Saturday, October 8, 2011

'దళిత అలలు' - కంకర చంద్రయ్య

నా పేరు కంకర చంద్రయ్య

 
















నేను కంకర చంద్రయ్యను. నల్గొండ జిల్లా, బీబీనగర్ దగ్గర్లోని ఎంకిర్యాల మా ఊరు. అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. అన్నాతమ్ముడు అక్క చెల్లెలు ఎవ్వర్లేరు. ఒంటరిని. ఊళ్లో ఎవరైనా అన్నం పెడుతుంటే వాల్లకు ఏవైనా పనులు చేసి పెట్టేవాన్ని. ఓ ఏడాది బర్రెలు కాశాను. ఓ ఏడాది ఆవులు కాశాను.

ఇంతలో నా పేరుగల్లోడే... చంద్రయ్యని వొచ్చిండు. వచ్చి 'నాల్గురూపాయల జీతంకి ఆవులకాడ కొలువున్నావూ కదా... ఏడు రూపాయలిస్తా నా దగ్గరికి రా' అన్నాడు. ఆశ గొప్పది. అప్పట్లో ఏడు రూపాయలంటే చాలా పెద్దమాట. ఆలోచించా. హైదరాబాదుకు బయలు దేరా. అప్పటికే పెళ్లయింది నాకు. అయినా ఒంటరిగా ప్రయాణం మొదలెట్టా.

కొడితే కొండలు పిండే...
నవాబు బహదూర్ యార్జెంగ్ బొంద రాయి కొట్టడంతో నా పని ఆరంభమయింది. ఆయనో ముస్లిం నవాబు. బహదూర్ యార్జెంగ్‌ను ముసిరాబాద్ జైల్లో బొంద పెట్టారు. నెమ్మదిగా రాయిపని నేర్చాను. చానా ఫాస్ట్‌గా.. ఫాస్ట్ అంటే...చానా ఫాస్ట్. చిన్నతనంలో నా కెవ్వరూ ఎదుర్రాకపోదురు. కొండలు పిండవ్వాల్సిందే. అది చూసి కొందరేమన్నారంటే 'భీముని గడియల్లో నువ్ సుత్తెపట్టుకున్నవ్..అందుకే ఇంత ఫాస్ట్ వున్నావ్' అంటూ పొగిడిటోళ్లు. తతిమాల్లు నాల్గు దెబ్బలు గొడితె పగలాలి.

నాకు ఒక్క దెబ్బలోపలే పగిలిపోవాలె. అట్లా కొన్ని రోజులు చేశాను. ఆడికెల్లి - ఈ ఇమాయత్‌సాగర్ రాయి గొట్టడానికి పోయిండ్రు. నేను కూడ వాళ్ళెమ్మట వెళ్లాను. మా గురువు సామేలు, అబ్రాం, పేతురు.. వాల్లంతా నా సన్నిహితునుకో. మేమంతా కలిసి పని చేసేవాళ్లం. ఎక్కడ పని ఉందంటే అక్కడికి పోవాల్సిందే.

సబ్ కాంట్రాక్టర్‌గా మొదలై...
దోస్తులతో కలిసి తిరగని చోటు లేదు. కొట్టని రాయి లేదు. రాయిచూరు, అల్లెల్లి, చిద్ధినూరు, బాస్వాడ పోయినం. ఆడ కొన్ని రోజుల్జేసిన. ఆడికెల్లి బోదన్ బోయిన. ఆడ కొన్ని రోజుల్జేసిన బోదన్ల రాయి గొట్టమంటే 'ఇయ్యాలొక్కటే దినం రేపు లేద'న్నాడు, నేను రాత్రింబవల్లు గొట్టి... ఓ నలభై కడియల్ దీసి రెండున్నరకొక కడియలెక్క వంద రూపాయల్దీసుకున్న. వందరూపాయలిచ్చి ఒక తిత్తి, ఒక సుత్తె ఒక గన్ను, ఒక గడ్డపార, ఒక ఇరవై మొలలు తీసుకొని ఆడ పని సురుజేసిన.

నేను బంజారిల్ పోయినం. గడ్డి దానయ్యని ఒక కాంట్రాక్టరుండే.ఆయనతాన సబ్‌కాంట్రాక్టరు నేను కూడా వొడ్డెరోల్లబెట్టి పన్జేయించాలని అమ్మలక్కలందరూ సుద్ధల్ధీసిచ్చారు. అవన్ని కుదవబెట్టి, కొన్ని పైసల్ దీసుకొని, వచ్చి ఆడబెట్టాను. అక్కడ పన్జేసి ఒక ఏడెనెమిదొందలు సంపాదించిన. నయాపూల్‌లో ఓ కాంట్రాక్టర్ -' కంకర చంద్రయ్య అంటే ఎవరు' అని వచ్చిండు. ఎందుకొచ్చినవంటె, 'కంకర గావాలె' అన్నడు. ఓహో.. నాకు గుర్తింపొచ్చింది. ఆ క్షణానే కంకర చంద్రయ్య అయిపోయా.

రాళ్ల దెబ్బల నుంచి 'రాకింగ్' జననం...
హైద్రాబాద్‌లో ఒక వెస్టన్‌స్టార్ కొత్తసైకిల్ - నూటయాభై రూపాలకి దీసుకున్న. కోటీ దగ్గర ఒక సింగోడు హోటలుండేది. పావలాకు నాలుగు పూరీలు. ఏకానిస్తే ఒక్కపూరీ, ఒక్క పూరీ తిని పన్జేసేది. మల్లా ఆకలేస్తే వచ్చి మల్లా ఏకానిచ్చి మల్లా తినేది. అంటే పావలిచ్చే పరిస్థితి కూడ లేదు. ఆ సైకిల్ మీదినే తిరుక్కుంట మాల్ అమ్మేది. అలా సొమ్ము పోగేసిన. రెండువేలెనకేసిన. లారీ ఒకటి కొన్నా. ఇక దాన్తోని పని... అది పోతా పోతనే పడి పోయేది. చాల కష్టపెట్టింది.

అయినా లాభమిచ్చింది. ఇట్ల ఒక లారీ అయింది. తరువాత రెండు, మూడు, నాలుగు... అలా పెరిగి పది లారీలయినాయి. హైదరాబాదుకు తొలి క్రషింగ్ మెషీన్ నేను తెచ్చా. ఇస్టోన్ క్రషర్, ఆరొందల మంది వడ్రోల్లు, ఇద్దరు క్రష్‌ర్ డ్రైవర్లు. ఆర్గురు హెల్పర్లు. ఓ... ఇక కంకరంటే మోగిపోయింది. డబ్బు బాగొచ్చింది. అప్పటికే నా దగ్గర ఏడెనిమిది లక్షలరూపాయ లున్నాయి. నేను చేస్తున్న కాంట్రాక్టు వేరే వాళ్లకు రెండు లక్షలకు అమ్మేసినా. ఏదైనా కొత్తగా చేద్దామనుకున్నా. అప్పుడే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఆక్షన్ అని తెలిసింది.

గుజరాతీలెవరో గెలిచారట. ఆక్షన్ అయిపోయింది. గెలిచినోడి దగ్గరకు పోయా. భూమి కావాలన్నా. ఎంత ఇస్తావన్నాడు. వందకు మరో రెండున్నర రూపాయలు కలిపిన. చల్ తీసుకో అన్నాడు. ఆరువేలు కట్టి సంధ్య 75 ఎం ఎం థియేటర్ స్థలం కొన్నా. సంవత్సరం తిరిగేసరికి థియేటర్ కట్టేసినా.

నిర్మాణ రంగంలోనూ...


సంధ్య థియేటర్ పూర్తయ్యాక ఒక్కో సినిమా హాలు కట్టుకుంటూ పోయా. కాలం మారింది. కంకర చంద్రయ్య ఎనిమిది థియేటర్లు ఓనరు మరి. ఇంతలో ఓసారి అక్కినేని నాగేశ్వరరావుతో 'ఏడంతస్థుల మేడ' అనే సినిమా తీశా. ఒక్క సినిమా నిర్మాతనయ్యా. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి బిజీ అయిపోయా. హైదరాబాదు, సికింద్రాబాదుల్లో వందల ఫ్లాట్లను కట్టించాను.

ఆదుకోమని వచ్చేవాళ్లకి సాయం చేశాను. కొన్నాళ్ల క్రితం మా పిల్లలేదో గడబిడ జేసి (సంధ్య థియేటర్స్ ఉన్న స్థలం)అమ్మమన్నారు. అమ్మితే రెండు వందల ఇరవైకోట్లు వస్తాయన్నారు. వెయ్యి కోట్లిచ్చినా నేనియ్యనయ్యా . నా హార్ట్ ఇది. ఇలాంటి ఆఫర్లు ఎన్నో చూశా. జీవితంలో కష్టపడ్డా. ఫలితమొచ్చింది.

( లెల్లె సురేష్ నిర్మించిన 'దళిత అలలు' డాక్యుమెంటరీ నుంచి)


No comments:

Post a Comment