Wednesday, September 22, 2010

1+1+1 = 4 ?


సీనియర్ కేజీ క్లాస్‌రూమ్.
టీచరు లెక్కలు నేర్పిస్తోంది చిన్నారి పొన్నారి బాల బాలికలకు.
ఒక ముద్దొచ్చే కుర్రాడి వద్దకి వెళ్లి 'నేను నీకు ముందో యాపిల్ ఇస్తాను. తర్వాత ఇంకోటి, ఆ తర్వాత మరొకటి. నీ దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉంటాయి?' అని అడిగింది టీచరు. ఆ కుర్రాడు ఐదారు సెకండ్లు ఆలోచించి 'నాలుగు' అన్నాడు.

టీచరు ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్ల బట్టి మనసు లగ్నం చేసి పిల్లలకు ఎంతో ప్రేమగా, వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు నేర్పుతుంటే, ఇదేంటి ఈ బాలుడు ఇంత సులభమైన ప్రశ్నకి 'మూడు' బదులు 'నాలుగు' అని చెప్పాడు అనుకుని ఒకింత నిరుత్సాహపడింది.

కుర్రాడు సరిగ్గా విన్నట్లు లేదు, మళ్లీ అడుగుదామనుకుని బాబు జాగ్రత్తగా విను. నీకు ముందుగా ఒక యాపిల్ ఇచ్చాను. ఆ తర్వాత మరొకటి, మళ్లీ ఇంకొకటి. నీ దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉంటాయో సరిగ్గా ఆలోచించి ఈ సారి కరెక్టుగా చెప్పాలి అంది టీచరు ఎంతో లాలనగా..

కుర్రాడు టీచరు ముఖంలో ప్రస్ఫుటంగా కనబడుతున్న నిరుత్సాహాన్ని చూచాడు. వేళ్లమీద లెక్కపెట్టాడు, నెమ్మదిగా, ఎంతో జాగ్రత్తగా.. ఈ సారి టీచరుకు కరెక్టుగా సమాధానమివ్వాలనే పట్టుదలతో, మళ్లీ మరోసారి లెక్కపెట్టాడు 'నాలుగు' అని మెల్లగా సంకోచిస్తూ చెప్పాడు. మరింత నిరాశ ప్రస్ఫుటంగా కనబడుతోంది టీచరు వదనంలో.

ఏం చేయాలో పాలుపోలేదు టీచరుకి. కుర్రాడు తెలివి కలవాడు, క్లాసులో ఫస్టు వస్తాడు, మరేమిటీ విచిత్రం ఈ రోజున ఇంత చిన్న ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడు. బహుశా ఈ కుర్రాడికి యాపిల్స్ అంటే అయిష్టమేమో అందుకని మనస్సు లగ్నం చేయలేకపోతూ, సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నాడేమో అనుకుని ఈ సారి మరో విధంగా అదే ప్రశ్న వేసింది.

బాబూ ఈసారి నిజంగా నీవు జాగ్రత్తగా విని సమాధానం చెప్పాలి సుమా. నీకు మొదటగా నేనే ఒక స్ట్రాబెరీ ఇచ్చాను. మళ్లీ మరో స్ట్రాబెరీ, ఆ తర్వాత ఇంకొకటి, నీ దగ్గర ఎన్ని స్ట్రాబెరీలు ఉన్నాయి.?

టీచరు ప్రశ్న మార్చి వేసినందుకు ఉత్సాహంగా ఉంది. కుర్రాడు కొంచెం భయంభయంగా ఉన్నాడు. చేతి వేళ్లతో ఒకటికి రెండు సార్లు లెక్కపెట్టి సందేహాత్మకంగా "మూడా'' అని ప్రశ్నిస్తున్నట్లుగా చెప్పాడు.

టీచరు ముఖంలో సంతోషం. ఆఫ్ట్రాల్ తాను చెబుతున్న చదువు వృధా కావటం లేదు అనుకుని మళ్లీ అంది కుర్రాడితో. శభాష్ కరెక్ట్ ఆన్సర్.
ఈ ప్రశ్నకు కూడా సరైన సమాధానమివ్వాలి. యస్ టీచర్, నీకు ముందుగా ఒక యాపిల్ ఇచ్చాను, తర్వాత ఇంకొకటి, మళ్లీ ఇంకొకటి. మొత్తం ఎన్ని యాపిల్స్ ఉంటాయి నీ దగ్గర.. ఠక్కున చెప్పాడు కుర్రాడు 'నాలుగు' అని. 'ఎలాగో చెప్పు' అంది టీచరు, కొంచెం కఠినంగా, గద్దిస్తున్నట్లుగా. నెమ్మదిగా భయంభయంగా వినీ వినపడ నట్లుగా అన్నాడు టీచరుతో " నా దగ్గర ఒక యాపిల్ ఉంది మేడమ్.''

కథలోని సారాంశమేమిటో ఊహించారా ? మనం ఊహించని సమాధానం ఎదుటి వారి నుంచి వస్తే అది తప్పు కానవసరం లేదు. వాళ్ల కోణం నుంచి మనం చూడలేకపోతూ ఉండవచ్చు. వాళ్లు చెప్పేది విని, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పడికట్టు విధానాన్ని ముందుగా నిర్ణయిం చుకొన్న నమ్మకాన్ని దూరంగా ఉంచితేనే అది సాధ్యపడేది.

'ప్రి-డిటర్మినెడ్ నోషన్' అంటూ ఉంటాం. అంటే చాలా విషయాల్లో ముందుగానే కొన్ని అభిప్రాయాలతో, నమ్మకాలతో ఉంటాం మనం. ఇది చెయ్యచ్చు, అది చేయకూడదు. తండ్రి ఇలా ఉండాలి. కొడుకు అలా నడుచుకోవాలి. ఆఫీసు ఇలా ఉండాలి. వ్యాపారం అలా నడవాలి. వగైరా వగైరాలు. చాలా విషయాల్లో ఒక నిశ్చయమైన అభిప్రాయానికి ముందుగానే వచ్చేస్తాం.

వాటిల్లో ఏదైనా మార్పు జరిగినా మనం ఏమైనా కొత్త కొత్త ప్రయోగాలు చేసినా వింతగా చూస్తుంది లోకం. వీడికి బుర్రుందా అసలు అనే విధంగా ప్రవర్తిస్తుంది మనతో. నాకదే జరిగింది. 1980లో హెడ్ క్వార్టర్స్ బాంబే, నేటి ముంబై. చిన్నా పెద్దా అన్ని అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు బాంబేలోనే ఏర్పడ్డాయి. అక్కణ్ణుంచే విస్తరించాయి. పేరు ప్రఖ్యాతులున్న అడ్వర్‌టైజింగ్ మేధావులందరూ బాంబేలోనే నివాసమేర్పరచుకున్నారు.

వీరిలో ఎక్కువ శాతం మంది కాన్వెంట్స్‌లో చదువుకున్నవాళ్లు, శ్రీమంతుల కుటుంబాలకు చెందిన వాళ్లు, ఇంగ్లీషు నాటకాల్లో పాత్రధారులు, డైరెక్టర్లు. పాశ్చాత్య పోకడలను పూర్తిగా జీర్ణించుకొని ఆ జీవన విధానాన్ని అనుసరిస్తున్నవారు. అంతేకాకుండా వారి మాతృభాష ఇంగ్లీషులోనే. ఆలోచనా రీతి, రాసే భాష ఇంగ్లీషే. స్థూలంగా 1980 దశకం నాటి అడ్వర్‌టైజింగ్ రంగం రూపురేఖలివి.

నేటి పరిస్థితులలో కూడా గొప్ప మార్పేమి కనబడదు. ఒకరో, ఇద్దరో మినహా ఆ రంగానికి చెందిన దిగ్గజాలం దరూ పాశ్చాత్య జీవన విధానానికి అలవాటైన వారే అంతెందుకు 2003లో నేను ముద్రా నుంచి నిష్క్రమిం చాక, అందాకా 23 ఏళ్లపాటు అహ్మదాబాదులో ఉన్న ముద్రా హెడ్‌క్వార్టర్స్ ముంబైకి మారి పోయింది. వీటినే పడికట్టు విధానాలు, నమ్మకాలు అనేవి.

అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీ అంటే ముంబైలోనే ఉండాలి. అడ్వర్‌టైజింగ్ రంగంలో నిలదొక్కుకోవాలంటే పాశ్చాత్య జీవనశైలిలో ప్రావీణ్యముండాలి. 'కాక్‌టైల్స్' ఎలా కలపాలో నేర్చుకోవాలి. అంతేకాదు, వాటి గురించి అనర్గళంగా గంటల తరబడి చర్చించగలగాలి. ఐదు నక్షత్రాల హోటళ్ల జీవిత శైలికి పూర్తిగా అంకితమవ్వాలి. ఆడామగా తేడా లేకుండా స్మోకింగ్, డ్రింకింగ్ చేయాలి. ఆడవారు క్రాఫులు చేయించుకోవాలి. మగవారు జడవేసుకోవాలి. పైగా చెవులకు పోగులు, రింగులు ఉండాలి. ఇలా ఎన్నో నమ్మకాలు, విధానాలు. ఇది మంచా చెడా అని నేను నిర్ణయించటం లేదు. అది నా బాధ్యత కాదు. చెప్పొచ్చేదేమిటంటే మనలో కొన్ని అభిప్రాయాలు. నమ్మకాలు జీర్ణించుకుపోయాయి. పనులు జరగాలనే నిర్ణయానికి ముందే వస్తాం.

1980లో ముద్రాను నేను అహ్మదాబాద్‌లో స్థాపిస్తే నవ్వని వారు లేరు. ఇదో ప్రపంచపు సరికొత్త వింతలా గోచరించింది. ఇది నడిచే సంస్థ కాదని, అందరూ ఒక నమ్మకానికొచ్చేసారు. పడికట్టు ఆలోచనలు, విధానాలే దానికి మూలకారణం. పైగా ఆనాటి అహ్మదాబాద్‌లో అడ్వర్‌టైజింగ్ రంగానికి సంబంధించిన ఎలాంటి వనరులు, వసతులు లేవు. రచయితలు కాని, మోడల్స్ కాని, ఫిల్మ్ నిర్మాతలు, డైరెక్టర్లు గాని, ఆ రంగానికి కావాల్సిన ఇతర నిపుణులు కాని ఎవ్వరు లేరు. ఆ రంగానికి పూర్తిగా ఎడారి ప్రాంతం. అలా మొదలైన ప్రస్థానం తొమ్మిదేళ్లలో ఒక ప్రభంజనంగా మారిపోయింది.

దేశంలోనే అతి పెద్ద అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీగా రూపుదిద్దుకొంది. బహుళ జాతి ఏజెన్సీలను కూడా కలుపుకుంటే, దేశంలోని మూడో ర్యాంకు ఏజెన్సీగా ఎదిగింది. వందల్లో పురస్కారాలు. ఆ రంగానికి చెందిన అన్ని పురస్కారాలు నాకు దక్కినాయి.

అంతేకాదు విమల్, రస్నా, సింఫనీ ఎయిర్‌కూలర్, ధారా రిఫైన్డ్ ఆయిల్, గోద్రెజ్, శాంసంగ్.. ఇలా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసింది ముద్రా.

1991లో దేశంలో కమ్యూనికేషన్ రంగంలో మొట్టమొదటి ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పింది. దాని పేరు ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాద్- క్లుప్తంగా మైకా అంటారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన విద్యాసంస్థ అది నేడు.

1980 దశకంలో గుజరాత్‌లోని ప్రతి చిన్నా పెద్ద వ్యాపార సంస్థలకు తమతమ అడ్వర్‌టైజింగ్ అవసరాల కోసం ముంబైలోని ఏజెన్సీలను వినియోగించుకునేవారు. ముద్రా స్థాపన జరిగాక వారి ముంబై ప్రయాణాలు ఆగిపోయాయి. దాదాపు అన్ని పెద్ద వ్యాపార సంస్థలతో ముద్రా పనిచేసే అవకాశాలను చేజిక్కించుకుంది.

అంతేకాదు 1993 నుంచి అడ్వర్‌టైజింగ్ రంగంలోని ఉద్దండులు మైకా రావటం మొదలుపెట్టారు అక్కడి విద్యార్ఢులకు విజిటింగ్/గెస్ట్ ఫ్యాకల్టీగా. ఇక విద్యార్ధులయితే దేశంలోని నలుచెర గుల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా రావటం మొదలు పెట్టారు. ఇదో పెనుమార్పే కదా. ఏమిటీ రహస్యం. పడికట్టు ఆలోచనలకు, విధానాలకు స్వస్థి చెప్పటంతోనే అన్ని విజయగాథలు మొదలయ్యేది.

కృషి, విక్రమార్కుని పట్టుదల.. అపజయాల్ని ఎదుర్కొని పోరాడటం.. ఇలాంటి సూత్రాలు, పద్ధతులే మనకు ఆయుధాలుగా మారేది. ఈ సూత్రాలు పద్ధతుల్లోకి మరింత వివరంగా వెళ్దాం వచ్చేవారం నుంచి గమనిస్తే జీర్ణించుకుపోయిన నమ్మకాన్ని, పద్ధతుల్ని పక్కకు నెట్టి అబ్బురపరిచే విజయాలతో పిన్న వయసులోనే మనకి మార్గదర్శకులైన వారు ఎందరో.

మీకు గూగుల్ సెర్చ్‌తో పరిచయముంటే ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'ఇండియన్ యంగ్ ఎచీవర్స్' అని టైపు చేయండి. వేలల్లో కాంతిపుంజాలు మీకు దర్శనమిస్తాయి. సంభ్రమాశ్యర్యాలతో మీలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని కలిగించి ఓ కొత్త జీవితపంథాకు నాంది పలుకుతాయి. అసాధ్యాలంటూ ఏముండవు గురువు గారు, అన్నీ సాధ్యాలే. మన ఆలోచనా రీతిని మార్చుకోవాలి అంతే ! నేనేమంత చదువుకున్న వాణ్ణి చెప్పండి ! అతి సామాన్యమైన గ్రాడ్యుయేట్‌ని. ఎటువంటి ఆర్థిక శక్తి, పరపతి లేని కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి.

కులం బలం లేని వాణ్ణి. గుజరాతీని కాదు..నేను స్థాపించిన ముద్రాకు ఎలాంటి వసతులు, వనరులు ఇవ్వలేని నగరం అహ్మదాబాద్. అయినా ముద్రా ఒక నిజం. మైకా ఒక నిజం.

పడికట్టు నమ్మకాలకు స్వస్థి చెప్పి, పట్టుదలతో, కృషితో నాస్తి దుర్భిక్షం అనే సంతృప్తితో ముందుకెళ్తే, ఏవీ అడ్డంకులు కావు. ఎవ్వరూ అడ్డురారు. ఆలోచించి చూడండి.


-ఎజి కృష్ణమూర్తి