Wednesday, July 6, 2011

ఫా ....... రెస్ట్

ప్లేట్‌లో ఇంత కంకర, సిమెంట్, ఇసుక కలుపుకుని తిని లేస్తున్నట్లు తయారయింది మనిషి జీవితం!
నెమ్మది లేదు, నిమ్మళం లేదు, ప్రశాంతత లేదు.
పచ్చదనం లేదు, పరామర్శలేదు, బతుకుబాటలో ఒకటే పరుగు.
వాహనాల మధ్య పరుగు, పెట్రోల్ తాగినట్లు పరుగు!
‘ఇది కాదు జీవితం’ అనుకున్నాడు విజయకుమార్.
ఇల్లు వాకిలి వదిలి, భార్యాపిల్లల్ని వదిలి...కొన్నాళ్లు అడవిలోకి వెళ్లిపోయాడు!
‘మనిషి’గా తిరిగొచ్చాడు.

ఏమిటీ మనిషి?
మనిషి కావడం ఏమిటి?


ప్రకృతిలో సహజసిద్ధంగా ఉండేది ఏదైనా మనసును అల్లుకుపోతుంది. అనుభూతింపజేస్తుంది. దానిని పోలి ఉండే రూపాలు మనం ఎన్ని సృష్టించుకున్నా చిట్టి చిగురు ముందు అవన్నీ చిన్నబోయేవే. ఎటు చూసినా కాంక్రీట్ వనాలు.. రణగొణధ్వనులు... మనల్ని మన నుంచే దూరం చేసే ఈ చికాకులను తప్పించుకుంటూ, స్వచ్ఛమైన అనుభూతిని వెతుక్కుంటూ మనతో మనం ఉండేచోటుకి వెళ్లిపోతే- ఈ ఆలోచన చాలా మందికి చాలాసార్లు వచ్చుంటుంది. కాని ఆచరణలోకి తెచ్చే ధైర్యం మాత్రం ఒక్క విజయ్‌కుమార్ లాంటి వాళ్లకు మాత్రమే ఉంటుంది.‘ఆ ఆలోచనే నన్ను అడవి బాట పట్టించింది’ అని చెప్పారుమెదక్‌జిల్లా పెద్దశంకరం పేట మండలానికి చెందిన విజయ్‌కుమార్ (35).

సెలవులు వస్తే ఎవరమైనా ఏమాలోచిస్తాం? ఊళ్లో ఉన్న బంధువుల ఇళ్లకో, స్నేహితులను కలవడానికో లేదా సకుటుంబ సపరివారంగా ఏ విహారయాత్రకో ప్లాన్ చేస్తాం. వీటికి భిన్నంగా విజయ్ వేసవి సెలవులను అడవిలో గడపాలనుకున్నారు. అదీ ఒంటరిగా. ఎందుకలా? అని ప్రశ్నించేవాళ్లకి తన వన విహారం గురించి ఆయన వివరిస్తుంటే ఒక్కసారైనా అడవితల్లి పొత్తిళ్లలో సేదతీరాలి అన్న తలంపు కలగకమానదు. తొమ్మిదేళ్ల్లుగా ఉపాధ్యాయవృత్తిలో కొనసాగుతున్న విజయ్‌కుమార్ మొన్నటి వేసవి సెలవుల్లో (మే 6 నుంచి మే 27 వరకు) అరణ్యవాసం చేయడం ద్వారా సమ్‌థింగ్ స్పెషల్ అయ్యారు. తనను తానే తోడుగా తీసుకుని పంచవటి అరణ్యానికి వెళ్లి, వచ్చిన విజయ్‌కుమార్‌తో ముచ్చటించినపుడు... ఎంతో ఉత్సాహంగా తన వనవాసపు విశేషాలను చెప్పారు.


అరణ్యవాసం ఆలోచనకు నేపథ్యం...

‘మూడేళ్ల క్రితం స్నేహితునితో కలిసి శ్రీశైలం, అక్కడ భీముని కొండకు కాలినడకన వెళ్లాను. ఆ తర్వాత తిరుపతి ఆయుర్వేద ఔషధవనంలో తిరిగాను. అప్పుడు వన సౌందర్యం గురించిన కవుల వర్ణనలు కళ్లకు కట్టాయి. అలాగే మా ఊరికి ముప్పైకిలోమీటర్ల దూరంలో పంచవటి (పంచగ్రామ అని కూడా అంటారు) అనే పేరున్న ఒక అటవీ ప్రాంతం ఉంది. ఆ అడవిలో ఉన్న శనీశ్వరాలయానికి వెళ్లినప్పుడు ఆ పరిసర ప్రాంతాలను చూశాక... అనిపించింది ఇంతటి అద్భుతమైన ప్రపంచాన్ని వదిలి దేనికోసం పరుగులు పెడుతున్నాను? అని. అప్పటి నుంచే మనసులో ఓ ఆలోచన... ‘కొన్నిరోజులైనా వన సౌందర్యాన్ని ఒంటరిగా ఆస్వాదించాలని. అందుకు ఈ వేసవి సెలవులు కలిసివచ్చాయి’ అంటూ అడవికి వెళ్లడానికి, అక్కడ ఉండాలన్న ఆలోచన నేపథ్యాన్ని వివరించారు. ఈ విషయం చెప్పగానే తల్లి, తండ్రి, భార్య మిగతా కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆయన్ను ఆపాలని చూశారు. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని హెచ్చరించారు. అయితే అప్పటికే అడవి అంటే విపరీతమైన ఇష్టాన్ని నింపుకున్న విజయ్‌కుమార్ అవేవీ పట్టించుకోలేదు. తను అనుకున్నట్టుగా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ‘నా పిల్లలు చిన్నవాళ్లు. ఉదయం వెళితే సాయంత్రానికే ఎప్పుడెప్పుడు వారిని చూస్తానా అని ఎదురుచూసే నాకు వాళ్లను వదిలి ఉండటం ఒకింత కష్టమే అనిపించినా ప్రకృతిమాతతో కలిసి ఉండాలనే ఇష్టం ముందు అన్నీ తలవంచాయి’ అన్నారు.

ఒంటరిగా... ప్రకృతి ఒడిలో...
పదికేజీల బియ్యం, రెండు కేజీల పప్పు, కొద్దిగా ఉప్పు, కారం, రాగిపిండి, రెండు గిన్నెలు, రెండు పంచెలు, ఒక తువ్వాలు, దేవీభాగవతం... వీటితోనే పంచవటికి పయనమయ్యారు విజయ్. వేకువజామునే బయల్దేరడంతో త్వరగానే ప్రకృతి ఒడిలోకి చేరుకోగలిగారు. ముందుగా శనీశ్వరాలయానికి వెళ్లి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జనజీవనానికి సంపూర్ణంగా దూరమయ్యాననుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. ‘ఆలయ పూజారికి నా విషయం చెప్పినప్పుడు అతను చూసిన వింత చూపు ఇప్పటికీ గుర్తొస్తుంటుంది’ అంటూ నవ్వేసిన విజయ్ అడవి అనుభవాలను ఇలా వివరించారు...

‘‘ఆలయప్రాంగణంలో నా బ్యాగు ఉంచి చెరువు దగ్గరకు వెళ్లాను. చెరువులో స్నానం చేసేసరికి ఏదో మోయలేనంత భారం ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపించింది. ప్యాంట్, షర్ట్ నుంచి పంచె, తువ్వాలులోకి మారి... శనీశ్వరునికి దణ్ణం పెట్టుకొని పొయ్యి రాళ్లు సెట్ చేసి, కట్టెలు పోగేసాను. అంబలి కాచుకొని తాగి అక్కడ నుంచి అడవి లోపలికి వెళ్లిపోయాను. అలా నా వన దీక్ష ప్రారంభమైంది. పచ్చని దృశ్యాలు, కొండరాళ్లు, వందలకొద్ది నెమళ్లు, అవి చేసే నృత్యాలు... ఎండ కన్నుపడకుండా భూమాతకు గొడుగు పట్టినట్టున్న పొడవాటి చెట్లు, వాటి ఆకుల సందుల్లో నుంచి నేలను తాకే రవి కిరణాలు.. అబ్బురంగా తిలకిస్తూ ఎంత దూరం, ఎంత సేపు ప్రయాణించానో తెలియదు. అనువైన చోటు చూసుకొని ధ్యానానికి కూర్చున్నాను.


ధ్యానంలో మునిగి తిరిగి లేచేసరి చీకటి పడింది. వచ్చేటప్పుడు గుర్తులు పెట్టుకున్న సూచికల ఆధారంగా గుడికి చేరుకున్నాను. మళ్లీ చెరువులో స్నానం చేసి పొయ్యి వెలిగించి గిన్నెలో గుప్పెడు బియ్యం, కొద్దిగా పప్పు, ఉప్పు, కారం, నీళ్లు పోసి ఉడకబెట్టాను. ఆ గుడి దీపం వెలుతురులోనే తిని, కాసేపు దేవీ భాగవతాన్ని పఠించి పడుకున్నాను. అర్థరాత్రి సమయంలో మెలకువ వచ్చి చూస్తే కళ్ల ముందు అద్భుతం... అవి పౌర్ణమి రోజులు కావడంతో అడవంతా వెన్నెల... ఆ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. చెప్పలేనంత ఆనందం’’ అంటుంటే ఆయన ముఖంలో అప్పటి అనుభవం తాలూకు మెరుపు. అత్యంత భారీసైజులో ఉన్న గుడ్లగూబను చూడడం వంటి కొన్ని మేను జలదరించే జ్ఞాపకాలూ ఈ అటవీ విహారం ఆయనకు అందించింది.

మొక్కలు చెప్పిన పాఠాలు

అడవిలో చెట్ల మధ్య, హాయిగొలిపే గాలిలో ఒకసారి పట్టణం విజయ్‌కు గుర్తొచ్చింది. చెట్లను కొట్టి, బిల్డింగ్‌లు కట్టుకొని, బోనస్‌గా వచ్చే రకరకాల రుగ్మతలకు లోనై, వాటిని నయం చేసుకోవడానికి పడరాని పాట్లు పడే వారు గుర్తొచ్చారు. అడవిలో ఎన్నో ఔషధ మొక్కలు... ఆ గాలికి దూరమయ్యాం కనుకే ఎన్నో జబ్బులు బాధపెడుతున్నాయి అనిపించింది. ఆయుర్వేదంలోనూ ప్రవేశం ఉండడటం వల్ల ఏ మొక్క ఏ జబ్బును నయం చేస్తుందో తెలుసు. వాటి గొప్పతనం స్కూల్లో పిల్లలకు పరిచయం చేయడానికి కొన్ని అరుదైన ఔషధ మొక్కలను సేకరించానన్నారాయన. ఈ 21 రోజుల వనవాసం వల్ల ఆయనకు బోనస్‌గా కలిగిన మరో లాభం... ఏడు కిలోల బరువు తగ్గడం. ఆ స్వచ్ఛమెనగాలి, ఆ కల్మషరహితమైన నీరు, ఆ పచ్చని నేల ఇచ్చిన బలం మరో ఏడాది దాకా సరిపోతుంది. ఆ జ్ఞాపకం మాత్రం నూరేళ్ల దాకా నిలిచి ఉంటుంది అని చెప్తారు విజయ్‌కుమార్. ప్రస్తుతం ఆయన మొక్కల పెంపకంలో పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.

‘కుటుంబంలో ఎంత మంది ఉంటే అన్ని మొక్కలు నాటుదాం. తరిగిపోతున్న అడవులను కాపాడుకుందాం. మనల్ని మన నుంచే వేరు చేసే కాలుష్యానికి అడ్డుకట్ట వేద్దాం లేలేత చిగుర్లు తొడుకున్న మొక్క, ఉషోదయం వేళ మంచుబిందువుల్లో తడిసిన పువ్వును చూస్తే కలిగే అనుభూతిని భావి తరానికీ అందిద్దాం’ ఇది విజయ్‌కుమార్ పాఠాల్లో ఇక ఎప్పుడూ ఒక భాగంగానే ఉంటుంది. మరోవైపు ఈ 21 రోజుల అరణ్యవాసం ఆయన మదిలో చెరిగిపోని జ్ఞాపకంలా నిలిచే ఉంటుంది. భావితరాలకు వనం-మనం అనే స్ఫూర్తిని కలిగిస్తూ ఆయనతో పాటు పయనిస్తూనే ఉంటుంది.

అడవిలో ఉన్న మూడు వారాలూ విజయకుమార్ మెడలోతు దాకా చెరువు నీళ్లలో నిల్చొని పద్యాలను శ్రావ్యంగా పాడటం సాధన చేశారు. రోజూ నాలుగైదు గంటలు ధ్యానం, ప్రకృతి ఆస్వాదన, ఒంటిపూట భోజనం.. ఇదీ ఆయన దినచర్య. అరణ్యవాసం పూర్తి చేసి బయటికి వచ్చీ రాగానే మొదట ఆయన చేసిన పని... ఫోన్ ఆన్ చేసి తన తల్లితో మాట్లాడ్డం.
- నిర్మలారెడ్డి