Friday, November 25, 2011

ఆత్మజ్ఞాన సోపానం

ప్రతి మనిషి తన జీవన యానంలో మోయలేని 'భారాల్ని' మోస్తున్నాడు! ఏమిటా భారాలు? బంధాలు, భౌతిక వస్తు లాలసలు. ఇన్ని బరువులతో ప్రయాణిస్తే జీవితం ఏమంత సుఖంగా ఉంటుంది? తక్కువ సామాన్లు వెంట తీసుకెళితే ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మన జీవితానికి మాత్రం అన్వయించుకోలేకపోతున్నాం? భౌతిక అవసరాలు తీరినంత మాత్రాన శాశ్వత ఆనందం రాదు. ఆత్మసాక్షాత్కారంతో మాత్రమే అది సాధ్యం. మరి ఆత్మసాక్షాత్కారం కోసం మనం ఏం చేయాలి?

'నేను' అన్న పదంలోనే 'అహం' దాగివుంది. నేను అంటేనే స్వార్థం. ఇంతకీ నేనెవరినీ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే నా అస్తులు, నా బంధాలు అనే సమాధానాలు వస్తాయి. అంతేనా? నేను అంటేనే నేను మోస్తున్న బరువు అని అర్థం. ఈ బరువు మనల్ని కట్టిపడేస్తూ ఉంటుంది. మనల్ని మనలా బతకనివ్వదు. పక్షికున్న స్వేచ్ఛ మనిషికుందా? మనను మనం ప్రశ్నించుకుంటే లేదనే సమాధానం వస్తుంది. ప్రతి మనిషి నిత్యం జీవనయానం చేస్తూనే ఉంటాడు.

అయితే ఈ బంధాలు, భౌతిక వస్తు లాలసలు అనే భారాలు మనిషి తాను కోరుకునే స్వేచ్ఛా జీవితాన్ని పొందడానికి అవరోధాలుగా మారుతున్నాయి. మనం ఈ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి పది మందిలో గుర్తింపు పొందడానికి తహతహలాడుతుంటాం. మంచి స్థితిమంతునిగానో, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించో సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. దీన్నే జీవితంలో గొప్ప విజయంగా భావిస్తాం.

'నేను ఎవరిని' అని మనల్ని మనం ప్రశ్నించుకున్నపుడు సమాజంలో మనకున్న గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్ఠలను మాత్రమే పరిగణనలోకి మనం తీసుకుంటాం. మనం మోస్తున్న 'భారం' మన ఉనికిగా మారడానికే ఇష్టపడతాం. తాత్విక దృష్టిలో ఆలోచిస్తే 'నేను ఎవరిని ?' అన్న ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనను మనం ఆత్మపరిశీలన చేసుకోవలసి వస్తుంది.

నిజంగా 'నేను' నేనుగా, నా కోసమే నేను బతుకుతున్నానా అని ప్రశ్నించుకోవలసి వస్తుంది. "గతం, భవిష్యత్తు అంతా ఈ బంధాలతోనే సాగుతుంది. ఈ బంధనాల్లో చిక్కుకుని, నీలోపలకి నీవు తొంగి చూసుకునేదెప్పుడు? అలా చూడలేనంత కాలం దివ్య జ్ఞానజ్యోతి మనకు గోచరించదు. ఈ 'భారాన్ని' మోస్తున్నంత కాలం నేను నేను కాదన్న వాస్తవం బోధపడుతుంద''ంటారు భగవాన్ రమణమహర్షి.

ఆరాటం వదిలితే ఆత్మజ్ఞానం

ఆత్మజ్ఞానం కలిగిన రోజున నేను ఎవరిని అన్న ప్రశ్నకు నేను అనేది ఒక శూన్యంలా కనిపిస్తుంది. ఇహలోకంలో మోస్తున్న భారాన్ని తొలగించుకుని చూస్తే ఒక ప్రకాశవంతమైన జ్ఞానలోకం గోచరిస్తుంది. నేను అనే అహాన్ని విడనాడిన రోజున మనల్ని మనం నిమిత్తమాత్రులుగా పరిగణించుకుంటాం. మీలోని అహాన్ని తొలగించుకోండి. నిన్న ఏమి సాధించాం అని ప్రశ్నిచుకోండి. రేపు ఏదో సాధించాలనే ఆరాటాన్ని వదులుకోండి. అదే ఆత్మసాక్షాత్కారానికి తొలిమెట్టు.

అయితే, భవబంధాలు అనే భారాన్ని వదిలించుకోవడం అంత సులభమా? చెప్పినంత తేలికగా బంధాలను తెంచుకోగలమా? అయితే భౌతికపరమైన అవసరాలను, వాంఛలను విడనాడి ఆధ్మాత్మిక భావన ఏర్పరుచుకోవడం కష్టమైన కార్యమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. ఒక్కసారి ప్రాపంచిక దృక్కోణాన్ని విడనాడి చూడండి. ఎంతటి స్వేచ్ఛావాయువుల్ని పీల్చగలరో మీకే అర్థమవుతుంది. ఆ భారం వదిలిన మరుక్షణం మీ మనసు దూదిపింజలా మారిపోతుంది. పక్షి లాగే మీ ప్రయాణం తేలికవుతుంది.

మానవ వేదనలకు మూల కారణం ఈ భవబంధాలే అని అర్థం చేసుకోలేక మనిషి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుపోతున్నాడు. మనం మనకోసం బతకాలి. ఇతరులు మన గొప్పతనాన్ని గుర్తించేందుకు బతకాల్సిన పనిలేదు. ఈ అవగాహన వచ్చినప్పుడు ప్రాపంచిక విషయాలు తృణప్రాయంగా మారతాయి. "తనను తాను అర్థం చేసుకోనంతవరకు మనిషి వేదనలను అనుభవిస్తూనే ఉంటాడు. అది అర్థం అయిననాడు మనిషికి సంపూర్ణంగా జ్ఞానోదయం అవుతుంది'' అంటారు ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి.

ధ్యానం అంటే మనసును ఒక లక్ష్యంపై తదేక దృష్టితో గురిపెట్టడం. శరీరం నిశ్చేతనా అవస్థలో ఉన్నప్పటికీ మనసు మాత్రం ఒక అంశంపైనే కేంద్రీకరించడం. మొదట్లో భిన్న ఆలోచనలు ధ్యానయోగాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినపుడే ధ్యానయోగం సిద్ధిస్తుంది. అదే ఆత్మజ్ఞాన సాధనకు సోపానం.

ధ్యానమార్గం ఉత్తమం

ఈ బంధాల భారం తెంచుకోవడం మొదట్లో బాధాకరంగానే ఉంటుంది. గాయం అయినపుడు నొప్పి సహజమే కదా! అది మానుతున్న కొద్దీ నొప్పి కూడా క్రమంగా మటుమాయమవుతుంది. మనిషిలో స్వార్థ చింతన దూరం కానంతవరకు ధ్యానంలో ఏకాగ్రత కూడా సాధ్యపడదు. లక్ష్యంపై గురి కుదరాలే తప్ప దాని వల్ల లభించే ప్రయోజనాల గురించి చింత ఏర్పడినపుడు లక్ష్యఛేదన కూడా సాధ్యపడదు.

ఏదైనా సాధించాలని సంకల్పించినపుడు మన దృష్టి ఆ లక్ష్యంపైనే ఉండాలి. కాని ధ్యాస దారిమళ్లితే లక్ష్యమార్గం కూడా తప్పుకుంటుంది. ధ్యానం అంటే మనసును ఒక లక్ష్యంపై తదేక దృష్టితో గురిపెట్టడం. శరీరం నిశ్చేతనా అవస్థలో ఉన్నప్పటికీ మనసు మాత్రం ఒక అంశంపైనే కేంద్రీకరించడం. మొదట్లో భిన్న ఆలోచనలు ధ్యానయోగాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తాయి. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగినపుడే ధ్యానయోగం సిద్ధిస్తుంది.

ఆనందమార్గం

లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు దృష్టంతా లక్ష్యం వైపే ఉండాలి తప్ప దాని వల్ల లభించే ప్రయోజనాలపైన ఉండకూడదు. ఇందుకో చక్కని ఉదాహరణ చెప్పుకుందాం. ఒక గొప్ప విలుకాడు ఏ విధమైన ప్రయోజనాలు ఆశించకుండా బాణం సంధించినపుడు అదే సూటిగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అదే ఒక వెండి నాణాన్ని ఆశించి సంధిస్తే అతని చేతులు వణుకుతాయి. బంగారు నాణెం కోసం సంధించినపుడు అతని కళ్లు బైర్లుకమ్ముతాయి. కంటికి ఏమీ కనపడదు. అతని మెదడు పనిచేయదు.

ఇక్కడ మనం చూడాల్సిందేమిటంటే విలువిద్యలో అతని ప్రావీణ్యం చెక్కుచెదరలేదు. తప్పంతా అతని దృష్టి వచ్చే బహుమానం మీద ఉండడమే. అతను బాణం గురితప్పకుండా కొట్టాలి అని ఆలోచించడం మానివేసి సాధించబోయే బహుమానం గురించి ఆలోచించాడు..అందుకే అది గురి తప్పింది. అందుకే స్వార్థ చింతనకు స్వస్తి చెబితే నిజమైన ఆనందాన్ని పొందగలం. మనం సాధించామనుకుంటున్న విజయాలు అవి భౌతికంగా మన అవసరాలను తీర్చేవే తప్ప మనలోని ఆత్మను సంతృప్తి పరచవని గ్రహించాలి.

ఈ విజయాలు మనలోని అహాన్ని పెంచడంతోపాటు బంధాలను బలపరిచి వాటితో మనల్ని కట్టిపడేస్తాయని తెలుసుకోవాలి. ఏకాగ్రతతో ధ్యానం చేయడం వల్ల ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుంది. ధ్యానం నిరంతర ప్రక్రియగా సాగాలి. అది సాధించిన నాడు నిన్ను నువ్వు తెలుసుకోగలవు. అప్పుడే ఆనందకరమైన స్వేచ్ఛాయుత జీవితం అనుభవంలోకి వస్తుంది. భారతీయ తాత్త్విక చింతన మొదటి నుంచి చెప్పేది ఇదే. భౌతిక విషయాల వివేచనను వదిలేసి, ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నించాలనేదే ఆది శంకరులు మొదలుకుని, అరవిందుల దాకా అందరూ చెప్పింది. ఆచరించి చూపింది. రండి. మనమూ... ఆత్మవివేచన దిశగా అడుగులు వేద్దాం. అనందమయ జీవితానికి తలుపులు తెరుద్దాం.