గానీ సాధ్యమవుతుంది. '' అంటాడు.

వర్తమానమే సమస్తమై....

అదేపనిగా, గతం, భవిష్యత్తుల గురించి చేసే ఆలోచనలు, వర్తమానాన్ని నిర్జీవ పరిచి జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఒక తీవ్రమైన బాధ శరీరాన్నీ మనసునూ ఆక్రమిస్తుంది. జీవిత బంధం గతంలోంచే కొనసాగుతుంది. గతంతో నీ అనుబంధాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమించావు, ద్వేషించావు. స్నేహాలు చేశావు. వైరాలు పెంచుకున్నావు. అవన్నీ నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. కానీ, ఆ విషయాల్లో తలమునకలు కావడం మొదలెడితే, వర్తమానాన్ని, బతికే ఇప్పటికి ఈ క్షణాలను పూర్తిగా పోగొట్టుకుంటాం. మనసంతా గతమూ, భవిష్యత్తుల గురించిన ఆలోచనలే నిండిపోతే, వర్తమానానికింక చోటు ఎక్కడుంటుంది? పరిష్కరించవలసిన ఎంతో వర్తమానం మన ముందు పడి ఉంది. అందుకే గతమూ, భవిష్యత్తూ కాదు. ఈ క్షణమే మనకు సమస్తం అందులో సమగ్రంగా జీవించడమే ముఖ్యం. వర్తమానంలో సమగ్రంగా జీవించగలిగితే భవిష్యత్తు దానికదే ఏర్పడుతుంది. అందుకే సర్వశక్తుల్నీ వర్తమానం మీదే కేంద్రీకృతం చేయడం ఒక్కటే ఇప్పుడు మనిషి ముందున్న ఏకైక లక్ష్యం.

Friday, December 2, 2011

మనసే మన గురువు

మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ- పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ'లోచనం' చేసేదే మనసు. మనలో ఉండి మనలను నడిపించే మనసే మన 'తొలిగురువు' అంటోంది వేదసారం. 'నీవెవరో తెలుసుకో' అని బోధించిన రమణ మహర్షుల వారైనా 'నీవే ప్రపంచం' అన్న జిడ్డు కృష్ణమూర్తి తత్వమైనా నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్నే చూడమంటోంది.

ఆలోచన అనగానే మన మనసు అనే జల్లెడ మంచిని, చెడును వేరు చేసే పరికరంలాగా పనిచేస్తుంది. ఆచరణలో మాత్రం మంచిని తీసుకుని చెడును వదిలివేస్తాం. ఒక్కోసారి చెడును కూడా మంచిగా భావించి మనసు మొండికేస్తూ మంచిని విస్మరిస్తుంది. ఎవరి సలహాను కూడా ఈ మనసు పరిగణనకు తీసుకోదు. కాని, ఈ ఆలోచన సాధారణంగా ఒక సమస్యపై ఉంటుంది. ఆ సమస్య మనం తలపెట్టిన ఒక నూతన కార్యం కావచ్చు. లేక గత కాలంలో మనం చేసిన కర్మ వలన ఏర్పడిన దుష్ఫలితాలపై ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో శరీర ఆరోగ్యాన్ని గురించి కూడా ఉండవచ్చు.

ఈ ఆలోచన అనే ప్రక్రియ సాధారణంగా బాహ్య వాతావరణానికి సంబంధించి ఉంటుంది. ఏ పరిస్థితులలోను ఈ మనసు తన గురించి తాను ఆలోచించదు. ఈ ఆలోచన జీవితంలో జరిగే ఒడిదుడుకుల గురించి కాని, కొన్ని కోరికల గురించి కాని జరుగుతుంది. బాహ్యాన్ని గురించి జరిగే ఈ చింతన ప్రక్రియనే ఆలోచన అంటాం. కాని ఈ ఆలోచన ప్రక్రియ మనలోపల ఉన్న మనసులోనే జరుగుతుంది. మనకు కొన్ని సందర్భాలలో ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకనపుడు బాగా అనుభవం ఉన్న, మనకు సన్నిహితుడైన వ్యక్తిని ఆ సలహా మనకు నచ్చితే దానిని పాటిస్తాం. ఈ ప్రక్రియ సహజంగా లోకంలో జరిగేదే.

మనసే ఒక లోచనం
ఆలోచన అనే పదంలోనే 'ఆ' అంటే ఎక్కడో దూరంగా మనకన్నా భిన్నంగా గాని మనకన్నా వేరుగా ఉన్నదాన్ని సూచిస్తుంది. ఆలోచనంలో ఉన్న 'లోచనం' అంటే కన్ను అని అర్థం. అంటే దీన్ని బట్టి చూస్తే మన మనసే ఒక కన్ను అనవచ్చు. ఈ మనసు అనే కన్ను ఎంత సేపటికి బయటకే పరుగెడుతుంది కాబట్టి దీన్ని ఆలోచనం అంటున్నాం. అంటే బాహ్యంగా ఉన్న విషయాన్ని మనలోనే ఉన్న మనసుతోనే చూస్తున్నాం.

ఇక మనకు తెలియని విషయాన్ని తెలియబరిచే వ్యక్తిని 'గురువు' అంటారు. కేవలం మనుషులే కాదే ఒక్కోసారి ఒక సంఘటన, పశువులు, పక్షులు, కొండలు, గుట్టలు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగా పరిశీలించి చూస్తే అందరి అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా గురువే అవుతుంది. దత్తచరిత్ర కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. ఏదేమైనా మనలోనే ఉండి మనను నడిపించే మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటున్నాం. అందువల్ల మన మనసును కూడా 'గురువు'గానే పరిగణించాలి.

అంతర్గత ప్రయాణం
సాధారణంగా వేదాంతం అనగానే మన పెద్దలందరూ నీలో నీవు చూడమని, నీ లోనికి నీవు ప్రయాణం చేయాలని చెబుతారు. శ్రీరమణ మహర్షుల వారు కూడా 'నీవు ఎవరో తెలుసుకో' అని పదే పదే చెప్పేవారు. మనకు సుపరిచితాలైన పదాలు రెండు ఉన్నాయి. 'అక్కడ', 'ఇక్కడ' అనేవి ఆ రెండు పదాలు. అక్కడ అనగానే మనకు దూరంగా ఉన్నదని తెలుసు. ఇక్కడ అంటే మనకు దగ్గర్లో ఉన్నదని కూడా మనకు తెలుసు.

ఈ దగ్గర అనే దాన్లో మన ఇంట్లో కావచ్చు, మనం కూర్చునే చోట పక్కన కావచ్చు, మన జేబులో కావచ్చు. అలాంటప్పుడు మనలో అని ఎందుకు అనకూడదు? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ విషయాన్ని ఉపనిషత్తు దర్శనం తెలియచేస్తుంది. పైగా మన మనసు అనేది మనలో ఉన్నదే కాబట్టి వారు చెప్పే సలహా లేక సూచన కూడా మనలో ఉన్నదేనని విదితమవుతుంది. అదే వేదాంతం కూడా బయట(నీకంటే వేరైన) ప్రపంచాన్ని చూడవద్దంటుంది. అంటే నీలో ఉన్న ప్రపంచాన్ని నిన్ను నీవే చూడమంటుంది. ఇదే సంగతిని జిడ్డు కృష్ణమూర్తి కూడా 'నీవే ప్రపంచం' అంటారు.

కాబట్టి నీలోనే ఉండి నీకు మార్గదర్శనం చేసే నీ మనసునే బాగా విచారించమనేదే మన పెద్దల ఉపదేశాలసారం. మనలో ఉండి మనలను నడిపించే మనసే తొలిగురువు. అయితే ఈ మనసు ఎల్లప్పుడు బయటి విషయాలకు పోయి పరుగులు పోతూ పిచ్చిపట్టిన కోతిలా పరుగెడుతుందే తప్ప ఒక్క క్షణం నిలకడగా ఉండదు. నిలకడగా ఉండే అలవాటు దీనికి లేదు. ఒకవేళ ఎవరైనా, ఎప్పుడైనా నిలువరించాలని ప్రయత్నం చేస్తే అప్పుడు మరీ వేగంగా గతాన్ని అనాగతాన్ని తలచుకుని వేగాన్ని మరింత పెంచుతుంది. కాబట్టి ఈ వేగాన్ని అభ్యాసవశాన వశపరుచుకోవలసిందే.

మనసు వేగాన్ని నియంత్రించడానికి మనసును దాని చేతనే ఆలోచింపచేయాలి. తదుపరి అభ్యాసవశాన క్రమంగా నిలకడకు తీసుకురావాలి. అంతేగాని మనము దానిపై నియంత్రించడానికి పట్టు బిగుస్తున్న కొద్ది అది మరింత వేగాన్ని పెంచి మొండికేస్తుంది. కాబట్టి దీనిని అభ్యాసం మాత్రమే చక్కదిద్దగలదు. దీనినే తటస్థీకరణ లేక సాక్షిణ్యం అంటారు. ఈ ప్రక్రియనే పెద్దలు 'లోచూపు' అంటారు. మరలా 'లోప్రయాణం', 'నీలోనికి నీవే ప్రయాణం' అనవచ్చు.

అంతేగాని లోచూపు అనగానే మన కనుగ్రుడ్లు లోపలివైపునకు తిప్పి చూడమని కానే కాదు. ఇది అసాధ్యం. సహజత్వానికి విరుద్ధం. మొత్తానికి తేలిందేమంటే మన మన మనసుతోనే మన మనసు చేసే చర్యలను, ఆ మనసు పుట్టుకను, దాని తారతమ్యాలను, దానికి ఉన్న అనేక స్థితులను బాగా పరిశీలించి పరిశోధించాలన్నదే ఈ లోని ప్రయాణం.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgxHHFrnna4MGTNLsWBv4T-LmeXQued76yAHm6xCgtcfNG2d2zw2XYk0TYRtdygpxdi0FIrBPv3ISd-nuNewMNdjrPd_p5lGFCThpaesWlhzbCDW1Luaze-0mIUxO-mFJizdY4zrE-HYLA/s1600/Pair5.JPG
మన మనసునేగాక మనసుకు మందిరంగా ఉన్న శరీరాన్ని గురించి, దాని అన్ని ప్రక్రియలను గురించి అనేక విధాలుగా పరిశీలించాలన్నదే దీని సారం. ముందుగా శరీరాన్ని, అందులో దాగి ఉన్న మనసు అనే ఆంతరిక ఉపకరణాన్ని నిశితంగా, తులనాత్మకంగా పరిశీలించి పరిశోధించాలి. చివరిగా ఒక సంతులన స్థితికి రావాలి. రమణులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి మహానుభావులే కాదు ఈ పుడమిపై మానవుడు పుట్టిన నాటి నుంచి మహామహులంతా ఉపదేశించిన వేద సారం ఇదే.

వేదంలో నుంచే వేదన
ఈలోచనం అంటే తనను, తన మనసును తన మనసు చేతనే పరిశీలించాలి. 'వేద' అనే పదంలోనుంచే వేదన అనే పదం పుట్టుకొచ్చింది. కాబట్టి వేదన నుంచి బయటపడాలంటుంది వేదం(వేదన=దుఃఖం). తనను తాను తెలుసుకున్నపుడు ఆ మనసు శాంతిస్తుంది. ఇది వేదనను అంతం చేసేది కాబట్టి దీనిని వేదాంతం అన్నారు. అంతేకాని వేదాంతం అనగానే మనకు అర్థమయ్యేది కాదని, అది ఒంటబట్టేది కాదని, దాని ఇది వయసు కాదని భూతద్దంలో చూసి భయపడవలసిన అవసరం లేదు.

స్త్రీల విషయంలో మరో ముఖ్యాంశం ఏమిటంటే వారు వేదాంత అర్హులు కారని ఒక వాదన ప్రజలలో బలంగా ఉంది. ఇది వాస్తవం కాదు. విద్యకు ఆది మాత, విద్యాప్రదాయిని సరస్వతి స్త్రీమూర్తి. ఈ సరస్వతీ మాతకు మరో పేరే గాయత్రి. వీరందరూ స్త్రీమూర్తులే కదా! ఈ విషయం మరువరాదు. అలాంటప్పుడు స్త్రీలకు విద్యాధికారం, వేదాధికారం ఎందుకు లేదు? మన మనసును గురించి, దానికి భవనమైన మన దేహాన్ని గురించి అంతఃశోధన జరిగినపుడు మన మనసు గురించి మరింత లోతైన అవగాహన ఏర్పడగలదు.

శరీరాన్ని, అందులో దాగి ఉన్న మనసు అనే ఆంతరిక ఉపకరణాన్ని నిశితంగా, తులనాత్మకంగా పరిశీలించి పరిశోధించాలి. చివరిగా ఒక సంతులన స్థితికి రావాలి. రమణులు, జిడ్డు కృష్ణమూర్తి వంటి మహానుభావులే కాదు ఈ పుడమిపై మానవుడు పుట్టిన నాటి నుంచి మహామహులంతా ఉపదేశించిన వేద సారం ఇదే.
- కర్ల సుబ్బారావు